Wet Bulb Temperature : జాగ్రత్త! ఈ కొత్త రకం వేడితో ప్రాణాలు పోయే ఛాన్స్.. వెట్ బల్బ్ అంటే ఏంటో తెలుసా?

Published : Apr 29, 2026, 03:34 PM IST

Wet Bulb Temperature: సాధారణ ఉష్ణోగ్రత కంటే 'వెట్ బల్బ్' ఉష్ణోగ్రత ఎందుకు ప్రమాదకరం? భారతదేశంలో పెరుగుతున్న ఈ ముప్పు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఎందుకు ఇది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉంటుంది?

PREV
16
భారత దేశాన్ని వణికిస్తున్న వెట్ బల్బ్ ఉష్ణోగ్రత ముప్పు గురించి మీకు తెలుసా?

భారతదేశంలో వేసవి కాలం అంటేనే భానుడి భగభగలు. బయట అడుగుపెట్టగానే సెగలు కక్కుతున్న గాలి శరీరాన్ని తాకుతుంది. ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని మనం అనుకుంటాం. అయితే, మన ప్రాణాలకు ముప్పు కేవలం గాలిలో ఉండే వేడి వల్ల మాత్రమే రాదు. శాస్త్రవేత్తల ప్రకారం.. వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది వాతావరణం మన శరీరానికి ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పే అసలైన కొలమానం. గాలిలో ఉండే తేమ, వేడి కలిస్తే మన శరీరం తట్టుకోలేనంత ప్రమాదకరంగా మారుతుంది. దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ ప్రాణాలను కూడా తీసే అవకాశముంది.

26
వెట్ బల్బ్ ఉష్ణోగ్రత అంటే ఏమిటి?

సాధారణంగా మనం చూసే థర్మామీటర్ గాలిలో ఉండే వేడిని మాత్రమే కొలుస్తుంది. కానీ వెట్ బల్బ్ ఉష్ణోగ్రత పద్ధతి వేరు. ఒక థర్మామీటర్ చుట్టూ తడి గుడ్డను చుట్టి, దానిపై గాలిని పంపినప్పుడు వచ్చే రీడింగ్ ఇది. ఆ తడి గుడ్డలోని నీరు ఆవిరైపోతున్నప్పుడు థర్మామీటర్ చల్లబడుతుంది. ఈ ప్రక్రియ తర్వాత వచ్చే తుది రీడింగ్.. వేడి, తేమల కలయికను సూచిస్తుంది.

సులభంగా చెప్పాలంటే, సాధారణ థర్మామీటర్ గాలి ఎంత వేడిగా ఉందో చెబుతుంది. కానీ వెట్ బల్బ్ ఉష్ణోగ్రత అనేది మన శరీరం తనను తాను ఎంతవరకు చల్లబరుచుకోగలదో చెబుతుంది. మన శరీరం వేడిని తట్టుకోగలదా లేదా అనేది దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

36
తేమ పరిస్థితిని ఎలా మారుస్తుంది?

మన శరీరం వేడిని తగ్గించుకోవడానికి చెమటను బయటకు పంపుతుంది. ఆ చెమట ఆవిరి అయినప్పుడు మనకు చల్లదనం లభిస్తుంది. అయితే ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి..

1. గాలి పొడిగా ఉండే ప్రాంతాల్లో (రాజస్థాన్ వంటి చోట్ల), చెమట త్వరగా ఆవిరై శరీరాన్ని చల్లబరుస్తుంది.

2. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అంటే ముంబై, కోల్‌కతా, విజయవాడ, విశాఖపట్నం వంటి తీర ప్రాంతాల్లో, చెమట ఆవిరి కాదు. ఎందుకంటే గాలిలో అప్పటికే తగినంత తేమ ఉంటుంది.

