కర్ణాటక ప్రసిద్ధ వంటకాల్లో టొమాటో బాత్ (Tomato Bath) ఒకటి. ఇందులో మసాలా దినుసులు ఉంటాయి. అందువల్ల సువాసనలు వెదజల్లుతూ తినే వారికి మహా రుచిగా ఉంటుంది. దీన్ని సాధారణ బియ్యం లేదా బాస్మతి బియ్యంతో కూడా చేయవచ్చు. ఈ అద్భుతమైన రెసిపీని టిఫెన్ గానూ, లంచ్ బాక్స్ లోకి కూడా ప్రిపేర్ చేయొచ్చు. సాంప్రదాయ కర్ణాటక శైలిలో ఈ బాత్‌ను ఇంట్లోనే ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – 1 1/2 కప్పులు (అర గంట నానబెట్టింది)
టొమాటో – 4 (సన్నగా తరిగినవి)
పెద్ద ఉల్లిపాయ – 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 3 (పొడవుగా చీల్చినవి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
పుదీనా – ఒక గుప్పెడు (తరిగి పెట్టుకున్నది)
కొత్తిమీర – కొద్దిగా (అలంకరణకు)
కరివేపాకు – 1 రెమ్మ
పసుపు – 1/2 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 3 టీస్పూన్లు
నెయ్యి – 2 టీస్పూన్లు
నిమ్మకాయ – 1 (రసం తీసి పెట్టుకున్నది)
మసాలా దినుసులు
ఏలకులు – 2
లవంగాలు – 3
లవంగపట్ట – 1 ముక్క
సోంపు – 1 టీస్పూన్
దాల్చిన చెక్క – 1 ముక్క
మిరియాలు – 1/2 టీస్పూన్
ఎండు మిరపకాయలు – 2
క్యాబేజీ – 1/2 కప్పు (ఇష్టమున్నవారు వేసుకోవచ్చు)
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, 30 నిమిషాలు నానబెట్టి తర్వాత వడకట్టాలి. పాన్ లేదా గిన్నెలో నూనె గాని నెయ్యి గాని వేసి వేడి చేసి ఏలకులు, లవంగాలు, లవంగపట్ట, సోంపు, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండు మిరపకాయలు వేసి బాగా సువాసన వచ్చే వరకు వేయించాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి, ఆపై పచ్చిమిర్చి, టొమాటో, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 2 1/2 కప్పుల నీరు పోసి మరిగించాలి.
తరువాత బియ్యం వేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి తక్కువ మంట మీద 15 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి 5 నిమిషాలు తర్వాత వడ్డించుకోవాలి.
వడ్డించే విధానం
టొమాటో బాత్‌ను రైతా, శనగపప్పు చట్నీ, బంగాళాదుంప వేపుడు, చిప్స్, తరిగిన దోసకాయలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ తినేవారైతే చికెన్ గ్రేవీ, మటన్ సుక్కా, గుడ్డు వేపుడు, గుడ్డు గ్రేవీలను సైడ్‌డిష్‌గా పెట్టుకుని తింటే రుచి ఇంకా బాగుంటుంది.
చిట్కాలు పాటిస్తే మరింత రుచిగా ఉంటుంది
టొమాటోను బాగా మెత్తగా చేస్తే బాత్ రుచి మరింత పెరుగుతుంది. గరం మసాలా, పుదీనా కలపడం వల్ల రెస్టారెంట్ లాంటి టేస్ట్ వస్తుంది. ఉడికించేటప్పుడు నీటి పరిమాణాన్ని సరిగ్గా లెక్కించి వేస్తే మెత్తగా ఉంటుంది. ఎక్కువ కారంగా కావాలనుకుంటే మిరపకాయ, మిరియాల పొడి వేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి వేసవిలో వెల్లుల్లి ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే..