B2 Bomber: ఒక్క విమానం ధ‌ర రూ. 16వేల కోట్లు.. ఈ అమెరికా 'గబ్బిలాల' గురించి తెలుసా..?

Published : Jun 23, 2025, 04:59 PM ISTUpdated : Jun 23, 2025, 05:00 PM IST

ఇరాన్‌లోని ఫోర్డో, న‌తాంజ్‌, ఇస్పాహ‌న్ అణు కేంద్రాల‌పై అమెరికా దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకోసం అమెరికా బీ-2 స్పిరిట్ విమానాల‌ను ఉప‌యోగించింది. దీంతో ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు వీటి గురించే మాట్లాడుకుంటోంది. 

PREV
15
ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన స్టెల్త్ బాంబ‌ర్

చూడ్డానికి గ‌బ్బిలాన్ని పోలిన ఆకారంలో ఉండే B-2 బాంబర్, లేదా B-2 Spirit, ప్రపంచంలో అత్యంత ఆధునికమైన, ఖరీదైన స్టెల్త్ బాంబర్లలో ఒకటి. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలు అభివృద్ధి చేసిన ఒక రహస్య విమానం. శత్రువుకు కనిపించకుండా వెళ్లి అత్యంత కీలక టార్గెట్లపై అణుబాంబులు సహా శక్తివంతమైన పేలుడు ఆయుధాలను వేసే సామర్థ్యం దీంట్లో ఉంది.

25
ఈ విమానం ఎలా పనిచేస్తుంది?

B-2 బాంబర్ “ఫ్లయింగ్ వింగ్ డిజైన్” పై ఆధారపడింది. దీని డిజైన్ కారణంగా ఇది రాడార్‌లకు చిక్క‌దు. అంటే రాడార్ ద్వారా గుర్తించలేని విధంగా ఇది శత్రు దేశాల్లోకి ప్రవేశించి టార్గెట్‌ను ధ్వంసం చేయగలదు. దీనికి కార‌ణం దీని ఆకారంతో పాటు దీని త‌యారీ విధానం.

రాడ‌ర్ నుంచి వ‌చ్చిన సిగ్న‌ల్స్ ఈ విమానంపై ప‌డిన త‌ర్వాత రిఫ్లెక్ట్ అయ్యే సిగ్నల్స్ రాడార్ కేంద్రానికి వెళ్ల‌కుండా విచ్చిన్న‌మ‌వుతాయి. దీంతో దీని జాడ‌ను గుర్తించ‌లేరు. అలాగే ఈ విమానంలో ఉండే మెటీరియ‌ల్ రాడార్ నుంచి వ‌చ్చిన సిగ్న‌ల్స్‌ను త‌న‌లోకి లాక్కుంటాయి. ఈ విమానంలో ఉపయోగించే రాడార్-అవాయిడెన్స్ టెక్నాలజీ, ప్రత్యేక పూతలు (coatings), లో-ప్రొఫైల్ స్ట్రక్చర్ దీన్ని "ఇవిడెన్స్-లెస్" యుద్ధవిమానంగా మారుస్తాయి.

35
B-2 బాంబర్ తయారీకి ఎంత ఖర్చవుతుంది?

B-2 Spirit బాంబర్ తయారీకి ఖర్చు భారీగా ఉంటుంది. ఒక్క B-2 బాంబర్ తయారీకి సుమారు $2 బిలియన్లు ఖ‌ర్చ‌వుతుంది. అంటే మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే దీని విలువ ఏకంగా రూ. 16,000 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధవిమానంగా గుర్తింపు పొందింది. ఒక్క అమెరికాకు మాత్ర‌మే ఈ టెక్నాలజీ సొంతం. ఇక బీ2 బాంబ‌ర్‌ల‌ను ఆప‌రేట్ చేయ‌డానికి ఎక్కువ సంఖ్య‌లో సాంకేతిక నిపుణులు అవ‌స‌ర‌ప‌డ‌తారు.

