ఈ అలవాట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి..

First Published Jun 2, 2023, 2:54 PM IST

ఒత్తిడిని చిన్న సమస్యగా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది మానసిక సమస్యలకే కాదు శరీరక సమస్యలకు కూడా కారణమవుతుంది. అయితే కొన్ని అలవాట్లతో  ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 
 

ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి ప్రస్తుతం చాలా మంది బాధపడుతున్న సమస్యలలో ఒకటి. ఒత్తిడికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పని భారం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు మొదలైనవి మనల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. యోగా, ధ్యానం వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గకపోతే ఖచ్చితంగా సైకాలజిస్టును సంప్రదించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొన్ని అలవాట్లు కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే.. 

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల 'ఒత్తిడి' తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆందోళనను తగ్గించడానికి సహాయపడే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి వ్యాయామం ఎంతో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని మరింత రిలాక్స్డ్ గా ఉంచుతుంది. 
 

నిద్ర

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి నిద్ర చాలా చాలా అవసరం. మీరు కంటి నిండా నిద్రపోనప్పుడు చంచలంగా, అలసటగా, యాంగ్జైటీగా ఉంటారు. నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి రాత్రిపూట కనీసం ఏడెనిమిది గంటలైనా నిద్రపోయేలా చూసుకోండి.
 

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరానికే కాదు మనస్సుకు కూడా సహాయపడుతుంది. తీపి, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ వంటి వివిధ రకాల ఆహారాలను తినండి.
 

మొబైల్ ఫోన్లు

మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. అందుకే మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు మొదలైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను  ఉపయోగించే అలవాటును తగ్గించండి. 

ఇష్టమైన పని

మీరు చేసే పనులపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి, ఒత్తిడిని నివారించడానికి సహాయపడుతుంది.

click me!