World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన ఇండియాలోనే ఉంది. పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌గా రికార్డు సృష్టించింది. నది అడుగు నుంచి ఏకంగా 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో ఈ వంతెన ఉంది. ఈ ఎత్తు ఎంతంటే, పారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ కంటే ఇది 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో నిలిచింది.
ఈ ఉక్కు వంతెన కశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. హిమాలయాల అందాల మధ్య, లోతైన లోయ పైభాగంలో నిలిచిన ఈ నిర్మాణం భారత ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా మారింది.
25
నిర్మాణ ప్రత్యేకతలు, స్టీల్ ఆర్చ్
చీనాబ్ రైల్ బ్రిడ్జ్ మొత్తం పొడవు 1,315 మీటర్లు (4,314 అడుగులు). ఇది పూర్తిగా స్టీల్, కాంక్రీట్ నిర్మాణంతో కూడిన ఆర్చ్ బ్రిడ్జ్. లోయకు అటువైపు, ఇటువైపు ఉన్న కొండల మధ్య విస్తరించిన ప్రధాన ఆర్చ్ పొడవు 467 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ఆర్చ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
వంతెనకు మొత్తం 17 స్పాన్‌లు ఉన్నాయి. ప్రధాన ఆర్చ్‌కు రెండు వైపులా 130 మీటర్ల ఎత్తు ఉన్న భారీ పైలాన్‌లతో సపోర్ట్ ఇచ్చారు. ఈ నిర్మాణం కోసం ఏకంగా 27,000 టన్నుల స్టీల్, 66,000 ఘన మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించారు.
35
హిమాలయాల్లో ఇంజనీరింగ్ సవాళ్లు
కఠినమైన హిమాలయ భూభాగంలో ఈ వంతెనను నిర్మించడం ఇంజనీర్లకు అసాధారణమైన సవాలుగా మారింది. ప్రారంభంలో నిర్మాణ ప్రాంతానికి యంత్రాలు తీసుకెళ్లడానికి దారులు లేవు. నిర్మాణ సామగ్రిని కేవలం గుర్రాలు, మనుషులు మోసుకుపోవడం ద్వారా మాత్రమే రవాణా చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆర్చ్ నిర్మాణం కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన క్రాస్‌బార్ కేబుల్ క్రేన్‌లు, ప్రత్యేక బరువైన యంత్రాలను రప్పించి ఉపయోగించారు. ఆర్చ్ నిర్మాణానికి కంటిలెవర్ పద్ధతిని వాడారు. రెండు కొండల ఒడ్డుల నుంచి క్రమంగా ఆర్చ్‌ను నిర్మిస్తూ వచ్చి, 2021 ఏప్రిల్‌లో మధ్యభాగంలో విజయవంతంగా కలిపారు. ఇది నిర్మాణ బృందానికి ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది.
భౌగోళికంగా ఈ ప్రాంతం క్లిష్టమైనది కావడం వల్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు. అలాగే రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత గల భారీ భూకంపాలను, −20°C అత్యంత తీవ్రమైన మంచు ఉష్ణోగ్రతలను కూడా ఈ బ్రిడ్జ్ సులభంగా తట్టుకోగలదు.
ఈ వంతెనను ప్రత్యేకంగా బ్లాస్ట్ లోడ్‌కు కూడా తట్టుకునేలా రూపొందించారు. క్లిష్టమైన నిర్మాణ భాగాలు అత్యల్ప సామర్థ్యం వద్ద కూడా సురక్షితంగా పనిచేసేలా అదనపు రిడండన్సీతో నిర్మించారు. వంతెనకు సంబంధించిన ప్రతీ స్టీల్ నిర్మాణాన్ని త్రీడీ టెక్లా సాఫ్ట్‌వేర్‌తో మోడల్ చేసి, ఫిట్టింగ్ లోపాలు లేకుండా జాగ్రత్తపడ్డారు.
55
వ్యూహాత్మక ప్రాముఖ్యత.. గిన్నిస్ రికార్డు
చీనాబ్ బ్రిడ్జ్ 'ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్' (USBRL) ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన భాగం. ఇది కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రైలు మార్గం ద్వారా నిరంతరాయంగా కలుపుతుంది. ఈ బ్రిడ్జ్‌పై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నడుస్తాయి, దీనివల్ల కత్రా నుంచి శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
సుమారు 20 ఏళ్లకు పైగా కాలం పట్టి పూర్తయిన ఈ భారీ ప్రాజెక్ట్ భారతీయ దృఢ సంకల్పానికి నిదర్శనం. 2025 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన చీనాబ్ బ్రిడ్జ్, భారత్ సాధించిన ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిపోయింది.