
ఇప్పుడు టమాటాల రేటు మామూలుగా లేదు. రోజు రోజుకు వీటి ధర పెరిగిపోతూనే ఉంది. అయితే మనం మార్కెట్ నుంచి కొన్ని టమాటాలు మూడు నాలుగు రోజుల్లోనే మొత్తం కుళ్లిపోతుంటాయి. బయట ఇలాగే కుళ్లిపోతాయని, ఫ్రిజ్ లో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చాలా మంది అంటుంటారు. ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయనేది నిజమే కానీ.. ఫ్రిజ్ లేకపోయినా వీటిని వారం రోజులు నిల్వ ఉండేలా చేయొచ్చు. కానీ చాలా మంది వీటిని సరిగ్గా నిల్వ చేయరు. దీనివల్ల అవి తొందరగా కుళ్లిపోతుంటాయి.
చాలా మంది టమాటాలను కొనేసి వెంటనే ఫ్రిజ్ లో పెడుతుంటారు. అవసరమున్నప్పుడల్లా వాడుతుంటారు. అదే ఫ్రిజ్ లో కాకుండా.. ఇంట్లో ఎక్కడైనా పెడితే టమాటాలు కుళ్లిపోయి వాసన వస్తుంటాయి. కానీ మీరు కొన్ని చిట్కాలతో టమాటాలు ఎక్కువరోజులు నిల్వ ఉండేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మీరు టమాటాలను కొనేటప్పుడు కొన్ని చిట్కాలను ఖచ్చితంగా పాటించాలి. లేదంటే టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అయితే మీరు కొనే టమాటాలకు మచ్చలు ఉండకూడదు. అలాగే గట్టిగా ఉండాలి. మెత్తబడిన, కొంచెం కుళ్లిన టమాటాలను తీసుకుంటే ఒకటిరెండు రోజులు మాత్రమే వస్తాయి. ఇకపోతే కొన్న టమాటాలను అన్నింటినీ ఒకేదగ్గర కుప్ప పోయకుండా.. వెడల్పుగా పరచండి. అలాగే ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఉన్న చోట అస్సలు పెట్టకండి.
ఫ్రిజ్ లో పెడితే టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండొచ్చు. కానీ ఎక్కువ రోజులు టమాటాలను ఫ్రిజ్ లో పెడితే వాటి టేస్ట్ మారుతుంది. వీటితో మీరు కూరలు చేసినా టేస్ట్ మాత్రం కావు. అందుకే టమాటాలను ఫ్రిజ్ లో పెట్టకూడదని అంటారు. మరి ఫ్రిజ్ లో పెట్టకపోతే టమాటాలు తొందరగా కుళ్లిపోతాయి కదా అని అంటుంటారు. కానీ న్యూస్ పేపర్ తో మీరు వారం పాటు టమాటాలు నిల్వ ఉండేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1. టమాటాలను శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తో తుడవండి. అలాగే టమాటాలకు మచ్చలు, వాటర్ ఉన్నాయేమో చెక్ చేయండి. ఆ తర్వాత బ్రౌన్ పేపర్ లో చుట్టండి. అంతే దీనివల్ల టమాటాలు వారం పాటు నిల్వ ఉంటాయి.
2. బ్రౌన్ పేపర్ లేకున్నా మీరు వారం పాటు టమాటాలు కుళ్లిపోకుండా తాజాగా ఉండేలా చేయొచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. టమాటాలను శుభ్రం చేసి వాటిపై ఉప్పు, పసుపు కలిపిన పేస్ట్ ను రాస్తే సరిపోతుంది. ఇందుకోసం కొన్ని నీళ్లలో ఉప్పు, పసుపును వేసి కలపండి. దీన్ని టమాటాల పైన పూయండి. దీనివల్ల టమాటాలకు ఉన్న మురికి, బ్యాక్టీరియా తొలగిపోతాయి. ఆ తర్వాత వీటిని నీళ్లతో కడిగి ఆరబెట్టి కార్డ్ బోర్డ్ పెట్టెలో స్టోర్ చేయండి.