కేవలం తినడం వల్లే బరువు పెరుగుతారని మీరు కూడా నమ్ముతారా? ఒకవేళ అవును అనుకుంటే.. ఒక అధ్యయనం వెల్లడించిన ఫలితాలను చూస్తే షాక్ అవుతారు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు యూరోపియన్ న్యూట్రిషన్ కాన్ఫరెన్స్ లో ..10 గంటలలోపు అంటే రోజుకు కేవలం 10 గంటల నిర్ణీత సమయంలో తింటే మీ మానసిక స్థితి, ఆకలి, శక్తి స్థాయిలు మెరుగుపడతాయని వెల్లడించారు.
అంటే మీరు పగటిపూట ఏం తినాలనుకుంటున్నారో వాటిని 10 గంటల్లోపు తినాలన్న మాట. అలాగే మిగిలిన 14 గంటల్లో మీరు ఏమీ తినకూడదు. దీనినే మనం అడపాదడపా ఉపవాసం అని అంటాం. ఈ తినే పద్ధతిని అవలంబించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మనం ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ పద్ధతిని అనుసరించాలి. అప్పుడే మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఈ 10 గంటల భోజన సమయంలో మీరు ఎక్కువగా నివారించాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది.
ఈ అధ్యయనం ప్రకారం.. మన ఆరోగ్యం ఎలా ఉండాలనేది మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన ఆహారపు అలవాట్లు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. మరి ఏయే ఆహారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
భోజన సమయం
మనం ఏ సమయంలో తింటామనేది కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రి లేట్ గా తినడం, ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం వంటి అలవాట్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తిరోజూ ఒకే సమయానికి తినేలా షెడ్యూల్ చేయండి. అయితే భోజన సమయాన్ని సెట్ చేసేటప్పుడు రాత్రి 7-7:30 గంటల మధ్య భోజనం చేసేలా చూసుకోండి.
ఆహారాన్నిబాగా నమిలి తినాలి
బిజీలైఫ్ స్టైల్ వల్ల చాలా మంది త్వర త్వరగా తింటుంటారు. అంటే ఫుడ్ ను సరిగ్గా నమలరు. అయితే ఫుడ్ ను సరిగ్గా నమిలితే మన లాలాజలం ఆహారంతో బాగా కలిసిపోతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మనం ఫుడ్ ను సరిగ్గా నమలనప్పుడు లాలాజలం మన ఆహారంతో సరిగ్గా కలవదు. దీని వల్ల మీకు జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి.
ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి
మనలో చాలా మంది బోర్ గా అనిపించినప్పడు ఏదో ఒకటి తింటుంటారు. కానీ దీనివల్ల మీరు బరువు పెరిగి ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు. అందుకే మీరు తినడానికి ముందు ఎందుకు తినాలనుకుంటున్నారో తెలుసుకోండి. మీకు ఆకలిగా అనిపించినప్పుడు మాత్రం తినండి.