పన్ను తీసేస్తే కళ్లు దెబ్బతింటాయా? నిజం ఇదే!

Published : Oct 01, 2025, 06:37 PM IST

పంటి నొప్పి భరించడం ఎంత కష్టమో ఆ బాధను అనుభవించినవారికే తెలుస్తుంది. సరే దెబ్బతిన్న పన్నును తొలగించుకుందామా అంటే కళ్లకు హాని కలుగుతుందేమో అనే భయం చాలామందిలో ఉంటుంది. పన్ను తీసేస్తే నిజంగానే కళ్లు దెబ్బతింటాయా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

PREV
14
పంటి సమస్యలు

మనలో చాలామంది రకరకాల పంటి సమస్యలతో బాధపడుతుంటారు. పంటి సమస్యలుంటే సరిగ్గా తినలేము. మాట్లాడలేము. ఆ బాధ వర్ణించలేనిది. అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. అయితే కొంతమంది పన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే.. దాన్ని తొలగించడానికి ఒప్పుకోరు. కారణం ఏమిటంటే.. పళ్లు తొలగిస్తే.. కళ్లు దెబ్బతింటాయనే భయం ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు నిజం? ఈ అంశం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

24
పళ్లకు, కళ్లకు సంబంధం ఉంటుందా?

మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దంతాలు, కళ్లు రెండూ వేరువేరు భాగాలు. ఈ రెండు భాగాలు స్వతంత్రంగా పనిచేస్తాయి. వీటికి సంబంధించిన నరాలు, రక్తనాళాలు ఒకదానితో ఒకటి కలిసుండవు. కాబట్టి పన్ను తొలగిస్తే కళ్లకు హాని జరుగుతుందనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. అయితే చాలామంది ఈ అపోహను నమ్మడానికి కారణం సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు.

వాస్తవానికి పళ్లను తొలగించే ప్రక్రియను లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తారు. దీని ప్రభావం ముఖ భాగానికే పరిమితమవుతుంది. నిపుణుల ప్రకారం పళ్లను తొలగించడం వల్ల కళ్ల నాడులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అసలు వాటికి సంబంధమే ఉండదు. కళ్లకు సంబంధించిన నాడులు మెదడు ద్వారా పనిచేస్తాయి. కానీ పళ్లకు సంబంధించిన నాడులు ముఖ భాగంలోనే ఉంటాయి.

34
అపోహ మాత్రమే..

సాధారణంగా కొందరికి పళ్లను తొలగించిన తర్వాత తలనొప్పి, ముఖం వాపు వంటి సమస్యలు రావచ్చు. అవి తాత్కాలికమే. వాటితో కళ్లకు సంబంధం ఉండదు. అయితే జ్ఞాన దంతాలు తొలగించినప్పుడు మాత్రం కొంచెం ఫేషియల్ ప్రెషర్ అనిపించవచ్చు. కానీ అది కూడా తాత్కాలికమే. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) ప్రకారం పళ్లు తొలగించడం వల్ల కళ్లకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇది ఒక అపోహ మాత్రమే.

44
తాత్కాలిక సమస్యలు..

కొన్ని అరుదైన సందర్భాల్లో పళ్లను తొలగించిన తర్వాత తాత్కాలికంగా చూపు కాస్త మసకగా అనిపించవచ్చు. ఇది ప్రధానంగా స్ట్రెస్, మెదడుకు వెళ్లే రక్తప్రసరణ, లేదా పోస్ట్ సర్జరీ యాంగ్జైటీ వల్ల కలగవచ్చు. కాబట్టి పళ్లు తీసేస్తే.. కళ్లు దెబ్బతింటాయి అనే మాట నిజం కాదు. శాస్త్రీయంగా దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ అపోహల వల్ల సరైన సమయంలో పళ్లు తొలగించకుండా అవి నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వరకు ఉంచుకోకూడదు. పళ్లలో ఏదైనా సమస్య ఉంటే డెంటల్ నిపుణుల సలహాతో తగిన సమయంలో తొలగించుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories