Venomous Monkey: చూడటానికి బొమ్మలా ముద్దుగా ఉండే బంగ్కా స్లో లోరిస్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విషపూరిత ప్రైమేట్. అంటే కోతి జాతికి చెందిన విషపూరితమైన వానరం. ఇండోనేషియా అడవుల్లో జీవించే ఈ అరుదైన జీవి కాటు వేస్తే ప్రాణాలకే ముప్పు వస్తుంది.
అడవుల్లో రకరకాల అందమైన జంతువులను చూసి మురిడిపోతుంటాం. ముఖ్యంగా చూడటానికి బొమ్మలా, అమాయకంగా ఉండే జంతువులు కనపడితే ఎవరికైనా వాటిని ముద్దు చేయాలనిపిస్తుంది. అయితే, చూడటానికి చాలా అందంగా, క్యూట్‌గా ఉండే ప్రతి జీవి మన మిత్రుడు కాకపోవచ్చు.
అలాంటి కోవకే చెందిన ఓ అద్భుతమైన, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన జీవి బంగ్కా స్లో లోరిస్. ఇది సాధారణ కోతి కుటుంబానికి చెందిన ప్రైమేట్ అయినప్పటికీ, దీని ప్రత్యేకతలు, దీనిలోని విషం గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.
25
ఈ విషపూరిత కోతులు ఎక్కడ నివసిస్తాయి?
ఈ విలక్షణమైన జీవులు ప్రధానంగా ఇండోనేషియాలోని 'బంగ్కా ద్వీపం', అలాగే సుమిత్రా, బోర్నియో అడవులలో ఎక్కువగా జీవిస్తుంటాయి. దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలు, చెట్ల పొదలు, ద్వితీయ అడవుల పరిసర ప్రాంతాలు వీటికి నిలయాలు. ఇవి పగటిపూట చెట్ల కొమ్మల్లో సేదదీరి, రాత్రి సమయంలో ఆహారం కోసం సంచరించే నిశాచర జీవులు. చీకటి పడిందంటే చాలు, తమ పెద్ద గుండ్రటి కళ్ళతో ఇవి అడవిలో కలియతిరుగుతుంటాయి.
35
మనుషుల ప్రాణాలను తీసేంత ప్రమాదకరమా?
ఇతర సాధారణ స్లో లోరిస్ జాతుల వలె కాకుండా, బంగ్కా స్లో లోరిస్ ప్రపంచంలోని అతికొద్ది విషపూరిత ప్రైమేట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మనుషులకు ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది, ఎందుకంటే దీని మోచేతి వెనుక భాగంలో ప్రత్యేకమైన గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథి నుంచి వెలువడే స్రావాన్ని ఇది తన నాలుకతో నాకి, లాలాజలంతో కలుపుతుంది. అప్పుడు ఆ మిశ్రమం అత్యంత శక్తివంతమైన విషంగా మారుతుంది.
ఒకవేళ ఇది కాటు వేస్తే మనుషులలో తీవ్రమైన అనాఫిలాక్టిక్ షాక్ వంటి అలర్జిక్ రియాక్షన్లు ఏర్పడతాయి. దీనివల్ల రక్తపోటు రావటం, శరీరంలో తీవ్రమైన వాపు, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం కూడా ఉంది.
ఈ జీవి బాహ్య రూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని ముఖంపై ఉండే ప్రత్యేకమైన గుర్తులు ఇతర లోరిస్ జాతుల నుండి దీన్ని చాలా స్పష్టంగా వేరుగా చూపుతాయి. కళ్ళ చుట్టూ ముదురు, లేత రంగు వలయాలు, తలపై వెడల్పైన చారలు దీనికి ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. ఇది కేవలం సుమారు 10 అంగుళాల పొడవు మాత్రమే ఉండి బొమ్మలా కనిపిస్తుంది.
రాత్రి సమయంలో స్పష్టంగా చూడటానికి వీలుగా పెద్ద గుండ్రటి కళ్ళు దీని సొంతం. ఇక దీని చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాతి కోతులు సుమారు ఒక శతాబ్దం పాటు (1937 నుండి) శాస్త్రవేత్తలకు కంటికి కనిపించకుండా పోయాయి. దీంతో ఇవి పూర్తిగా అంతరించిపోయినట్లు అందరూ భావించారు. కానీ ఇటీవలి కాలంలో పరిశోధకులు వీటిని మళ్లీ సజీవంగా ఉన్నట్టు గుర్తించారు.
55
అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన జీవులు
ఇంతటి అద్భుతమైన జీవి ప్రస్తుతం అత్యంత దయనీయమైన స్థితిని ఎదుర్కొంటోంది. అక్రమ జంతు వ్యాపారం, విచక్షణా రహితంగా సాగుతున్న అడవుల నరికివేత కారణంగా వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కారణాల వల్లనే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైక్య (IUCN) ఈ జాతిని 'అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జాతి' గా అధికారికంగా గుర్తించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఇలాంటి అరుదైన వన్యప్రాణుల పాత్ర ఎంతో కీలకం. వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పరిశోధకులు చెబుతున్నారు.