
భారతదేశంలో ఒకప్పుడు కొండలు, గుట్టల గుండా ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రమాదకరమైన పర్వత ప్రాంతాలు, దట్టమైన తీరప్రాంత మార్గాలను అనుసంధానిస్తూ భారత్‌లో నిర్మించిన టాప్ 10 అత్యంత పొడవైన సొరంగాలు దేశ రవాణా రంగాన్ని సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్లాయి.
12.77 కిలోమీటర్ల పొడవైన మెగా ఇంజనీరింగ్ అద్భుతం టన్నెల్ T-50, ఐకానిక్ పీర్ పంజాల్ రైల్ లింక్ వంటి ప్రాజెక్టులు దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా నిలిచాయి. ఇవి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా సౌకర్యాన్ని అందించడమే కాకుండా, దేశ వ్యూహాత్మక రక్షణ రంగానికి కూడా కొండంత అండగా నిలుస్తున్నాయి.
భారతదేశంలో మౌలిక వసతుల కల్పన ఏ రేంజ్‌లో జరుగుతుందో చెప్పడానికి ఈ మెగా ప్రాజెక్టులే నిదర్శనం. రక్షణ పరంగా ఎంతో కీలకమైన సరిహద్దు ప్రాంతాలకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరచడంలో ఈ సొరంగాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. 12.77 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ T-50, పీర్ పంజాల్ రైల్ లింక్ దేశంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాలుగా రికార్డు సృష్టించాయి. హిమాలయ పర్వతాలను తొలిచి వీటిని నిర్మించడం భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.
సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో నిర్మించిన అటల్ రోడ్ టన్నెల్ ఒక అద్భుతమనే చెప్పాలి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) అక్టోబర్ 2020లో ఈ 9.02 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని ప్రారంభించింది. ఇది లేహ్, మనాలీ మధ్య ప్రయాణ సమయాన్ని ఏకంగా నాలుగు గంటల పాటు తగ్గించి ప్రయాణికులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మరోవైపు, చెనాని నుండి నాశ్రి వరకు విస్తరించి ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్ 9.34 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత పొడవైన రోడ్ సొరంగంగా నిలిచింది.
రాజస్థాన్‌లోని ఘాట్ కీ గుని సొరంగం పట్టణ రవాణాకు ఒక చక్కని ఉదాహరణ. 2013 నుండి అందుబాటులోకి వచ్చిన ఈ సొరంగం జైపూర్‌ను ఆగ్రాతో కనెక్ట్ చేస్తుంది. ఝలానా కొండల గుండా సాగే ఈ ప్రయాణం ప్రయాణికులకు సూపర్ వ్యూస్ అందిస్తుంది. ఇక దక్షిణ భారతదేశం విషయానికి వస్తే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మించిన కుతీరన్ రోడ్ టన్నెల్ ఎంతో ప్రత్యేకం. 8.7 కిలోమీటర్ల పొడవుతో, ఫోర్-లేన్‌తో నిర్మించిన ఈ ప్రత్యేకమైన సొరంగం సౌత్ ఇండియాలో ట్రాఫిక్ జామ్‌ల సమస్యను చాలా వరకు తగ్గించింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించిన సెలా టన్నెల్ వ్యూహాత్మకంగా దేశానికి ఎంతో ముఖ్యం. సెలా పాస్ గుండా వెళ్లే ఈ 12.04 కిలోమీటర్ల ప్రాజెక్ట్ దిరాంగ్, తవాంగ్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా లింక్‌ను అందిస్తుంది. దీనివల్ల ఆర్మీ కదలికలు మరింత సులువవుతాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఔట్ టన్నెల్ డబుల్ లేన్ సౌకర్యంతో ఉంటుంది. ఇది కులు, మనాలీ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రధాన ప్రవేశ ద్వారంగా పనిచేస్తోంది.
మహారాష్ట్రలోని ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న సిక్స్-లేన్ భటన్ టన్నెల్ అద్భుతమైన ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. అలాగే, జమ్మూ కాశ్మీర్‌లోని 6.5 కిలోమీటర్ల పొడవైన జెడ్-మోర్ టన్నెల్ శ్రీనగర్, కార్గిల్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కీలకమైన కనెక్టివిటీని ఏర్పాటు చేస్తోంది. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జోజి లా టన్నెల్ రాబోయే రోజుల్లో పెద్ద గేమ్ ఛేంజర్ కానుంది. అత్యంత ప్రమాదకరమైన జోజి-లా పాస్ గుండా సాగే మూడు గంటల ప్రయాణ సమయాన్ని ఈ సొరంగం కేవలం 15 నిమిషాలకు తగ్గించనుంది.