ఎప్పుడు అభివృద్ధి చేశారు?

B-2 Spirit బాంబర్‌ను అమెరికా 1980లలో అభివృద్ధి చేయడం మొదలు పెట్టింది. మొదటి విమానంను 1989లో అమెరికన్ వాయుసేనకు అప్ప‌గించారు. Northrop Grumman కంపెనీ ఆధ్వర్యంలో ఈ విమానాల‌ను అభివృద్ధి చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 21 బాంబర్లు మాత్రమే తయారయ్యాయి.

45
అస‌లు అమెరికా వీటిని ఎందుకు త‌యారు చేసింది.?

B-2 బాంబర్ అభివృద్ధి కార్యక్రమం మొదటగా "Advanced Technology Bomber" పేరుతో ప్రారంభమైంది. కోల్డ్ వార్ స‌మ‌యంలో సోవియట్ యూనియన్‌పై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. సోవియ‌ట్ యూనియ‌న్‌పై అనుబాంబులు ప్ర‌యోగించేందుకు చేప‌ట్టారు.

అయితే సోవియ‌ట్ యూనియ‌న్ ప‌త‌నంతో వీటి ఉప‌యోగం రాకుండా పోయింది. అయితే కొన్నేళ్ల పాటు చేప‌ట్టిన రహస్య అభివృద్ధి తరువాత, దీన్ని 1997లో ప్రాథమికంగా యుద్ధ వినియోగంలోకి తీసుకొచ్చారు. తరువాత కాలంలో ఇది కోసోవో యుద్ధం (1999), ఆఫ్ఘనిస్తాన్‌ (2001), ఇరాక్ యుద్ధం (2003) వంటి ఘర్షణల్లో కీలక పాత్ర పోషించింది.

55
దీని ఉప‌యోగం ఏంటి.?

ఈ విమానాన్ని నిర్మించడంలో ప్రధాన ఉద్దేశం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన, అత్యధిక రేంజ్ ఉన్న స్టెల్త్ బాంబర్ తయారుచేయడం. దీన్ని ఏదైనా పెద్ద పట్టణం, సైనిక స్థావరం, బంకర్, అణ్వాయుధ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలిగేలా రూపొందించారు.

B-2 బాంబర్ ప్ర‌త్యేక‌త‌లు

ఒక్క‌సారి ఫ్యూయ‌ల్ ఫిల్ చేస్తే ఏకంగా 11,000 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది. అయితే ఇన్‌ఫ్లైట్ రీఫ్యుయలింగ్‌తో మరింత ఎక్కువ దూరం వెళ్తుంది. ఈ విమానం గంట‌కు సుమారు 1010 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. 20 టన్నుల ఆయుధాల‌ను మోసుగెళ్ల‌గ‌ల‌దు.

స్టెల్త్ టెక్నాలజీతో ఈ విమానం రాడార్‌లను తప్పించుకుంటుంది. ప్రపంచంలోని ఏ టార్గెట్‌నైనా చేధించ‌గ‌ల‌దు. కేవలం ఇద్దరు పైలట్లు తేలికగా నియంత్రించగలరు. భూమిని డ్రిల్ చేసి లోప‌ల ఉన్న ల‌క్ష్యాల‌ను సైతం ఈ విమానం టార్గెట్ చేయ‌గ‌ల‌దు.

అభివృద్ధి ద‌శ‌లో ఉన్న బీ21 రైడ‌ర్

B-2 బాంబర్ ఇప్పటికీ అమెరికా గగన దళానికి ఒక ముఖ్యమైన ఆయుధం. అయితే B-21 Raider అనే కొత్త తరహా స్టెల్త్ బాంబర్ 2020లలో అభివృద్ధి అవుతోంది. ఇది B-2కు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందిస్తున్నారు. B-2 బాంబర్ 2030 నుంచి సేవ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories