
స్ట్రోక్ అనేది ప్రాణాంతక పరిస్థితి, ఇది అకస్మాత్తుగా వస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు. అయితే స్ట్రోక్ రాకముందే మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వీటిని అస్సలు విస్మరించకూడదు. స్ట్రోక్ రాబోతున్నదీ ఎలా గుర్తించాలి? స్ట్రోక్ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం:
చాలా మందికి తలతిరుగుడు అనేది ఒక సాధారణ సమస్యగా అనిపిస్తుంది. ఉదాహరణకు సరిగ్గా తినకపోవడం, ఎండలో ఎక్కువసేపు తిరగడం, తగినంత నీరు తాగకపోవడం, నిద్ర నుండి ఒక్కసారిగా లేచినప్పుడు ఇలా జరగడం సాధారణమే. అలాంటప్పుడు తలతిరగడం, తూలిపోవడం, కొంతసేపు స్థిరంగా నిలబడి ఉండలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అయితే.. ఈ లక్షణం తీవ్రమైతే స్ట్రోక్‌కు హెచ్చరికలు కావచ్చని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, తీవ్రతను బట్టి వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదాలకు సంకేతాలవుతాయని గుర్తుంచుకోవాలి.
తలనొప్పి.. ఇది సాధారణ ఆరోగ్య సమస్య. ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు చూడటం, టీవీ గానీ, ల్యాప్టాప్ గానీ, కంప్యూటర్ స్క్రీన్‌ల ముందు ఎక్కువసేపు గడపడం వల్ల ఈ సమస్య రావచ్చు. అలాగే మానసిక ఒత్తిడి, మైగ్రేన్, సైనస్ సమస్యల వల్ల తలనొప్పి రావడం సహజం. అయితే ఇది సాధారణమైనదే అని భావించి నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.
కొందరికి ఆకస్మికంగా, తీవ్రమైన తలనొప్పి రావడం స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. దీని వెనుక ముఖ్యమైన కారణం మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటమే. ఆ అడ్డంకుల వల్ల ఆక్సిజన్ సరఫరా ఆటంకం ఏర్పడుతుంది. దీంతో మెదడు ఉధృతంగా స్పందిస్తూ తీవ్రమైన తలనొప్పిగా సంకేతం ఇస్తుంది. ఇలాంటి పరిస్థితిని లైట్ గా తీసుకోకూడదు. తీవ్ర తలనొప్పి అంటే మీ మెదడు సహాయం కోరుతోందని గుర్తుంచుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎక్కువ పని చేసినప్పుడు అలసట రావడం సహజమే. అయితే అదే అలసట అసాధారణంగా ఉండటం, ఎంత నిద్రపోయినా తగ్గకపోవడం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం, చిన్న పనికే శక్తిలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి సాధారణం కావు. కొన్ని సందర్భాల్లో ఇవి స్ట్రోక్‌కు ముందుగా కనిపించే సంకేతాలు కావచ్చు.
స్ట్రోక్ బారినపడిన వ్యక్తులు తరచూ ఈ లక్షణాలను ఒత్తిడి, శ్రమ లేదా నిద్రలేమి వల్ల ఏర్పడినవేనని భావిస్తూ నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అది ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో ఒకవైపు మాత్రమే తిమ్మిరిగా అనిపించడం చిన్న సమస్యగా అనిపించవచ్చు. ఉదాహరణకు ఎక్కువసేపు నిద్రపోయిన లేదా స్థిరంగా కూర్చుని ఉన్న తర్వాత అలాంటి అనుభూతి రావడం సాధారణమే. కానీ అదే తిమ్మిరి తీవ్రంగా, దీర్ఘకాలంగా, ఒకే వైపుగా ఉంటే అది స్ట్రోక్‌కు ముందుగా కనిపించే ముఖ్య లక్షణం కావచ్చని నాడీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్ట్రోక్ సమయంలో మెదడుకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు శరీరంలో ఒకవైపు సిగ్నల్స్ సరిగా వెళ్ళవు. దీంతో ముఖంలో ఒకవైపు, చేయి, కాలు లేదా భుజం భాగంలో తిమ్మిరి, నిస్సహాయత అనిపించవచ్చు. ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే.. ప్రాణాలు కాపాడవచ్చు.
స్ట్రోక్‌కు ముందుగా కనిపించే ముఖ్యమైన లక్షణాల్లో చూపులో మార్పులు చాలా కీలకం. చాలామందికి ఇది సాధారణ కళ్ల సమస్యలా అనిపించవచ్చు. అయితే అకస్మాత్తుగా చూపు మసకబారడం, స్పష్టంగా చూడలేకపోవడం, వస్తువులు రెండు రెండుగా కనిపించడం వంటివి స్ట్రోక్‌కు హెచ్చరిక సంకేతాలు కావచ్చు.
ఇలా జరగడానికి ప్రధాన కారణం మెదడుకు సరైన రక్తప్రసరణ లేకపోవడమే. మానసిక స్పష్టత తగ్గిపోవడం, కళ్లకు సంబంధించిన నాడులపై ప్రభావం పడడం వల్ల ఈ లక్షణాలు ఉత్పన్నమవుతాయి. వెంటనే నెరాలజిస్ట్‌ను సంప్రదించడం అత్యవసరం, ఎందుకంటే.. వీటివల్ల స్ట్రోక్‌ను ముందుగానే గుర్తించి, సమయానికి చికిత్స అందించవచ్చు.
స్ట్రోక్‌కు ముందుగా కనిపించే ముఖ్యమైన లక్షణాల్లో మాట్లాడటంలో తడబాటు ఒకటి. సాధారణంగా ఒక వ్యక్తి స్పష్టంగా మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోతే.. దాని నిర్లక్ష్యం చేయరాదు. పదాలు తప్పుగా పలకడం, నోరు తిరగకపోవడం, మాట్లాడలేకపోవడం, మాటల మధ్య తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే, వాటిని స్ట్రోక్‌కు సంబంధించి ముఖ్య హెచ్చరికలుగా పరిగణించాలి.
వైద్య భాషలో దీనిని అఫాసియా (Aphasia) అని అంటారు. ఇది మెదడులో భాషకు సంబంధించే భాగాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరగకపోవడం వల్ల కలిగే సమస్య. కొంతమందికి మాటలు అర్థం చేసుకోవడంలో కూడా ఇబ్బంది కలగవచ్చు. ఈ రకమైన లోపాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.