anxiety in men
ఈ బిజీ లైఫ్ వల్ల నేడు ఎంతో మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నిజానికి ఒత్తిడి, యాంగ్జైటీ సమస్యలు అంత చిన్నవేం కావు. ఎందుకంటే ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా.. మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. మనం తినే ఆహారానికి, మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే యాంగ్జైటీని తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలను తినాల్సి ఉంటుంది. అవేంటంటే..
అరటిపండ్లు
అరటిపండ్లు కూడా ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల మన శరీరంలో 'సెరోటోనిన్' ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆందోళన తగ్గి మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
గుడ్లు
ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లలో 'ట్రిప్టోఫాన్' కూడా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా గుడ్లు తినడం వల్ల కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే గుడ్లలో ఉండే పోషకాలు మన శరీరం పోషకాల లోపం బారిన పడకుండా కాపాడుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ టీ తాగితే కూడా యాంగ్జైటీ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది మన బరువును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళనను నివారించడానికి, మానసిక ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
పసుపు
పసుపును మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అలాగే నిరాశ, ఆందోళన వంటి మానసిక క్షోభను తగ్గిస్తుంది.
చేపలు
సాల్మన్ వంటి కొన్ని చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాలు మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
నట్స్
రోజూ గుప్పెడు గింజలను తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇవి బరువును తగ్గించడం నుంచి పోషకాల లోపాలను పోగొట్టడం వరకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.