ఒకప్పుడు అధిక రక్తపోటు సమస్య పెద్దవాళ్లకు మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఈ సమస్య వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈ అధిక రక్తపోటును నియంత్రించడం చాలా కష్టం. దీనివల్ల ఛాతీ నొప్పి, మైకము, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. చాలా సందర్భాల్లో ఈ హైబీపీ వల్ల గుండెపోటు కూడా వస్తుంది.
నిజానికి అధిక రక్తపోటు ఒక జీవన శైలి సమస్య. మన ఆహారపు అలవాట్లు, దినచర్య సరిగా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించి ఈ సమస్యను నియంత్రించొచ్చు. అరటిపండు తినడం వల్ల హైబీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైబీపీని నియంత్రించడానికి అరటిపండు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
హైబీపీని అరటిపండు నియంత్రిస్తుందా?
పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం రక్తపోటు ప్రభావాలను తగ్గిస్తుంది. కాగా అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల హైబీపీ పేషెంట్లకు మంచి మేలు జరుగుతుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాల గోడలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం రక్త నాళాలను వెడల్పుగా చేయడానికి సహాయపడుతుంది. దీంతో రక్తం సరిగ్గా ప్రవహిస్తుంది. దీంతో అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది.
మీ రక్తపోటు రేటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే మీరు ఆహారంలో పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని పెంచాలి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా. అయినప్పటికీ పొటాషియాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. అందుకే డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి.
అరటి పండును తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే ఇది మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. పేగులకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎలా అంటే దీన్ని తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. అందుకే ఈ పండును రెగ్యులర్ గా ఒకటి తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు.