ఆవు నెయ్యిలో విటమిన్ A, D, E, K లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ A, E ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడే 'బ్యూట్రిక్ యాసిడ్' ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. పేగు గోడలను బలోపేతం చేసి, మంచి బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అంతేకాదు ఆవు నెయ్యిలో 'కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్' (CLA) అనే ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడానికి, బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆవునెయ్యిని పిల్లలు, వృద్ధులు సహా అన్ని వయసుల వారు తినచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది.
గేదె నెయ్యిలో ఉండే పోషకాలు:
గేదె నెయ్యిలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్.. ఆవు నెయ్యిలో కంటే గేదె నెయ్యిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు, కేలరీలు కూడా ఎక్కువే. బరువు పెరగాలనుకునే వారికి గేదె నెయ్యి చక్కగా ఉపయోగపడుతుంది. కీళ్లు, ఎముకల ఆరోగ్యానికి ఈ నెయ్యి మంచిది. ఇందులోని కొవ్వు.. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.