
ఇప్పటి రోజుల్లో ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడానికి సమయం దొరకడం లేదు. ఉద్యోగ భారం, ట్రాఫిక్, ఇంటి బాధ్యతలు ఇలా అన్ని కలిపి మనం మన శరీరాన్ని పట్టించుకోకుండా అశ్రద్ధగా ఉండే పరిస్థితి ఏర్పడింది. "సమయం లేకపోతే వ్యాయామం ఎలా చేయాలి?" అన్న ప్రశ్న చాలామందిని ఆలోచనలో పడేస్తోంది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని చాలామంది మరిచిపోతున్నారు – ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు, దానికోసం పెద్దగా సమయం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందుకే మైక్రో-వర్కౌట్ అనే చిన్న కానీ ప్రభావవంతమైన మార్గం తాజాగా ఫిట్‌నెస్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సూక్ష్మ వ్యాయామాలు అంటే గంటల తరబడి జిమ్‌లో కాలం గడపడం, లేకపోతే ఉదయం వేళా జాగింగ్‌కు వెళ్లడం అవసరం లేకుండా, మనం చేస్తున్న పనుల్లో చిన్న విరామాల్లో చేయగలిగే సరళమైన, తక్కువ వ్యవధి వ్యాయామాలు. ఇవి సాధారణంగా 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తయ్యే శరీర శ్రమలు. ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం ఉండదు. ముఖ్యంగా మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బయట వున్నా – ఈ చిన్న వ్యాయామాలను చేయడం వల్ల రోజంతా మీరు ఉత్సాహంగా, చురుకుగా ఉండగలుగుతారు.
ఈ మైక్రో వ్యాయామాల తత్వం చాలా స్పష్టంగా ఉంది – చిన్న వ్యవధిలో శరీరాన్ని కదిలించడం ద్వారా శక్తిని పెంచడం. ఉదాహరణకు, ఉదయం లేచిన వెంటనే నాలుగు నిమిషాలు స్ట్రెచింగ్ చేయడం. పని మధ్యలో కాసేపు లేచి 15 స్క్వాట్లు చేయడం. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం. మీ వర్క్ డెస్క్ వద్ద కూర్చునే క్రమంలో మెడ, భుజాల కోసం కొన్ని చిన్న కదలికలు చేయడం. ఇవే కాకుండా కేవలం ఐదు నిమిషాల పాటు గోడకు ఆనుకుని నిలబడటం లేదా కుర్చీలో కూర్చొని లెగ్ రైజెస్ చేయడం లాంటివి కూడా ఈ జాబితాలో ఉంటాయి.
ఇవి చిన్నవి గానీ శరీరానికి విశేష ప్రయోజనాలు కలిగిస్తాయి. ఉదాహరణకు, ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే రక్తప్రసరణ సమస్యలు, మానసిక అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చిన్న మోతాదులో శ్రమ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు (ఎండార్ఫిన్లు) ఉత్పత్తి అవుతాయి. ఇవి మనలో ఆనందభావాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, పని సామర్థ్యం పెరుగుతుంది.
పెద్దగా టైమ్ తీసుకోకుండా చేసుకునే ఈ సూక్ష్మ వ్యాయామాలు, వ్యాయామాన్ని మన దినచర్యలో భాగంగా మార్చడానికి చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు రోజులో మూడు సార్లు ఐదు నిమిషాల మైక్రో వర్కౌట్స్ చేస్తే, అది రోజుకు పదిహేనునిమిషాల వ్యాయామం అవుతుంది. ఇది ప్రారంభ దశలో ఉన్నవారికి మోటివేషన్‌గా మారుతుంది. ఆ తరువాత దీన్ని స్థిరంగా కొనసాగించడం ద్వారా పెద్ద ఫిట్‌నెస్ లక్ష్యాలను కూడా చేరుకోవచ్చు.
ఈ విధమైన మైక్రో వ్యాయామాలు ఏ వయస్సులో ఉన్నవారు అయినా ప్రయత్నించవచ్చు. యువత, వయోజనులు, ఇంటి పనుల్లో బిజీగా ఉన్న మహిళలు, కార్యాలయంలో నాన్స్టాప్ కూర్చునే ఉద్యోగులు – ఎవరికైనా ఇది వర్కౌట్ చేయడానికి ఒక ఉత్తమ మార్గం. ముఖ్యంగా వృద్ధులు, వారికోసం సాఫ్ట్ మైక్రో వర్కౌట్స్ ఉండేలా ప్రణాళిక చేసుకుంటే, శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.
ప్రతి 60 నుండి 90 నిమిషాలకొకసారి లేచి శరీరాన్ని కదిలించడం, చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా మెదడు కూడా కొత్త ఉత్సాహాన్ని పొందుతుంది. దీనివల్ల పని లోనూ మన ఫోకస్ మెరుగవుతుంది.ఈ మైక్రో బ్రేక్‌లు మన శరీరానికి బ్రతుకు త్రాణం లాంటివే. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యాన్ని కూడా సమతుల్యంగా ఉంచుతుంది. ఉదాహరణకు, ఎక్కువ సమయం స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల వచ్చే కంటిపోటు, మెడ నొప్పి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి.