
చుట్టూ మంచుతో కప్పుకున్న ఎత్తైన హిమాలయ పర్వతాలు.. గడ్డకట్టించే చలి.. భారీ హిమపాతాలు.. ఇలాంటి ప్రకృతి సవాళ్ల మధ్య వందల ఏళ్లుగా చెక్కుచెదరకుండా నిలిచిన ఆలయం కేదార్నాథ్. దాదాపు 400 ఏళ్ల పాటు మంచు కింద ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతున్నాయి. 2013లో వచ్చిన భయంకరమైన వరదలను కూడా తట్టుకుని నిలబడింది. అసలు ఈ గుడి నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రకృతి వైపరీత్యాలను సైతం ఎలా తట్టుకుంది?
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో గర్హ్వాల్ హిమాలయాల మధ్య కేదార్నాథ్ ఆలయం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీటర్ల ఎత్తులో, మందాకిని నది జన్మస్థానానికి సమీపంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ ఆలయం చుట్టూ కేదార్నాథ్ శిఖరం, కేదార్ డోమ్ వంటి మంచుకొండలు కనిపిస్తాయి. ఏడాదిలో దాదాపు 6 నెలలు మంచు కప్పేసి ఉంటుంది. ఎవరూ ఉండరు. ఆలయాన్ని కూడా మూసేస్తారు. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తుండటంతో ఆలయాన్ని మూసివేసి, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠ్‌కు తరలించి పూజలు నిర్వహిస్తారు.
కేదార్ నాథ్ ఆలయం గురించి మొట్టమొదట 7 వ శతాబ్దంలో స్కంద పురాణంలో రాయబడింది. అంతేకాదు ఈ ఆలయం ముందు ఒక నంది విగ్రహం ఉంటుంది. దానికెదురుగా ఉన్న దీర్ఘచతురస్రాకార పునాదిపై ఆలయాన్ని నిర్మించారు. గర్భగుడి, భక్తులు సమావేశమయ్యే మండపం ఇందులో ఉన్నాయి. లోపల శివుడిని ప్రత్యేకమైన శంఖాకార రాతి రూపంలో పూజిస్తారు. ఇంత ఎత్తైన పర్వత ప్రాంతంలో, ఆధునిక యంత్రాలు అందుబాటులో లేని కాలంలో ఇలాంటి భారీ రాతి నిర్మాణాన్ని చేపట్టడం అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం.
కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి మహాభారత కాలం నాటి ఆసక్తికరమైన పురాణగాథ ప్రచారంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో తమ బంధువులను చంపడంతో...ఆ పాప భారం మోయలేకపోయారు పాండవులు. అప్పుడు తమ ఆవేదన గురించి వేదవ్యాసుడితో చెప్పడంతో ఆయన శివుడిని దర్శిస్తే పాపాలు పోతాయని సెలవిచ్చారు. దాంతో పాండవులు శివుడి కోసం కాశీకి వెళ్లారు. అయితే కాశీలో శివుడు లేడు. ఉత్తరాఖండ్ లోని గుప్తకాశీలో శివుడు ఉన్నాడని తెలిసి అక్కడ వెతకడం మొదలుపెట్టారు. పాండవుల నుంచి తప్పించుకోవడానికి శివుడు నంది రూపంలోకి మారిపోయాడు. నంది రూపంలో ఉన్న శివుడిని భీముడు గుర్తించాడు. అప్పుడు వెంటనే శివుడు భూలోకంలో వెళ్లిపోతుండగా వెంటనే భీముడు పట్టుకోవడానికి వెళ్లగా నంది మోపురం మాత్రమే పట్టుకోగలుగుతారు. ఆ మోపురం భాగమే ఇప్పుడు కేదార్ నాథ్ లో ఉన్న శివుడి విగ్రహంగా చెబుతారు. ఇప్పుడు పాండవులే ఆ మందిరం నిర్మించారని ప్రతీతి. శివుడు నంది రూపంలో భూలోకంలోని వెళ్లినప్పుడు ముఖభాగం రుద్రనాథ్ లో, తలభాగం కల్పేశ్వర్ లో, భుజభాగం తుంగనాథ్ లో, నాభి మధ్యమహేశ్వర్ లో కొలువైంది. అందుకే ఈ నాలుగు క్షేత్రాలను పంచకేధార్ అంటారు.
