చిన్నగా ఉంటాయి.. ఇవి మనకెలా సహాయపడతాయని నువ్వులను తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మన శరీరానికి అవసరమయ్యే పోషకాలెన్నో నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నువ్వులలో లిగ్నన్ లు, ఫైటోస్టెరాల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. నువ్వుల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండే నువ్వులు దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. నువ్వులు మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్లాస్మా, మరియు గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
మూడు టేబుల్ స్పూన్లు అంటే 30 గ్రాముల నువ్వులలో 3.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. అంతేకాదు గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్లు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఫైబర్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
కొన్ని అధ్యయనాలు నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు గుండె జబ్బులకు ప్రమాద కారకాలు. నువ్వులలో 15% సంతృప్త కొవ్వు, 41% పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు, 39% మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటాయి.
సంతృప్త కొవ్వుల కంటే ఎక్కువ పాలీఅన్శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ కు ప్రధాన ప్రమాద కారకం. నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.