Free Train: మనదేశంలో టిక్కెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసే రైలు ఒకే ఒక్కటి ఉంది. అందులో ఎవరైనా ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చు. ఈ ట్రైన్ ఎక్కడుంది? ఈ రైలు ప్రయాణం ఎందుకు ఉచితం వంటి వివరాలు తెలుసుకోండి.
ఎక్కడైనా సరే రైలులో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా కొనాల్సిందే. టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టాల్సి వస్తుంది. కానీ మన దేశంలో ఓ రైలు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ రైలులో ప్రయాణించేందుకు టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అదే భాక్రా-నంగల్ రైలు. పంజాబ్‌లోని నంగల్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని భాక్రా వరకు ఈ రైలు నడుస్తుంది. దాదాపు 13 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. కొండలు, పచ్చని చెట్లు, సట్లెజ్ నది అందాల మధ్య సాగే ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
23
అందమైన ప్రయాణం
భాక్రా-నంగల్ డ్యామ్ నిర్మాణ సమయంలో ఈ రైలును మొదలుపెట్టారు. 1948లో రైలు సేవలు ప్రారంభమైంది. అప్పట్లో డ్యామ్ నిర్మాణ పనులకు వచ్చే కార్మికులు, అధికారులు ఈ రైలును ఎక్కువగా ఉపయోగించేవారు. నిర్మాణ సామగ్రిని తరలించేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడింది. తర్వాత స్థానిక ప్రజలు, విద్యార్థులు ఈ రైలులో ప్రయాణించడం మొదలుపెట్టారు. పర్యాటకులకు కూడా ఈ రైలు ఆకర్షణగా మారింది. పాతకాలం నాటి బోగీలు, కొండల మధ్య రైలు ప్రయాణం, దారిలో కనిపించే ప్రకృతి దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. మొదట ఈ రైలును ఆవిరి ఇంజిన్‌తో నడిపేవారు. ప్రస్తుతం డీజిల్ ఇంజిన్‌తో నడుస్తోంది.
33
ఇప్పటికీ ఈ రైలు ప్రయాణం ఫ్రీ
ఈ రైలు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. ఓ చారిత్రక గుర్తుగా కూడా నిలిచింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో 2011లో రైలు సేవలను నిలిపివేయాలనే ఆలోచన వచ్చింది. అయితే స్థానిక ప్రజలకు ఉన్న ఉపయోగం, రైలుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని సేవలను కొనసాగించారు. ఇప్పటికీ ఈ రైలులో ప్రయాణించేవారి నుంచి టికెట్ వసూలు చేయడం లేదు. దీంతో టికెట్ లేకుండా ప్రయాణించే రైలుగా ఇది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డబ్బు ఖర్చు లేకుండా రైలు ప్రయాణం చేయడంతో పాటు, కొండలు, నది మధ్య అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించే అవకాశం కూడా ఇక్కడ దొరుకుతుంది. అందుకే ఈ రైలు గురించి తెలిసినవారు ఒక్కసారైనా ఇందులో ప్రయాణించాలని కోరుకుంటారు.