కేదార్నాథ్ ఆలయం నిర్మాణం ఎప్పుడు జరిగిందనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత ఆలయ నిర్మాణం వెయ్యేళ్లకు పైగా పురాతనమైనదని బదరీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ పేర్కొంటోంది. ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని స్థాపించారని సంప్రదాయ విశ్వాసం ఉంది. మరికొన్ని కథనాలు పాండవుల కాలంతో ముడిపెడతాయి. అయితే శివుడి యొక్క రుద్రరూపమైన కాలభైరవుడు...ఈ ఆలయాన్ని కాపాడుతున్నారని చెబుతారు. కేదార్ నాథ్ ఆలయానికి ఉత్తరం వైపు 500 మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ ఆలయం ఉంటుంది.
కేదార్నాథ్ ఆలయం గురించి చెప్పుకునే అత్యంత ఆసక్తికరమైన విషయాల్లో ఇది ఒకటి. భూగర్భ శాస్త్రవేత్తల పరిశీలనల ప్రకారం, సుమారు క్రీ.శ. 1300 నుంచి 1900 మధ్య కాలంలో ఈ ప్రాంతం తీవ్రమైన హిమనదుల ప్రభావానికి గురైంది. దీనిని 'లిటిల్ ఐస్ ఏజ్' (Little Ice Age) అని పిలుస్తారు. ఈ సమయంలో ఆలయం దాదాపు 400 ఏళ్ల పాటు మంచు కింద కూరుకుపోయి ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఈ ఆలయ గోడలపై కనిపించే కొన్ని పసుపు రంగు గీతలు, రాళ్లపై ఉన్న మెరుగుదలలు గతంలో ఇక్కడ హిమనదులు కదిలిన ఆనవాళ్లుగా పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు, మంచు, హిమనదుల ఒత్తిడిని తట్టుకునేలా ఆలయ నిర్మాణం ఉండటం కూడా ఆసక్తికరమైన అంశం. వరదల తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వాళ్లు సర్వే చేయగా..ఈ ఆలయాన్ని డిజాస్టర్ ప్రూఫ్ జోన్ లో నిర్మించినట్లు గుర్తించారు. ఈ మందిరంలో ఉన్న రాళ్లను కనెక్ట్ చేయడానికి ఇంటర్ లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు.
కేదార్నాథ్ ఆలయం ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో 2013 జూన్‌లో వచ్చిన వరదలు ముఖ్యమైనవి. ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలు, హిమనదుల నుంచి వచ్చిన నీరు, కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఆలయం చుట్టుపక్కల ఉన్న భవనాలు, దుకాణాలు, రహదారులు వరదల్లో కొట్టుకుపోయాయి.
అయితే ప్రధాన ఆలయం మాత్రం నిలబడింది. దీనికి వెనుక ఉన్న భారీ బండరాయి ఒక కారణమని చెబుతారు. వరద ప్రవాహంతో కొండపై నుంచి దూసుకొచ్చిన ఈ బండరాయి ఆలయం వెనుక కొంత దూరంలో ఆగిపోయి, నీరు, శిథిలాల ప్రవాహాన్ని ఆపేశాయట. దీనినే 'భీమ్ శిల'గా పిలుస్తారు.
ఈ విపత్తు తర్వాత భారత పురావస్తు శాఖ (ASI) ఆలయ పరిరక్షణ పనులు చేపట్టింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో రాళ్లను తిరిగి అమర్చడం, పునాదుల స్థితిని పరిశీలించడం, ఆలయ నిర్మాణాన్ని కాపాడేందుకు అవసరమైన మరమ్మతులు చేయడం వంటి పనులు చేపట్టారు.