
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దు ప్రాంతమైన “దురండ్ లైన్” ఎప్పటినుంచో సమస్యగా ఉంది. ఈ విభజనను బ్రిటీష్ కాలంలో 1893లో చేశారు. దీంతో పాష్టూన్ ప్రజలు రెండు దేశాల మధ్య విడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటినుంచీ ఈ సరిహద్దును అంగీకరించలేదు. అందుకే సరిహద్దు ప్రాంతాల్లో చిన్నపాటి తగాదాలు, కాల్పులు తరచుగా జరుగుతూనే ఉంటాయి.
పాకిస్తాన్ వైపు నుంచి ఫైటర్ జెట్లు, డ్రోన్లు వాడి ఆఫ్ఘన్ భూభాగంలో బాంబులు వేయడంతో, తాలిబాన్ బలగాలు కూడా ప్రతిదాడికి దిగాయి. కొన్ని రోజుల పాటు ఇరువైపులా కాల్పులు, పేలుళ్లు, సరిహద్దు గేట్లు ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
“తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)” అనే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్‌లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని, పాక్‌పై దాడులు చేస్తోందని పాకిస్థాన్ చెబుతోంది. అయితే “పాక్ అనవసరంగా మా భూభాగంలోకి దాడులు చేస్తోంది” అని ఆఫ్గనిస్తాన్ అంటోంది.
చమన, స్పిన్ బోల్డక్, ఖోస్ట్ ప్రాంతాల్లో రెండు దేశాల సైనికులు సరిహద్దు నియంత్రణ కోసం తరచుగా పోట్లాడుతుంటారు. ఈసారి పరిస్థితి అంతగా తీవ్రంగా మారడంతో రెండు వైపులా వందల మంది చనిపోయారు.
2021లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్‌తో సంబంధాలు చెడిపోయాయి. రెండు దేశాల మధ్య వాతావరణం గంభీరంగా మారింది. అయితే ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. కానీ పాకిస్థాన్ దీనిని ఉల్లంఘించింది అంటూ ఆఫ్గనిస్థాన్ ఆరోపించింది. శాంతి ఒప్పందంపై కూడా రెండు దేశాలు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. “మేము పాకిస్తాన్ బలగాలను బలంగా ఓడించాం. వారే ఓడిపోయి ముందుగా శాంతి ఒప్పందం కోరారు” అని తాలిబాన్ అధికారులు చెప్పగా.. “తాలిబాన్‌లే సీజ్ ఫైర్ ప్రతిపాదన తీసుకొచ్చారని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.
రెండు దేశాలు తమకనుకూలంగా కథలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఖతార్ అనే మూడో దేశం మధ్యవర్తిగా పనిచేసింది. ఖతార్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేసిన తర్వాతే రెండు దేశాలు 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించారు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కి ఖతార్ మంత్రి “మీరు శాంతి దిశగా ముందుకు రావడం అభినందనీయం” అని మెసేజ్ పంపారు. అంటే స్పష్టంగా పాకిస్తానే ముందుగా మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాను సంప్రదించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆఫ్ఘన్ పక్షం ప్రకారం: పాక్ వైమానిక దాడుల్లో 200 మందికి పైగా మృతి చెందారు.
పాక్ పక్షం ప్రకారం: తాలిబాన్ దాడుల్లో 23 మంది పాక్ సైనికులు చనిపోయారు.
సరిహద్దు ప్రాంతాల్లో గేట్లు, భవనాలు, మార్కెట్లు దెబ్బతిన్నాయి.
మహిళలు, పిల్లలు సహా వందలాది సాధారణ ప్రజలు గాయపడ్డారు.
తాలిబాన్‌లు చెబుతోన్న దాని ప్రకారం.. పాక్ దాడి చేయకపోతే శాంతి ఒప్పందం ఎప్పటికీ కొనసాగుతుందని అంటోంది. అయితే పాకిస్థాన్ మాత్రం కేవలం “48 గంటల పాటు మాత్రమే ఒప్పందం ఉంది.” అని అంటోంది. అంటే ఇరువైపుల మధ్య నమ్మకం ఇంకా లేదు. కాబట్టి ఈ ఒప్పందం ఎక్కువ రోజులు నిలవదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సమస్యల మూలం “దురండ్ లైన్”గా భావిస్తున్నారు.దురండ్ లైన్ అనే సరిహద్దు రేఖ ఈ ఇద్దరు దేశాల మధ్య ప్రధాన కారణం. ఇది 1893లో బ్రిటిష్ ఇండియా సమయంలో విభజించారు. ఈ లైన్ వల్ల పాష్టూన్ తెగలు రెండు దేశాల్లో విడిపోయాయి. “దురండ్ లైన్ తమ భూభాగాన్ని విభజించిందని, తాము దాన్ని అంగీకరించం” అని తాలిబన్లు ఎప్పటి నుంచో చెబుతున్నారు. పాకిస్థాన్ మాత్రం ఇది తమ అధికారిక సరిహద్దు అని అంటోంది. ఈ వాదనలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.
ఈ యుద్ధం భారత్‌కి కూడా పరోక్ష ప్రభావం చూపవచ్చు.
భద్రతా దృష్టి
పాక్ అంతర్గత సమస్యలు ఎక్కువైతే, ఉగ్రవాద గ్రూపులు కాశ్మీర్ వైపు దృష్టి మళ్లించే అవకాశం ఉంది. భారత్ భద్రతా సంస్థలు ఇప్పటికే ఈ పరిణామాలను గమనిస్తున్నాయి.
వ్యూహాత్మక లాభాలు
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య పాత స్నేహం ఉంది. తాలిబాన్ ఇప్పుడు పాక్‌తో విభేదిస్తే, భారత్-ఆఫ్ఘన్ సంబంధాలు మళ్లీ బలపడే అవకాశం ఉంది. ఇటీవల అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
అశాంతి నెలకొనే అవకాశాలు
పాక్-ఆఫ్ఘన్ యుద్ధం ఇలాగే కొనసాగితే.. మధ్యప్రాచ్యంలో కూడా అస్థిరత పెరిగే అవకాశం ఉంది. భారత్ ఖతార్, సౌదీ, అమెరికా వంటి దేశాలతో కలిసి “peace diplomacy”లో పాత్ర పోషించే అవకాశం ఉంది.