చేపలు మంచి పోషకాహారం. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివని చాలా మంది వారానికి ఒక్కసారైన తింటుంటారు. నిజానికి చేపలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.కానీ వానాకాలంలో అయితే కాదు. అవును వానాకాలంలో చేపలను తింటే లేనిపోని రోగాలు వస్తాయి. ఎందుకంటే వర్షాకాలంలో నీటి వనరులు కలుషితమవుతాయి. వీటిలో పెరిగే చేపలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలు వానాకాలంలో చేపలను తినడం వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాదరసం
వర్షాకాలంలో వర్షాలు ప్రతిరోజూ కురుస్తూనే ఉంటాయి. ఈ భారీ వర్షాలకు జలాశయాల్లో పాదరసం వంటి మలినాలు బాగా పెరిగిపోతాయి. వీటిలో పెరిగే చేపల కణజాలాల్లో కూడా పాదరసం వంటి మలినాలు పేరుకుపోతాయి. ఇలాంటి చేపలను తినడం వల్ల మన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.
నీటి కాలుష్యం
వర్షాకాలంలో పరిశ్రమల నుంచి వెలువడే కలుషిత మురుగునీరంతా కుంటలు, చెరువులు, నదులు, సముద్రాల్లోకి చేరుతుంది. దీంతో ఈ నీరంతా కలుషితమవుతుంది. ఇలాంటి చేపలను తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి.
అంటువ్యాధులు
వర్షాకాలంలో జలవనరుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల నీళ్లలో బ్యాక్టీరియా, వైరస్ లు, పరాన్నజీవులు బాగా పెరుగుతాయి. ఇలాంటి చేపలను తినడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి.
అలెర్జీ
చాలా మందికి వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కలుషితమైన చేపలను తినడం వల్ల దురద, దద్దుర్లు, వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఫుడ్ పాయిజన్
వర్షాకాలంలోనే చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఇలాంటి సమయంలో గుడ్లున్న చేపలను తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చేపలను ఎలా తినాలి?
వర్షాకాలంలో చేపలను ఖచ్చితంగా తినాలనుకుంటే మాత్రం వీటిని బాగా వండాలి. అప్పుడే వాటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. మీరు చేపలు కొన్న వెంటనే ఉడికించి తినండి. నిల్వ ఉంచితే అందులో బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది.