ఆంధ్ర, తెలంగాణాల్లో చాలా ఫేమస్ బిర్యానీలున్నాయి. కాని చెట్టినాడ్ బిర్యానీ కేవలం రెస్టారెంట్లలోనే, అందులోనూ ఫేమస్ రెస్టారెంట్లలోనే చూస్తాం. కాని చెట్టినాడ్ బిర్యానీకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. దీన్ని ఒకసారి రుచి చూసిన వారు ఎప్పటికీ మరచిపోలేరు. కారంగా, తాజాగా ఉండే మసాలా మిశ్రమంతో చెట్టినాడ్ స్పెషల్ మటన్ బిర్యానీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బిర్యానీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు
బాస్మతి బియ్యం – 2 కప్పులు (అరగంట నానబెట్టినవి)
మటన్ – 500 గ్రాములు (శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసింది)
పెద్ద ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
టమాటా – 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు
పుదీనా, కొత్తిమీర – ఒక గుప్పెడు (తరిగి పెట్టుకున్నది)
పెరుగు – 1/2 కప్పు
పసుపు – 1/2 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 3 టీస్పూన్లు
నెయ్యి – 2 టీస్పూన్లు
నిమ్మకాయ – 1
మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
జీలకర్ర – 1 టీస్పూన్
సోంపు – 1 టీస్పూన్
మిరియాలు – 1/2 టీస్పూన్
లవంగాలు – 4
ఏలక్కాయలు – 3
లవంగపట్ట – 1 ముక్క
అనాస పువ్వు – 1 ముక్క
పట్ట – 1 ముక్క
తయారీ విధానం
ముందుగా మసాలా తయారీకి డ్రై పదార్థాలను వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన మటన్‌లో పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి, ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా, మసాలా పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా వేయించాలి.
నానబెట్టిన మటన్‌ను వేసి 15-20 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. బియ్యాన్ని కడిగి, తగినంత నీరు (1:2 నిష్పత్తి) వేసి మరిగించాలి. పుదీనా, కొత్తిమీర వేసి, బియ్యాన్ని అందులో వేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి.
వడ్డించే విధానం
ఇలా తయారైన చెట్టినాడ్ బిర్యానీని ఉల్లిపాయ రైతా, చికెన్ గ్రేవీ, గుడ్డు, సూపర్ సాల్నాతో వడ్డిస్తే రుచి అదిరిపోతుంది.
ఈ చిట్కాలు పాటిస్తే మరింత టేస్ట్ వస్తుంది
మటన్‌ను 30 నిమిషాల కంటే ఎక్కువ నానబెడితే ఇంకా బాగా మెత్తగా ఉంటుంది.
బియ్యాన్ని చాలా జాగ్రత్తగా కలిపి, నీటిని సరిగ్గా వేస్తే బిర్యానీ అంటుకోకుండా ఉంటుంది.
ఎక్కువ కారంగా కావాలంటే, మిరపకాయలు, మిరియాల పొడిని ఎక్కువగా వేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి బిర్యానీకి పోటీ ఇచ్చే కర్ణాటక స్టైల్ టొమాటో బాత్.. ఎలా తయారు చేయాలంటే..