Published : Jun 27, 2025, 09:58 AM ISTUpdated : Jun 27, 2025, 09:59 AM IST
ప్రతీ మహిళ జీవితంలో తల్లిగా మారడం అనే ఫేజ్ ఎప్పటికీ మర్చిపోలేనేది. అయితే ఇది సరైన సమయానికి జరిగితేనే మంచిది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది.
ఒక స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది అత్యంత విలువైన ఘట్టం. అయితే ఇది బాధ్యతతో కూడుకున్నదే కాకుండా, సరైన వయస్సులో జరగాల్సిన పరిణామం కూడా. చిన్న వయస్సులో తల్లి కావడం, శారీరకంగా.. మానసికంగా స్త్రీపై ప్రభావం చూపుతుంది. ఇది బిడ్డ అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు ఆలస్యంగా తల్లులవ్వడాన్ని ప్రాధాన్యత ఇస్తుంటారు.
26
చిన్న వయస్సులో తల్లులవుతోన్న దేశాలు
వరల్డ్ అట్లాస్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో మహిళలు సగటున 18 నుంచి 19.6 సంవత్సరాల మధ్య వయస్సులోనే తమ తొలి బిడ్డకు జన్మనిస్తున్నారు. ఈ జాబితాలో ఎక్కువగా ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాలే కనిపిస్తున్నాయి.
అందులో అత్యల్ప వయస్సులో తల్లులయ్యే దేశంగా అంగోలా ముందుంది. అక్కడ సగటున మహిళలు 18 సంవత్సరాల లోపు తల్లులు అవుతున్నారు. దీని తరువాత బంగ్లాదేశ్ ఉంది, అక్కడ సగటు వయస్సు 18.1 సంవత్సరాలు. నైజర్ దేశంలో కూడా ఇది అదే స్థాయిలో ఉంది. ఇక్కడ 18.1 సంవత్సరాలుగా ఉంది. చాడ్ దేశంలో ఇది 18.2 సంవత్సరాలు, మాలి – 18.6 సంవత్సరాలు, ఉగాండా – 18.6, ఘనా – 18.9 సంవత్సరాలుగా ఉంది.
36
నైజర్‌లో పరిస్థితి మరింత తీవ్రం
నైజర్ దేశంలో 20-24 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలలో 51 శాతం మంది 18 ఏళ్ల వయస్సులోనే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు అని నివేదిక చెబుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చిన్న వయస్సులో తల్లి అవ్వడాన్ని సూచించే అనూహ్య పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది ఆయా మహిళల ఆరోగ్యంపైనే కాక, వారి కుటుంబాల భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
విద్య లేకపోవడం, పేదరికం, సాంప్రదాయ విలువలు, కట్టుబాట్లు, అవగాహన లోపం, బాల్యవివాహాలు, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు చెబుతున్నారు. ఈ అంశాలు మహిళలను సమర్థవంతంగా తల్లులుగా మారే అవకాశం లేకుండా చేస్తూ, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.
56
బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరం
బంగ్లాదేశ్‌లో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. అక్కడ దాదాపు 51 శాతం బాలికలు 18 ఏళ్లలోపు వివాహం చేసుకుంటారు. బాల్యవివాహాల కారణంగా చిన్న వయస్సులోనే మహిళలు గర్భధారణకు గురవుతున్నారు. దీని వల్ల వారు అనేక ఆరోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితులు మహిళల స్వాతంత్రాన్ని , భద్రతను, విద్యను హరించేస్తున్నాయి.
66
ప్రపంచవ్యాప్తంగా సవాలు
చిన్న వయస్సులో తల్లులవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో ఈ ధోరణి తీవ్రంగా ఉంది. దీన్ని నియంత్రించాలంటే అవగాహన పెంపు, బాల్యవివాహాల నిషేధం, విద్యలో మహిళల భాగస్వామ్యం పెంపు వంటి చర్యలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.