Countries With No Snakes: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఒక్క పాము కూడా ఉండదు. ఐర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పాములు లేకపోవడానికి గల అసలు కారణాలేంటో మీకు తెలుసా?
పాము అంటే చాలు.. ఒంట్లో వణుకు పుడుతుంది చాలా మందికి. మన దేశంలో అడుగుకో పాము కనిపిస్తూనే ఉంటుంది. కానీ, ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ మీరు అడవుల్లో తిరిగినా, పొలాల్లో పడుకున్నా ఒక్క పాము కూడా మీకు ఎదురుపడదు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! పాములంటే ఫోబియా ఉన్నవారికి ఈ దేశాలు నిజంగానే ఒక స్వర్గధామం అని చెప్పాలి. మరి ఆ దేశాలేవి? అక్కడ పాములు ఎందుకు పుట్టలేదు? ఒకవేళ ఎవరైనా పామును తీసుకెళ్తే ఏమవుతుంది? అన్న ఆసక్తికర విషయాలు మీకోసం..
25
కోల్డ్ బ్లడెడ్ ప్రాణాలు: ఈ రక్తమే శాపమా?
పాములు 'కోల్డ్ బ్లడెడ్' ప్రాణులు. అంటే మనలాగా అవి సొంతంగా శరీర ఉష్ణోగ్రతను మేనేజ్ చేసుకోలేవు. బయట ఎండ ఉంటేనే వాటి ఒళ్లు వేడెక్కుతుంది, అప్పుడే అవి యాక్టివ్‌గా కదలగలవు. అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్ వంటి ప్రాంతాల్లో ఎప్పుడూ గడ్డకట్టే చలి ఉంటుంది. అంతటి మంచులో పాములు వేటాడటం పక్కన పెడితే, కనీసం ఊపిరి కూడా తీసుకోలేవు. అందుకే ఈ అతి శీతల ప్రాంతాల్లో పాముల జాడ అస్సలు ఉండదు.
35
ద్వీప దేశాల జాగ్రత్త.. జీవ వైవిధ్యం ఉంటుంది
న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాలు చుట్టూ సముద్రంతో ఉంటాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూభాగాలు విడిపోయినప్పుడు, పాములు ఆయా ప్రాంతాలకు చేరుకోలేకపోయాయి. న్యూజిలాండ్ దాదాపు 8.5 కోట్ల ఏళ్ల క్రితమే ప్రధాన భూభాగం నుండి విడిపోయింది. అప్పటికి ఇంకా ఆధునిక పాముల పరిణామం జరగలేదు. ఇక ఐర్లాండ్ విషయానికి వస్తే.. మంచు యుగం తర్వాత సముద్ర మట్టాలు పెరగడంతో మెయిన్ ల్యాండ్ నుండి ఐర్లాండ్ కట్ అయిపోయింది. దీంతో పాములు అక్కడికి పాకలేకపోయాయి.
కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా పాములను రానివ్వవు. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో బయో-సెక్యూరిటీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ పాములను పెంచుకోవడం గానీ, జూల కోసం దిగుమతి చేసుకోవడం గానీ నేరం. పొరపాటున ఏదైనా పాము కనిపిస్తే వెంటనే దాన్ని పట్టుకుని నాశనం చేస్తారు. ఎందుకంటే అక్కడ పాములు ప్రవేశిస్తే, స్థానికంగా ఉండే అరుదైన పక్షులను, జీవులను అవి తినేస్తాయి. తద్వారా అక్కడి ఎకో-సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకే స్నేక్ ఫ్రీ స్టేటస్‌ను వారు చాలా సీరియస్‌గా మెయింటైన్ చేస్తారు.
55
మరి సముద్రంలో సంగతేంటి?
భూమి మీద పాములు లేవు కదా అని రిలాక్స్ అయిపోతే పొరపాటే! న్యూజిలాండ్ వంటి దేశాల్లో భూమి మీద తిరిగే పాములు లేవు కానీ, సముద్రపు పాములు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. సముద్ర అలల ఉధృతికి కొట్టుకువచ్చే ఈ పాములు విషపూరితమైనవే. అయితే అవి అరుదుగా తీరానికి వస్తాయి. అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. హవాయిలో పాములు కనిపిస్తే వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.