చెమట ఆవిరి కాకపోతే, శరీరం లోపల వేడి పేరుకుపోతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయి హీట్ స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాజస్థాన్‌లో 45°C ఉన్నప్పుడు శరీరం తట్టుకోగలిగినా, ముంబై, విజయవాడ వంటి ప్రాంతాల్లో 38°C కే జనం విలవిల్లాడిపోతారు.

46
ప్రాణాపాయం కలిగించే ఆ నంబర్ ఎంత?

శాస్త్రవేత్తలు వెట్ బల్బ్ ఉష్ణోగ్రత 35°C దాటితే దానిని అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. ఈ స్థాయిలో వేడి ఉన్నప్పుడు, ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి నీడలో కూర్చుని నీళ్లు తాగుతున్నా సరే, ఎక్కువ సేపు బ్రతకడం కష్టం. ఎందుకంటే శరీరం తనలోని వేడిని బయటకు పంపే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతుంది.

అయితే ప్రమాదం 35°C దగ్గర మాత్రమే ప్రారంభం కాదు..

• 28 నుండి 30°C వెట్-బల్బ్: బయట తిరగడం రిస్క్‌తో కూడుకున్న పని.

• 31°C దగ్గర: శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి ఇబ్బంది పడుతుంది.

• 31 నుండి 33°C మధ్య: హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా అది ప్రాణాంతకమే.

56
భారతదేశానికి ఎందుకు ఎక్కువ ముప్పు ఉంది?

రీడింగ్ యూనివర్సిటీకి చెందిన అక్షయ్ దేవరాస్ ప్రకారం.. హ్యూమిడ్ హీట్‌వేవ్స్ అంటే తేమతో కూడిన వడగాల్పులు గురించి మన దేశంలో తక్కువగా చర్చించుకుంటాం. భారతదేశ భౌగోళిక పరిస్థితి వల్ల ఇక్కడ ముప్పు ఎక్కువ.

1. తీర ప్రాంత నగరాలు: చెన్నై, భువనేశ్వర్, ముంబై, కోల్‌కతా, విజయవాడ వంటి నగరాల్లో వేడితో పాటు తేమ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత మామూలుగానే ఉన్నా, వెట్-బల్బ్ రీడింగ్ ప్రమాదకర స్థాయికి చేరుతుంది.

2. మాన్సూన్ ప్రభావం: వర్షాలు పడకముందు లేదా కురిసిన తర్వాత గాలిలో తేమ అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది వేడిని మరింత భరించలేనిదిగా మారుస్తుంది.

3. బహిరంగంగా పనిచేసేవారు: భారత్‌లో కోట్లాది మంది కూలీలు, రైతులు, డెలివరీ బాయ్స్ ఎండలో పనిచేస్తారు. వీరికి ఏసీ సౌకర్యాలు ఉండవు, విద్యుత్ సరఫరా కూడా ఎప్పుడూ నమ్మదగ్గదిగా ఉండదు.

66
కాంక్రీట్ అడవులు, భవిష్యత్తు సవాళ్లు

నగరాల్లో భవనాలు, రోడ్లు వేడిని పీల్చుకుని రాత్రిపూట కూడా చల్లబడనివ్వవు. దీనిని అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం అంటారు. ఎంఐటీ అధ్యయనం ప్రకారం, ఈ శతాబ్దం చివరి నాటికి భారత జనాభాలో 70 శాతం మంది 32°C వెట్ బల్బ్ ఉష్ణోగ్రతను ఎదుర్కొంటారు. దాదాపు 2 శాతం మంది 35°C ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు.

ప్రస్తుతం ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల్లో 19 మన దేశంలోనే ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. 40°C ఉష్ణోగ్రత తేమ వల్ల 50°C లా అనిపిస్తుంది. కాబట్టి వెట్ బల్బ్ టెంపరేచర్ గురించి తెలుసుకోవడం కేవలం శాస్త్రీయ విషయం కాదు, ఇది మన ప్రాణాలను కాపాడుకునే ప్రాథమిక అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories