
తకైచికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె జపాన్‌లోని నారా ప్రిఫెక్చర్‌లో జన్మించారు. తల్లి పోలీస్ విభాగంలో పనిచేసేవారు. చిన్ననాటి నుంచే స్వతంత్రత, ధైర్యం ఆమె వ్యక్తిత్వంలో కనిపించేవి. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆమె ఒక హెవీ మెటల్ బ్యాండ్‌లో డ్రమ్మర్‌గా ప్రదర్శనలు ఇచ్చారు. బైక్ రైడింగ్‌పై ఆమెకు మక్కువ ఉండేది. కవాసకి Z400 అనే బైక్ ఆమె ప్రియమైన రైడ్. ఆమెను ప్రపంచవ్యాప్తంగా ‘జపాన్ ఐరన్ లేడీ’గా అభివర్ణిస్తున్నారు. తకైచి తన రాజకీయ ఆలోచనల్లో కఠిన సంప్రదాయవాద వైఖరిని పాటిస్తారు.
తకైచికి జీవితంలో తొలి అడ్డంకి లింగ వివక్ష రూపంలో ఎదురైంది. ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి అర్హత సాధించినా, ఆమె తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి నిరాకరించారు. “ఆమె అమ్మాయి కాబట్టి ఇంటి దగ్గరే చదవాలి” అనే కారణంతో ఆమెను ప్రభుత్వ యూనివర్సిటీలోనే చేరమని ఒత్తిడి చేశారు. ఫలితంగా రోజుకు ఆరు గంటల ప్రయాణం చేస్తూ కోబ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ అనుభవమే ఆమెను పట్టుదలతో, స్వతంత్రంగా జీవించే వ్యక్తిగా తీర్చిదిద్దింది.
1987లో తకైచికి మత్సుషిత ఇన్‌స్టిట్యూట్ నుంచి స్పాన్సర్‌షిప్ లభించింది. దాంతో ఆమె అమెరికాకు వెళ్లి డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలితో ఫెలోగా పనిచేశారు. అక్కడి రాజకీయ వ్యవస్థ ఆమెకు కొత్త ఆలోచనలను నేర్పింది. తిరిగి జపాన్‌కి వచ్చిన తర్వాత ఆమె టీవీ ఆసాహి ఛానల్‌లో యాంకర్‌గా పనిచేశారు.
1993లో స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1996లో ఆమె అధికార పార్టీ LDPలో చేరారు. తకైచి మాజీ ప్రధాని షింజో అబేకి అత్యంత విశ్వసనీయ శిష్యురాలిగా గుర్తింపు పొందారు. అబే ప్రోత్సాహం వల్ల ఆమె మంత్రివర్గంలో కీలక స్థానాలు పొందారు.
2021, 2024లో పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా, 2025లో తిరిగి పోటీ చేసిన తకైచి ఈసారి గెలుపొందారు. ఇలా LDP చరిత్రలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా నిలిచారు. ఆమె విజయం వెనుక మాజీ ప్రధాని తారో అసో కీలక పాత్ర పోషించారు. ఆయన మద్దతుతోనే తకైచి మెజారిటీ సాధించారు.
తకైచి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆమె కఠిన వైఖరి, నిధుల వ్యవహారాలపై అసంతృప్తితో కోమెయిటో పార్టీ కూటమి నుంచి వైదొలిగింది. దాంతో ఆమె ప్రభుత్వానికి మెజారిటీ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తకైచి జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (Ishin no Kai)తో ఒప్పందం చేసుకున్నారు. అక్టోబర్ 20, 2025న ఈ సంకీర్ణ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేశారు.
తకైచి ఆర్థిక వ్యూహం “సకైనమిక్స్” పేరుతో ప్రాచుర్యం పొందింది. ఇది మాజీ ప్రధాని అబే అమలు చేసిన “అబేనమిక్స్”కు సమానంగా ఉంటుంది.
ఆమె ముఖ్య ప్రాధాన్యతలు:
* స్థానిక ప్రభుత్వాలకు భారీ గ్రాంట్లు.
* పెట్రోల్, డీజిల్‌పై తాత్కాలిక పన్ను రద్దు.
* వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పెంపు.
* AI, రక్షణ, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు.
తకైచి విజయం తర్వాత జపాన్ మార్కెట్‌లో ఉత్సాహం నెలకొంది. నిక్కీ 225 సూచీ 47,000 స్థాయిని దాటగా, యెన్ విలువ తగ్గింది. ఆమె ద్రవ్యోల్బణం వేతనాల పెరుగుదల వల్ల రావాలని కోరుతున్నారు.
సంప్రదాయవాద దృక్పథం
తకైచి కఠిన సంప్రదాయవాదిగా ప్రసిద్ధి చెందారు.
యాసుకుని మందిరాన్ని తరచుగా సందర్శిస్తారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 సవరణకు మద్దతిస్తున్నారు.
చైనాపై దృఢమైన వైఖరి
ఆమె మాటల్లో – “తైవాన్‌పై దాడి అంటే జపాన్‌పై దాడి” అనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తుంది.
సామాజిక అంశాల్లో వ్యతిరేక వైఖరి:
తకైచి మహిళా నాయకురాలైనా, లింగ సమానత్వం విషయాల్లో ఆమె అభిప్రాయాలు కొంత విరుద్ధంగా ఉంటాయి. వివాహిత జంటలు వేర్వేరు ఇంటిపేర్లు వాడకూడదని ఆమె అభిప్రాయం. స్వలింగ వివాహాలకు ఆమె వ్యతిరేకం. మహిళలు చక్రవర్తి వారసత్వాన్ని స్వీకరించడం ఆమెకు నచ్చదు. అయితే, ఆమె ప్రభుత్వం మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచుతుందని హామీ ఇచ్చింది. కేబినెట్‌లో 35-50% మహిళా మంత్రులను నియమించాలనేది ఆమె లక్ష్యం.
తకైచి భర్త తకు యమమోటో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2025 ఎన్నికల సమయంలో ఆయన పక్షవాతం రావడంతో ఆమె స్వయంగా కేర్‌టేకర్‌గా సేవలందించారు. ప్రధాని పదవికి పోటీ చేస్తూనే ఈ బాధ్యతను నిర్వర్తించడం ఆమె దృఢతను చూపిస్తుంది.
భవిష్యత్తు వైపు అడుగులు
సనాయ్ తకైచి ఇప్పుడు ప్రపంచ రాజకీయ వేదికపై కీలక స్థానంలో నిలబడ్డారు. చైనా ఒత్తిడి, ఆర్థిక సవాళ్లు, లింగ సమానత్వం వంటి అంశాలు ప్రస్తుతం ఆమె ముందున్న సవాళ్లు. కానీ హెవీ మెటల్ డ్రమ్మర్ నుంచి జపాన్ ఐరన్ లేడీగా ఎదిగిన ఈ నాయకురాలు తన పట్టుదలతో కొత్త చరిత్ర రాయబోతున్నారనే నమ్మకం ఉంది.
జపాన్ తొలి మహిళా ప్రధాని ఎన్నికైన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. “భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తకైచితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఇరుదేశాల భాగస్వామ్యం కీలకమని ఆయన తెలిపారు.