Facts: సూర్యుడు ఏ రంగులో ఉంటాడు అనగానే ఠక్కున పసుపు లేదా ఆరెంజ్ అని చెప్తాం. అయితే నిజానికి సూర్యుడి అసలు రంగు తెలుపు అని మీకు తెలుసా? అంతరిక్షం నుంచి చూస్తే సూర్యుడు పాలలాంటి తెల్లటి కాంతితో కనిపిస్తుంది. ఇంతకీ సూర్యుడి రంగులో ఉన్న మాయ ఏంటంటే.?
సూర్యుడు మన కళ్లకు పసుపు లేదా ఆరెంజ్ కలర్‌లో కనిపించడం వెనక కారణం భూమి చుట్టూ ఉన్న వాతావరణం. గాలి, ధూళి, వాయు కణాలు సూర్యకాంతిని మార్చి మనకు వేరే రంగులో చూపిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఒక్క రంగు కాదు. అందులో ఇంద్రధనుస్సులో కనిపించే ఏడు రంగులూ కలిసే ఉంటాయి. ఈ రంగులన్నీ కలిసి బయటకు వచ్చినప్పుడు అది తెల్లటి కాంతిలా కనిపిస్తుంది. అందుకే అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఫొటోలు లేదా చంద్రుడి నుంచి చూసిన దృశ్యాల్లో సూర్యుడు పూర్తిగా తెల్లగా కనిపిస్తాడు. అక్కడ భూమిలా వాతావరణం లేకపోవడంతో కాంతి తన అసలు రూపంలోనే ఉంటుంది.
24
భూమి వాతావరణం వల్లే సూర్యుడు పసుపుగా కనిపిస్తాడు
సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలి, ధూళి, వాయు కణాలను తాకుతుంది. దీంతో కాంతి అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు “స్కాటరింగ్” లేదా “ప్రకీర్ణనం” అంటారు. నీలం, ఊదా రంగుల కాంతి తరంగదైర్ఘ్యం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే అవి ఎక్కువగా చెల్లాచెదురవుతాయి. ఈ కారణంగానే ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుంది. మిగిలిన కాంతి పసుపు రంగు వైపు ఉండటంతో సూర్యుడు కూడా పసుపు రంగులో కనిపిస్తాడు.
34
ఉదయం, సాయంత్రం సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?
సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎరుపు లేదా థిక్ ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తాడు. దీనికి కూడా కారణం వాతావరణమే. ఆ సమయంలో సూర్యుడు భూమికి అంచున ఉన్నట్టుగా కనిపిస్తాడు. కాబట్టి సూర్యకాంతి మన కళ్లకు చేరేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో నీలం, ఆకుపచ్చ వంటి చిన్న తరంగదైర్ఘ్య కాంతి పూర్తిగా చెల్లాచెదురవుతుంది. చివరకు ఎరుపు, నారింజ రంగుల కాంతి మాత్రమే మనకు చేరుతుంది. అందుకే ఉదయం, సాయంత్రం సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.
సూర్యుడి లోపల నిరంతరం అణు సంయోగ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ అణువులు కలిసిపోయి హీలియంగా మారుతాయి. ఈ ప్రక్రియలో భారీగా శక్తి, కాంతి విడుదలవుతుంది. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ తీవ్రమైన వేడి, కాంతి వల్లే సూర్యుడు అంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అంతరిక్షంలో ఈ కాంతి స్వచ్ఛంగా ప్రయాణిస్తుంటే, భూమి వాతావరణంలోకి వచ్చిన తర్వాత మాత్రం రంగు మారినట్టు మనకు కనిపిస్తుంది.