చాలామందికి జీర్ణం అవటం అనేది పెద్ద సమస్య. అయితే అందుకు కారణం కూడా చాలా మటుకు స్వయంకృతాపరాధమే అయి ఉంటుంది. ఎందుకంటే వేళకి భోజనం చేయకపోవడం, అతిగా భోజనం చేయడం కారాలు, మసాలాలు ఎక్కువగా ఉండే భోజనాలు చేయడం..
వంటివి చేయటం వలన ఈ అజీర్ణ సమస్య వస్తుంది. మనం తిన్న ఆహారాన్ని కాలేయం నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు జీర్ణమయ్యేలాగా చేస్తాయి. తద్వారా మనిషి శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే గ్యాస్, ఎసిడిటీ,కడుపునొప్పి, విరోచనాలు తదితర సమస్యలు వస్తూ ఉంటాయి.
అయితే ఈ చిట్కాలను పాటించి అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. భోజనం చేసే ముందు ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని తాగాలి. రోజుకు మూడు పూటలా ఇలా చేస్తుంటే అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్ సమస్య కూడా పోతుంది.
భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కని తినడం అలవాటు చేసుకుంటే జీర్ణ సమస్యలు మీ దగ్గరికి కూడా రావు. అలాగే భోజనం చేసిన తర్వాత రెండు స్పూన్ల సోంపు గింజలను నమిలి తినటం వలన ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.
అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజు మూడు పూటలా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని భోజనానికి అరగంట ముందు తాగాలి. దీంతో అజీర్ణ సమస్య బాగా తగ్గుతుంది. అలాగే భోజనం అనంతరం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగుతూ ఉండాలి.
దీని వలన కూడా జీర్ణ సమస్యలు త్వరగా తగ్గుతాయి. అలాగే భోజనం చేసిన తర్వాత ద్రాక్ష,జామకాయలు, చెర్రీలు, పైనాపిల్ వంటి పండ్లను తింటే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.