
ఇరాన్ పతనం ఆరంభమైందా.? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతం లక్ష్యంగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. దీంతో ఇరాన్ అంతం మొదలైందని ప్రపంచమంతా చర్చ జరుగుతోంది.
అయితే ఇదే సమయంలో ఇరాన్ 2004లో చేసిన ఓ దారుణమైన చర్య కారణంగానే ఇప్పుడు తగి శాస్తి జరిగిందని సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. 16 ఏళ్ల అతీఫ్ రజబి సహాలే మరణం ఇరాన్‌ను వెంటాడుతోంది అనేది సదరు చర్చ సారాంశం.
ఇరాన్‌కు చెందిన 16 ఏళ్ల అతీఫ్ రజబి సహాలేను ఆ దేశం ఉరి తీసింది. అది కూడా బహిరంగంగా అందరూ చూస్తుండగానే ఉరి తీశారు. 2004 ఆగస్ట్ 15న ఇరాన్‌లోని నేకా పట్టణంలో ఆమెను ప్రజల ముందే చంపారు. ఉరి శిక్ష వేసేంత తప్పు ఏం చేసిందనేగా మీ సందేహం.
నిజానికి ఆమె నేరస్తురాలు కాదు బాధితురాలు. తల్లి, తండ్రిలేని ఆ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీనిని ఇరాన్ చట్టం ప్రకారం నేరంగా పరిగణించారు. కన్యత్వాన్ని కోల్పోవడమే ఆమె చేసిన తప్పంటూ నేరస్తురాలిగా తీర్మానించింది.
అయితే అతీఫ్‌కు మరణ శిక్ష వేయడానికి మరో కారణం ఉంది. తనకు అన్యాయం జరిగిందని పోలీసుల వద్దకు వెళితే.. తనదే తప్పని కోర్టు చెప్పడం ఆమెలో కోపాన్ని పెంచింది. దీంతో కోర్టు హాల్లోనే హిజాబ్ తొలగించి తన నిరసనను తెలిపింది. దీన్ని కోర్టు తీవ్రమైన నేరంగా పరిగణించి ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
కట్టలు తెంచుకున్న కోపంతో యువతి జడ్జిపైకి చెప్పును విసిరింది. దీంతో యావజ్జీవ కారాగార శిక్షను ఉరిశిక్షగా మార్చేశారు. ఆమెను బహిరంగంగా ఉరితీశారు.
నిజానికి ఇరాన్ చట్టాల ప్రకారం 18 ఏళ్లు నిండని వారికి ఉరి శిక్ష అమలు చేయకూడదు. కానీ ఆ యువతిని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కోర్టు ఫైళ్లలో వయసును తప్పుగా చూపించి అతీఫ్‌కు ఉరిశిక్ష పడేలా చేశారు. అలా ఒక అమాయక యువతిని ఇరాన్ పొట్టన పెట్టుకుంది.
ఆ యువతి శాపం తగిలింది.
కాగా ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతోన్న పరిస్థితులను ఊటంకిస్తూ ఆ యువతి శాపమే ఆ దేశానికి తగిలింది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. @Brand_Netan అనే యూజర్ ఈ సంఘటనను వివరిస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ యువతిని ఉరి తీసిన నాటి నుంచి ఇరాన్‌కు నెమ్మదిగా శాపం పట్టింది అంటారని రాసుకొచ్చారు.
కేవలం ఇరాన్‌లో మాత్రమే కాకుండా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, మహిళలకు రక్షణ ఉండదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
అతీఫ్ రజబి సహాలే ఉరిశిక్ష వ్యవహారం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఇరాన్లో “నైతిక నేరాల” పేరిట మహిళలపై ఉరి శిక్షలు, లాఠీ దెబ్బలు, అరెస్టులు జరిగిన నేపథ్యంలో ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇరాన్‌లో మహిళలకు హక్కులు చాలా తక్కువగా ఉంటాయి. వారి దుస్తులు, ప్రవర్తన అన్నింటినీ మోరాలిటీ పోలీస్‌లు నిఘా పెడతారు.
అయితే ఇరాన్‌లో తొలిసారి 2022లో తిరుగుబాటు మొదలైంది. మహ్సా అమినీ అనే యువతి మోరాలిటీ పోలీస్ అదుపులో చనిపోవడం తర్వాత "జన్, జిందగీ, ఆజాదీ" (స్త్రీ, జీవితం, స్వేచ్ఛ) ఉద్యమం ఎగిసిపడింది.
ఇది దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో మహిళల న్యాయ హక్కుల కోసం గళం ఎత్తిన ఉద్యమంగా మారింది. అయితే మత చాందస వాదంతో ఉండే ఇరాన్‌లో ఇప్పటికీ మహిళలకు సరైన న్యాయం జరగట్లేదు అనేది బహిరంగ రహస్యంగానే ఉంది.