
పూర్వం రాపూరం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మహారాజు ధర్మవర్మ పరిపాలించేవాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే మంచి రాజుగా ఆయనకు పేరు ఉండేది. కాలక్రమంలో ఆయన వృద్ధాప్యంలోకి వెళ్లడంతో, తన కుమారుడు విక్రమాదిత్యుడిని రాజ్యానికి వారసుడిగా ప్రకటించాడు. తండ్రి మరణం తర్వాత విక్రమాదిత్యుడు రాజ్యాన్ని చేపట్టాడు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది.
రాజ్యాభిషేకం జరిగిన కొద్ది రోజులకే విక్రమాదిత్యుడిలో అహంకారం పెరిగిపోయింది. తనకంటే తెలివైనవారు ఎవరూ లేరని భావించేవాడు. సభలో మంత్రులు చెప్పే సలహాలను కూడా పట్టించుకునేవాడు కాదు. “నేనే రాజు… నా మాటే చట్టం” అని గర్వంగా చెప్పేవాడు. రాజ్యంలో అందరూ తనకంటే తక్కువవారేనని భావించేవాడు. ప్రజలు భయంతో మౌనంగా ఉండేవారు. కానీ రాజు మాత్రం తన సంపద, సైన్యం, అధికారమే శాశ్వతమని అనుకునేవాడు.
ఒక రోజు రాజభవనానికి ఓ వృద్ధ సాధువు వచ్చాడు. అతని కళ్లలో ప్రశాంతత కనిపించింది. చేతిలో ఒక చిన్న చెక్క పెట్టె ఉంది. సాధువు రాజును చూసి.. “మహారాజా… జీవితంలో ఎప్పుడైనా సందేహం వచ్చినా, కష్టాలు ఎదురైనా ఈ పెట్టెను తెరిచి చూడండి. ఇందులో మీకు అవసరమైన సమాధానం ఉంటుంది” అని చెప్తాడు. అయితే రాజు ఆ మాటలు విని గట్టిగా నవ్వుతాడు. “నాకు కష్టాలు రావడం ఏంటి? నా దగ్గర అపారమైన ధనం ఉంది, వేలాది సైన్యం ఉంది. ఈ సాధువు కూడా పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు” అని వెటకారంగా అన్నాడు. అయినా సరే పెట్టెను తీసుకొని పక్కన పడేశాడు.
కొన్ని రోజుల తర్వాత రాజుకు ఒక్కసారిగా ఆ పెట్టె గురించి గుర్తొచ్చింది. “అందులో ఏముందో చూద్దాం” అనే ఆసక్తి కలిగింది. వెంటనే పెట్టెను తెరిచాడు. అందులో ఒక చిన్న కాగితం మాత్రమే ఉంది. దానిపై ఇలా రాసి ఉంది. “నువ్వు ఇప్పుడు అనుభవిస్తోంది ఇలాగే ఉండదు.” అది చదివిన రాజు మళ్లీ నవ్వాడు. “నా వైభవం పోతుందా? నా శక్తి తగ్గిపోతుందా? అసంభవం!” అని వెటకారంగా మాట్లాడాడు. పెట్టెను మళ్లీ మూసి పక్కన పెట్టేశాడు.
కాలం మారింది. కొన్ని నెలల తర్వాత రాజ్యంలో తీవ్ర కరవు వచ్చింది. వర్షాలు కురవలేదు. పంటలు ఎండిపోయాయి. చెరువులు ఖాళీ అయ్యాయి. ప్రజలకు తినడానికి అన్నం దొరకలేదు. దీనికి తోడు వింత వ్యాధులు వ్యాపించాయి. ప్రతి రోజు వందలాది మంది మరణించడం ప్రారంభమైంది. రాజ్యం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. రాజభాండాగారం ఖాళీ అవుతోంది. ప్రజలను రక్షించడానికి రాజు దగ్గరున్న సంపద అంతా ఖర్చవుతోంది. అప్పుడు విక్రమాదిత్యుడికి మొదటిసారి తన అహంకారం ఎంత చిన్నదో అర్థమైంది. ఆ సమయంలో అతనికి సాధువు ఇచ్చిన పెట్టె గుర్తొచ్చింది. వెంటనే పరుగెత్తి వెళ్లి పెట్టెను తెరిచాడు. ఈసారి కూడా అందులో అదే వాక్యం కనిపించింది. “నువ్వు ఇప్పుడు అనుభవిస్తోంది ఇలాగే ఉండదు.” ఈసారి ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి. “అంటే ఈ కష్టాలు కూడా శాశ్వతం కావా?” అని తనలో తాను ఆలోచించాడు.
కొన్ని రోజుల తర్వాత ప్రకృతి మళ్లీ కరుణించింది. వర్షాలు కురిశాయి. పంటలు పండాయి. వ్యాధులు తగ్గిపోయాయి. ప్రజల జీవితాల్లో మళ్లీ ఆనందం వచ్చింది. రాజ్యం తిరిగి సుభిక్షంగా మారింది. అప్పుడు విక్రమాదిత్యుడికి సాధువు చెప్పిన మాటల అసలు అర్థం తెలిసింది. సంతోషం శాశ్వతం కాదు… అలాగే బాధ కూడా శాశ్వతం కాదు. జీవితం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ రోజు నుంచి విక్రమాదిత్యుడు పూర్తిగా మారిపోయాడు. అహంకారాన్ని విడిచిపెట్టాడు. ప్రజలను ప్రేమతో చూసుకున్నాడు. వినయంతో పాలన సాగించాడు.
మన జీవితంలో సంతోషం వచ్చినప్పుడు చాలా మంది విర్రవీగిపోతారు. బాధలు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోతారు. కానీ ఈ కథ మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తుచేస్తుంది. ఏ పరిస్థితి కూడా శాశ్వతం కాదు.
కాబట్టి ఆనందంలో ఉన్నప్పుడు అహంకారం వద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోవద్దు. కాలం ఎప్పటికైనా మారుతుంది. అందుకే జీవితాన్ని సమతుల్యంగా చూడగలిగినవారే నిజమైన విజేతలు.