ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి మహిళలో అనేక శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత చాలామందికి జుట్టురాలడం సమస్య ఎదురవుతుంది. డెలివరీ తర్వాత అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ ఆడవాళ్ల జీవితంలో చాలా మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత మహిళలు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. వాటిలో ఒకటి జుట్టు రాలడం. ప్రసవం తర్వాత జుట్టు రాలడం చాలా మంది మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య.
గర్భానికి ముందు, గర్భధారణ సమయంలో, డెలివరీ తర్వాత హార్మోన్ల మార్పులు మహిళల జుట్టు పెరుగుదలను గందరగోళానికి గురిచేస్తాయి. దీని కారణంగా జుట్టు రాలుతుంటుంది. ప్రసవం తర్వాత హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం సాధారణం. వాటి లక్షణాలలో ఒకటి జుట్టు రాలడం. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇక్కడ చూద్దాం.
26
జుట్టు రాలడం తాత్కాలికం
డెలివరీ తర్వాత జుట్టు రాలడం తాత్కాలికం. 6 నుంచి 12 నెలల్లో తగ్గిపోతుంది. అలసట, ఒత్తిడి, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి లాంటి సమస్యలు కూడా ప్రసవం తర్వాత జుట్టు రాలడానికి కారణమవుతాయి.
36
జుట్టు రాలడాన్ని ఎలా ఆపాలి?
1. ఆరోగ్యకరమైన ఆహారం:
ఐరన్, ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోండి. దీని కోసం ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసం లాంటివి తినండి.
2. తగినంత నీరు:
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. నీరు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
46
3. ఒత్తిడి:
యోగా, ధ్యానం లేదా ఏదైనా చిన్న వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది.
4. జుట్టు సంరక్షణ:
తలస్నానం చేసేటప్పుడు జుట్టును గట్టిగా రుద్దకూడదు, నెమ్మదిగా రుద్దాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ దువ్వకూడదు. జుట్టు కోసం సల్ఫేట్ లేని షాంపూ, కండీషనర్ మాత్రమే ఉపయోగించాలి.
56
5. జుట్టుకు మసాజ్:
కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో మీ తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేయాలి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది, రక్త ప్రసరణను పెంచుతుంది.
6. మంచి నిద్ర అవసరం:
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీనివల్ల జుట్టు రాలడం పెరుగుతుంది.
66
7. చిట్లిన జుట్టు చివర్లు:
జుట్టు చివర్లు చిట్లినట్లయితే వాటిని కత్తిరించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. లేకపోతే అవి జుట్టు రాలడానికి కారణమవుతాయి.
8. వైద్యుడిని సంప్రదించండి:
మీకు జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే, తప్పకుండా మంచి వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.