Meat : తాజా మటన్, నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే మటన్ కొనే ముందు ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.
మటన్ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది మాంసమా? రోగాలా?
మన తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. అందులోనూ మటన్ అంటే ఉండే క్రేజే వేరు. కిలో వెయ్యి రూపాయలకు చేరువలో ఉన్నా సరే, ఇష్టంగా కొనుక్కుని లొట్టలేసుకుంటూ తింటాం. అయితే, మనం ఇంత ఖర్చు పెట్టి కొనే మటన్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా? అంటే అవునని కచ్చితంగా చెప్పలేం. కొంతమంది వ్యాపారులు లాభాల కోసం నిల్వ ఉంచిన మాంసాన్ని, ఐస్ పెట్టిన మటన్‌ను తాజా మాంసంలా రంగులు కలిపి అమ్ముతున్నారు. ఇలాంటి కల్తీ లేదా నిల్వ మాంసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. అందుకే మటన్ కొనే ముందు ఈ విషయాలను గమనించండి..
25
రంగును బట్టి మటన్ నాణ్యతను పట్టేయండి
మటన్ షాపుకి వెళ్ళగానే ముందుగా మనం చూడాల్సింది మాంసం రంగు. తాజా మటన్ ఎప్పుడూ లేత ఎరుపు లేదా పింక్ రంగులో మెరుస్తూ ఉంటుంది. ఒకవేళ మాంసం ముదురు రంగులోకి మారినా, అక్కడక్కడా నల్లటి మచ్చలు ఉన్నా, లేదా రంగు వెలిసిపోయినట్లు అనిపించినా అది నిల్వ మాంసమని గుర్తుంచుకోవాలి. ఎముకల దగ్గర రంగు మారుతున్నా అది పాత మాంసానికి సంకేతం. కాబట్టి కంటికి ఇంపుగా, సహజమైన ఎరుపు రంగులో ఉన్నదాన్నే ఎంచుకోండి.
35
మటన్ ను తాకి చూస్తే తెలిసిపోతుంది
మటన్ తాజాగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి అది ముట్టుకుని చూడటం ఉత్తమం. ఫ్రెష్ మటన్ ఎప్పుడూ కాస్త గట్టిగా, స్ప్రింగ్‌లా ఉంటుంది. అంటే మీరు వేలితో నొక్కినప్పుడు ఆ గుంట వెంటనే పూడిపోయి మాంసం పాత స్థితికి రావాలి. అలా కాకుండా మెత్తగా ఉండి, వేలి ముద్ర అలాగే ఉండిపోతే అది పాడైపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. అలాగే మాంసం జిగటగా ఉండకూడదు. పట్టుకుంటే జారిపోతున్నా, జిగటగా అనిపించినా అది బ్యాక్టీరియా చేరిన నిల్వ మాంసం అని గ్రహించాలి.
మాంసానికి ఒక సహజమైన వాసన ఉంటుంది. కానీ అది అసహ్యంగా ఉండదు. ఒకవేళ మీరు కొనే మటన్ నుంచి వింతైన వాసన, పులుపు వాసన లేదా అమ్మోనియా వంటి వాసన వస్తుంటే అది కచ్చితంగా పాడైపోయినట్టే. పాత మాంసాన్ని కడిగి అమ్మినా సరే, ఈ వాసన ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు. మాంసం ముక్కలు నీరు కారుతున్నట్లుగా ఉంటే అది డీఫ్రాస్ట్ చేసిన అంటే ఐస్ గడ్డ కట్టించి తీసిన మాంసం అయి ఉండవచ్చు.
55
ఎక్కడ కొంటున్నారు? ఏది కొంటున్నారు?
మటన్ కొనేటప్పుడు కేవలం మాంసం మీదే కాదు, షాపు పరిసరాల మీద కూడా దృష్టి పెట్టాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లో, పరిశుభ్రంగా ఉండే చోట మాత్రమే మాంసం కొనండి. రోడ్డు పక్కన దుమ్ము పడే చోట, ఈగలు ముసురుతున్న చోట కొంటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే. మాంసం కొన్నాక ఎక్కువ సేపు బయట ఉంచకుండా వెంటనే వండుకోవడం లేదా ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవడం మంచిది. వండేటప్పుడు కూడా తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే అందులోని క్రిములు నశిస్తాయి.