సామెతలు కేవలం మాటలు మాత్రమే కావు. అవి జీవిత పాఠాలు. “నిదానమే ప్రధానం” అన్న సామెత కూడా మనం విని ఉంటాం. అయితే నెమ్మదిగా వెళ్తే గమ్యాన్ని త్వరగా ఎలా చేరుకుంటాం. అనే సందేహం వస్తోంది కదూ? ఇది చదివితే మీకే అర్థమవుతుంది.
దుబ్బాక అనే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి వస్తువులు కొనుగోలు చేసి ఇతర గ్రామాల్లో విక్రయిస్తూ లాభాలు పొందేవాడు. ఒక రోజు తక్కువ ధరకు కొబ్బరి బొండాలు దొరికే మరో గ్రామానికి వెళ్లి ఎడ్ల బండి నిండా కొనుగోలు చేశాడు. వాటిని పక్కనే ఉన్న ముస్తాబాద్ అనే గ్రామంలో అమ్మాలని నిర్ణయించాడు.
25
మేకల కాపరి చెప్పిన వింత సమాధానం
దారి సరిగా తెలియకపోవడంతో వ్యాపారి ఒక మేకల కాపరిని ఇలా అడిగాడు. "ఇక్కడి నుంచి ముస్తాబాద్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?". అప్పుడు కాపరి మాట్లాడుతూ.. "నెమ్మదిగా వెళ్తే గంట, వేగంగా వెళ్తే రెండు గంటలు" అంటాడు. ఇది విన్న వ్యాపారి ఆశ్చర్యపోయాడు. "వేగంగా వెళ్తే త్వరగా చేరుకోవాలి కదా, ఇది ఏమి లాజిక్?" అని అనుకున్నాడు.
35
తొందరపాటు ఫలితం
గొర్రెల కాపరి చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా.. గ్రామానికి తొందరగా చేరుకోవాలన్న ఆత్రుతతో వ్యాపారి ఎడ్ల బండిని వేగంగా నడిపించాడు. కానీ మార్గమధ్యంలో పెద్ద గుంత కనిపించక పోవడంతో బండి ఒక్కసారిగా కింద పడింది. బండిలోని అన్ని కొబ్బరిబొండాలు చెల్లాచెదురుగా రోడ్డుమీద పడిపోయాయి. వాటిని ఏరుకోవడంతో ఆయనకు చాలా సమయం పట్టింది. చివరికి ముస్తాబాద్ కు చేరేసరికి కాపరి చెప్పినట్టుగానే రెండు గంటలు పట్టింది.
ఆ క్షణంలోనే వ్యాపారికి అసలు విషయం అర్థమైంది. "వేగంగా వెళ్లాలని తొందరపడితే ఇబ్బందులు వస్తాయి, కానీ నిదానంగా ఉంటే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు" అని. కాపరి చెప్పిన "నిదానమే ప్రధానం" అన్న మాట ఎంత సత్యమో ప్రత్యక్షంగా అనుభవించాడు.
55
ఈ కథ నీతి ఏంటంటే.?
మనలో చాలామంది విజయాన్ని త్వరగా అందుకోవాలని ఆరటపడుతుంటారు. విజయానికి షార్ట్ కట్ లు వెతుక్కుంటారు. దీంతో తప్పుడు మార్గాల్లో వెళ్లి బొక్కో బోర్లా పడుతారు. కానీ సరైన మార్గంలో, నిదానంగా, ఆలోచించి తీసుకున్న అడుగులే చివరికి స్థిరమైన విజయాన్ని ఇస్తాయనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.