No Railway Station: ఇప్పటివరకు ఒక్క రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం

Published : Nov 21, 2026, 03:38 PM IST

No Railway Station: దేశంలో వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నా.. కానీ నేటికీ ఒక్క రైలు కూడా చేరుకోని ఓ రాష్ట్రం ఉంది. ఎందుకు? ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ రైల్వేస్టేషన్ కోసం ప్రయత్నించలేదా? కారణమేంటీ?

PREV
16
Sikkim

భారత్‌లో 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ప్రకృతి అందాలకు పేరుగాంచిన సిక్కిం రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు. గ్యాంగ్‌టక్ వెళ్లాలంటే ఇప్పటివరకు రోడ్డు మార్గం లేదా విమాన ప్రయాణమే ప్రధాన ఆధారం. లేదా పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి, న్యూజల్పైగురి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. దీనికి కారణమేంటంటే....హిమాలయాలు. రైలు మార్గం వేయాలంటే రోడ్డు మరీ ఎత్తుగా ఉండకూడదు. అలాగే మలుపులు తక్కువగా ఉండాలి. కానీ సిక్కింలో భూమి నిటారుగా ఉంటుంది. మళ్లీ మధ్యలో లోయలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇక్కడ రైలు మార్గం వేయలేకపోయారు.

అయితే ఈ పరిస్థితి త్వరలో మారబోతోంది. హిమాలయ పర్వతాల మధ్య నుంచి రైళ్లను నడిపించేలా భారతీయ రైల్వే ఓ భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో విశేషం ఏమిటంటే.. మొత్తం రైల్వే మార్గంలో ఎక్కువ భాగం కొండల లోపల నిర్మించిన సొరంగాల గుండానే సాగుతుంది. అసలు ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతోంది?

26
సిక్కింకు రైలు మార్గం.. ఇదే ప్రాజెక్టు

సిక్కింను భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు చేపట్టిన ప్రాజెక్టే సెవోక్‌–రాంగ్‌పో రైల్వే లైన్ (Sevoke–Rangpo Railway Line). పశ్చిమ బెంగాల్‌లోని సెవోక్‌ నుంచి సిక్కింలోని రాంగ్‌పో వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 44.96 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ పూర్తయితే సిక్కిం రాష్ట్రానికి తొలిసారిగా రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు సిక్కింలో రైల్వే స్టేషన్ లేకపోవడంతో ప్రయాణికులు సమీపంలోని పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సిక్కింకు చేరుకునేవారు. ఈ కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణ కష్టాలు కొంతవరకు తగ్గుతాయి.

36
45 కిలోమీటర్ల మార్గంలో 39 కిలోమీటర్లు సొరంగాలే!

ఈ రైల్వే ప్రాజెక్టులో మొత్తం 44.96 కిలోమీటర్ల మార్గం ఉంది. ఇందులో సుమారు 41.55 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్ పరిధిలో, మిగిలిన 3.41 కిలోమీటర్లు సిక్కింలో ఉంటాయి. అయితే ఈ మార్గంలో దాదాపు 39 కిలోమీటర్లు సొరంగాల ద్వారానే నిర్మిస్తున్నారు. అంటే రైల్వే లైన్‌లో సుమారు 86 శాతం కొండల లోపలి నుంచే సాగుతుంది. ఇందుకోసం మొత్తం 14 సొరంగాలను నిర్మిస్తున్నారు. వీటిలో అతి పొడవైన సొరంగం సుమారు 5.3 కిలోమీటర్లు ఉంటుంది. అతి చిన్న సొరంగం పొడవు సుమారు 542 మీటర్లు. సాధారణంగా రైల్వే లైన్లు కొండల మధ్య నుంచి వెళ్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం కొండల లోపలే రైళ్ల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. హిమాలయాల భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంజినీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

46
పర్వతం లోపలే రైల్వే స్టేషన్!

ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం టీస్తా బజార్ రైల్వే స్టేషన్. ఇది పూర్తిగా భూగర్భంలో నిర్మిస్తున్న స్టేషన్. అంటే ప్రయాణికులు పర్వతం లోపల ఉన్న స్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కవచ్చు. ఇలాంటి నిర్మాణం భారతీయ రైల్వేలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మార్గంలో మొత్తం ఐదు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి సెవోక్, రియాంగ్, టీస్తా బజార్, మెల్లి, రాంగ్‌పో. వీటితో పాటు 13 ప్రధాన వంతెనలు, 10 చిన్న వంతెనలు నిర్మిస్తున్నారు. పర్వతాలు, లోయలు, నదులను దాటుకుంటూ రైలు సురక్షితంగా ప్రయాణించేలా ఈ నిర్మాణాలను చేపడుతున్నారు.

56
నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లేంటి?

హిమాలయ ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మించడం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ భూమి పొరలు స్థిరంగా ఉండకపోవడం, కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సొరంగాలు తవ్వే సమయంలో భూగర్భంలో రాళ్ల స్వభావం మారుతుండటంతో నిర్మాణ పనులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రాజెక్టుకు ఎక్కువ సమయం పడుతోంది. పర్యావరణానికి నష్టం కలగకుండా, కొండ ప్రాంతాల్లో నిర్మాణ భద్రతను కాపాడుతూ పనులు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.11,973 కోట్లు.

66
సిక్కింకు రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

ఈ ప్రాజెక్టు పూర్తయితే సిక్కిం రాష్ట్రం తొలిసారిగా దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతుంది. అయితే రైలు నేరుగా గ్యాంగ్‌టక్ వరకు వెళ్లదు. తొలుత రాంగ్‌పో వరకు మాత్రమే రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. అక్కడి నుంచి గ్యాంగ్‌టక్ చేరుకోవడానికి రోడ్డు మార్గాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్‌ను 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విష్యత్తులో రాంగ్‌పో నుంచి గ్యాంగ్‌టక్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ కల్పించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సర్వే పనులు కూడా చేపట్టారు. ఆ మార్గం అందుబాటులోకి వస్తే సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు కూడా రైలు ప్రయాణం సాధ్యమవుతుంది.

మొత్తానికి ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కింకు రైలు కూత వినిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిమాలయ పర్వతాలను తొలిచి, వాటి లోపలే సొరంగాలు నిర్మించి చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకులకు ప్రయాణం సులభం కావడమే కాకుండా, సిక్కిం ఆర్థికాభివృద్ధి మెరుగుపడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories