గుండెపోటు (Myocardial Infarction) అనేది అత్యంత అత్యవసర వైద్య పరిస్థితి. ఇది గుండె కండరాలలో ఒక భాగానికి కావలసినంత రక్త ప్రవాహం అందకపోవడం వల్ల సంభవిస్తుంది. రక్తప్రవాహం ఆగిపోయినప్పుడు గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు, దాంతో కండర కణాలు దెబ్బతిని చనిపోవడం ప్రారంభమవుతుంది. గుండె ధమనుల్లో అడ్డంకి ఏర్పడడం.. ముఖ్యంగా కొవ్వు, కొలెస్ట్రాల్, ప్లాక్ పేరుకుపోవడం.. రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కారణం అవుతుంది. చివరికి హార్ట్ ఎటాక్ రావడానికి కారణం అవుతుంది.
నిపుణుల ప్రకారం, గుండెపోటును సూచించే ప్రధాన సంకేతాలు ఇవి:
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం
ముఖ్యంగా ఛాతీ మధ్యలో బరువుగా, నొప్పిగా లేదా మంటగా అనిపించడం. ఈ నొప్పి కొన్ని నిమిషాలు కొనసాగవచ్చు లేదా నొప్పి వస్తూ పోతూ ఉండొచ్చు.
శరీరంలోని పైభాగాలలో నొప్పి
చేతులు, వీపు, మెడ, దవడ లేదా కడుపు ప్రాంతాలకు నొప్పి వ్యాపించడం గుండెపోటుకు సూచన కావచ్చు.
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
ఛాతీ నొప్పితో పాటు లేదా ఛాతీ నొప్పి లేకుండానే శ్వాస తీసుకోవడంలో కష్టంగా అనిపించవచ్చు.
అసహజ శారీరక ప్రతిస్పందనలు
చెమట పడటం, వికారం, వాంతులు, తల తిరగడం లేదా మూర్ఛ వచ్చినట్లుగా అనిపించడం. వైద్య నిపుణుల ప్రకారం, ఈ లక్షణాలు స్త్రీలలో పురుషుల కంటే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.