sprouts
రుచిగా ఉంటే చాలు ఎంత తింటున్నామో కూడా చూసుకోకుండా లాగించేస్తుంటారు మనలో చాలా మంది. దీనివల్ల వేగంగా బరువు పెరగడంతో పాటుగా మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే అతిగా తినకూడదు. అతిగా తినకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ఇలాంటి వాటిలో మొలకలు ఒకటి. రోజూ కొన్ని మొలకలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉండటంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. అలాగే ఇంకెన్నో రోగాల ముప్పు తప్పుతుంది. అవేంటంటే..
బరువు తగ్గుతారు
బరువు తగ్గడం అంత సులువు కాదన్న ముచ్చట చాలా మందికి తెలుసు. కానీ తలచుకుంటే మీరు కోరుకున్న బరువును పొందొచ్చు. మొలకలను చిరుతిండిగా తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. మొలకల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ మొలకలు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
నల్ల చిక్పీస్ లో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్స్, డెల్ఫిండిన్, సైనిడిన్, పెటునిడిన్ తో పాటుగా ఫైటోన్యూట్రియెంట్స్, ఎఎల్ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలలాగే ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన జుట్టు
శనగ మొలకలల్లో విటమిన్ ఎ, విటమిన్ బి 6, జింక్, మాంగనీస్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీ జుట్టు విపరీతంగా రాలుతుంటే, చుండ్రు సమస్యలతో బాధపడుతుంటే వీటిని రోజూ తినండి. ఇవి జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. ఇతర జుట్టు సమస్యలను నయం చేస్తాయి.
చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది
మొలకెత్తిన శనగలోని సంక్లిష్ట పిండి పదార్థాలు చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరల శోషణను నియంత్రిస్తుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. ఈ మొలకలు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీకు అతిగా ఆకలి కాదు.
మెదడు పనితీరును పెంచుతుంది
మొలకెత్తిన శనగపప్పులో విటమిన్ బి 6 అంటే పైరిడాక్సిన్, అలాగే కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల ద్వారా మెదడుకు సంకేతాల ప్రసారాన్ని ప్రోత్సహించడానికి, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచడానికి బాగా సహాయపడతాయి.
జీర్ణక్రియకు మంచిది
కూరగాయలలో జీర్ణక్రియకు సహాయపడే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శనగపప్పుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.