
హిందూ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఎంతో విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది. అనేక వేద మంత్రాలు, శాస్త్రోక్తమైన క్రతువుల మధ్య వధూవరులు ఒకటయ్యే ఈ మహత్కార్యంలో 'మాంగల్య ధారణ' అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెళ్లి పీటలపై వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరుడు వధువు మెడలో తాలిబొట్టు కడతాడు... మూడు ముళ్లు వేయడంతో ఆ అమ్మాయి, అబ్బాయి భార్యాభర్తలు అయిపోయినట్లే. అయితే ఈ మూడు ముళ్ల వెనుక కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాకుండా ఎంతో లోతైన ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక అర్థాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లిలో వేసే మూడు ముళ్ల వెనుక ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక భావన 'త్రికరణ శుద్ధి'. అనగా మనస్సు, వాక్కు, క్రియ.
మొదటి ముడి (మనసా) : వరుడు వేసే మొదటి ముడి 'మనసా' ధర్మానికి సంకేతం. మనస్ఫూర్తిగా వధువును తన సగభాగంగా స్వీకరిస్తున్నానని, జీవితాంతం ప్రేమగా, గౌరవంగా చూసుకుంటానని మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నట్లు... వధువు కూడా అతడిని జీవిత భాగస్వామిగా మనస్పూర్తిగా అంగీకరిస్తున్నట్లు.
రెండవ ముడి (వాచా) : ఇది 'వాచా' ధర్మానికి సూచిక. మాట తప్పకుండా, సత్య మార్గంలో నడుస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని వధూవరులు ఒకరికొకరు ఇచ్చుకునే హామీకి రెండో మూడి సంకేతం.
మూడవ ముడి (కర్మణా) : ఇది 'కర్మణా' ధర్మానికి ప్రతీక. ధర్మబద్ధమైన చేతల ద్వారా, శ్రమ ద్వారా కుటుంబాన్ని పోషిస్తూ, సమాజానికి మంచి జరిగే మార్గంలో నడుస్తానని చేసే ప్రతిజ్ఞ. భార్య కూడా ధర్మబద్దంగా భర్తతో నడుచుకుంటానని అంగీకరించడం.
మానవ జీవితంలో అనుసరించాల్సిన ముఖ్యమైన పురుషార్థాలు ధర్మం, అర్థం, కామము. ఈ మూడింటిని దంపతులిద్దరూ పంచుకుంటూ మోక్షం వైపు సాగడమే పెళ్లిలో మూడు ముళ్ల వెనుక ఉన్న మరొక అంతరార్థం.
మొదటి ముడి 'ధర్మానికి' సంకేతం... ఇద్దరూ కలిసి ధర్మమార్గంలో పయనించాలని సూచిస్తుంది.
రెండవ ముడి 'అర్థానికి' సంకేతం... సంసారాన్ని సజావుగా నడిపించడానికి అవసరమైన సంపదను, శ్రమను పంచుకోవడాన్ని తెలియజేస్తుంది.
మూడవ ముడి 'కామమునకు' సంకేతం... సుఖమయ సంసారాన్ని సాగిస్తూ వంశాభివృద్ధికి కారకులు కావాలని గుర్తుచేస్తుంది.
మానవునికి స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయని ధర్మాలు చెబుతాయి. పెళ్లి అంటే ఇద్దరు మనుషులు పూర్తిగా ఒక్కటవడం... అందుకే ఒక్కోముడి ఒక్కో శరీరానికి వేస్తున్నట్లు. బార్యాభర్తలు జీవితాంతం మూడు శరీరాలతో మమేకం అయి కలిసి వుండాలనే మూడుముళ్ల వెనకున్న అంతరార్థంగా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
మెడలో మంగళసూత్రం ఓ ఆభరణం కాదు భర్త ఆయుష్షుగా మహిళలు భావిస్తుంటారు. అందుకే పూజలు, వ్రతాల సమయంలో మహిళలు మంగళసూత్రానికి కూడా బొట్టు పెట్టుకుని నమస్కరిస్తారు... భర్త ఆయురారోగ్యాలతో ఉండాలనే ఇలా చేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహమైన మహిళ మెడలో మంగళసూత్రం లేదంటే భర్త చనిపోయాడని అర్థం... అందుకే ఫ్యాషన్ కోసం మంగళసూత్రం తీసివేయరాదని చెబుతుంటారు.
హిందూ ధర్మంలో మూడు అనే అంకెకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ లోకాన్ని త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) కాపాడుతున్నట్లు నమ్ముతారు. త్రిలోకాలు (భూలోకం, పాతాళలోకం, దేవలోకం) ఉన్నాయని భావిస్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక భావనతోనే పెళ్లిలో మూడుముళ్లు వేసి వధూవరులు దైవసాక్షిగా ఒక్కటవుతారని నమ్ముతారు. సతి-పతి-సమాజం అనే మూడు బంధాలకు ఆ మూడుముళ్లు నిదర్శనంగా కూడా చెబుతుంటారు.
కుటుంబ బంధాలు, దైవిక రక్షణ సంకేతమే మూడుముళ్ళు
కొన్ని సాంప్రదాయం ప్రకారం... పెళ్లిలో వధువు మెడలో వరుడు తాళికట్టే సమయంలో మొదటి ముడి మాత్రమే వేస్తాడు. మిగిలిన రెండు ముళ్లను వరుడి సోదరి (ఆడపడుచు) వేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా వస్తోంది. కొత్తగా ఇంట అడుగుపెడుతున్న వధువును తమ కుటుంబంలోకి సాధరంగా ఆహ్వానిస్తూ, ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఇచ్చే హామీకి ఇది ప్రతిరూపం.
ఈ విధంగా హిందూ సంప్రదాయంలో వధువు మెడలో వేసే ప్రతీ ముల్లుకు ఒక ప్రత్యేకమైన బాధ్యత, నమ్మకం, సంస్కారం దాగి ఉన్నాయి. పవిత్రమైన మాంగల్య ధారణ సమయంలో పడే ఈ మూడు ముళ్లు కేవలం రెండు శరీరాలను మాత్రమే కాకుండా, రెండు మనస్సులను, రెండు కుటుంబాలను జీవితాంతం ఒక్కటిగా ముడిపడి ఉండేలా చేస్తాయి. అందుకే మూడుముళ్ల బంధం బలంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు.