Published : Jul 23, 2026, 07:30 AM ISTUpdated : Jul 23, 2026, 07:51 AM IST
Motivational Story: ఈ రోజుల్లో డబ్బు కోసం చాలామంది షార్ట్‌కట్ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొంతమంది మోసంతో ఎదగాలని చూస్తారు. మరికొందరు నిజాయితీ ఎంచుకుంటారు. అయితే నిజాయితీతో గెలుపు ఆలస్యమైమా, ఓటమి ఉండదనే గొప్ప కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడంతో చదువు పూర్తయ్యాక సమీప పట్టణంలోని ఒక కిరాణా దుకాణంలో ఉద్యోగం ప్రారంభించాడు. జీతం పెద్దగా ఉండేది కాదు. అయినా తన కష్టంతో, నిజాయితీతో పని చేసేవాడు. దుకాణ యజమాని కూడా అతనిపై నమ్మకం పెట్టుకుని నగదు లెక్కలు, కస్టమర్ల వ్యవహారాలన్నీ రాజుకే అప్పగించేవాడు. గ్రామంలో కూడా అతడిని అందరూ మంచి మనిషిగా గౌరవించేవారు.
25
ఒక నిర్ణయం... జీవితాన్నే మార్చేసింది
ఒక రోజు ఓ వృద్ధుడు సరుకులు కొనుగోలు చేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కౌంటర్‌పై రూ.50 వేల నగదు ఉన్న కవర్ కనిపించింది. అది ఆ వృద్ధుడిదేనని రాజు గుర్తించాడు. దుకాణ యజమాని మాత్రం, "ఇది ఎవరికీ తెలియదు. మనమే ఉంచుకుందాం" అని చెప్పాడు. కానీ రాజు అందుకు ఒప్పుకోలేదు. "ఇది మన సొమ్ము కాదు. ఎవరో కష్టపడి కూడబెట్టిన డబ్బు. దీన్ని తీసుకుంటే మనం డబ్బు సంపాదించవచ్చు కానీ మనసును కోల్పోతాం" అని చెప్పి ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లి కవర్‌ను అప్పగించాడు.
డబ్బు అందుకున్న వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. "ఈ డబ్బుతో నా కొడుకును చదివిస్తున్నాను. ఇది పోయి ఉంటే మా కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడేది. ప్రస్తుతం నా కొడుకు ఉన్నత చదువు చివరి దశలో ఉంది" అని చెప్పి రాజును ఆశీర్వదించాడు. బహుమతిగా కొంత డబ్బు ఇవ్వాలని ప్రయత్నించినా, రాజు నవ్వుతూ తిరస్కరించాడు.
35
నిజాయితీకి వచ్చిన గొప్ప ప్రతిఫలం
ఆ ఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద పరిశ్రమ యజమాని గ్రామానికి వచ్చాడు. అతడు మరెవరో కాదు రాజు డబ్బులు ఇచ్చిన ఆ వృద్ధుడి కుమారుడు. ఆరోజు రాజు ఇచ్చిన డబ్బు ఇతని చదువుకే ఉపయోగపడింది. తన తండ్రి నుంచి రాజు నిజాయితీ గురించి విని అతడిని వెతుక్కుంటూ వచ్చాడు. "తాను పెద్ద చదువులు చదివి ఏకంగా కంపెనీ మొదలు పెట్టానని. మా కంపెనీలో నీలాంటి నిజాయితీ ఉన్న వ్యక్తి ఉండాలి. డబ్బు కంటే నమ్మకానికి ఎక్కువ విలువ ఉంటుంది. మా కంపెనీలో మేనేజర్‌గా చేరాలి" అని ఉద్యోగం ఇచ్చాడు.
దీంతో రాజు జీవితమే మారిపోయింది. నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం అందుకునే స్థాయికి ఎదిగాడు. తన ప్రతిభ, క్రమశిక్షణ, నిజాయితీతో కొన్నేళ్లలోనే కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. కారు కొనుగోలు చేశాడు. తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇచ్చాడు.
ఒకసారి ఓ యువకుడు రాజును అడిగాడు. "అన్నా... నీ విజయానికి రహస్యం ఏమిటి?" అని. రాజు చిరునవ్వుతో ఇలా చెప్పాడు. “కష్టపడితే సంపాదన వస్తుంది. కానీ నిజాయితీగా కష్టపడితే నమ్మకం వస్తుంది. ఆ నమ్మకమే జీవితంలో అతి పెద్ద పెట్టుబడి. డబ్బు, విజయం, గౌరవం అన్నీ దాని వెంట వస్తాయి. మోసంతో వచ్చిన డబ్బు కొంతకాలం మాత్రమే ఉంటుంది. నిజాయితీతో వచ్చిన పేరు మాత్రం జీవితాంతం నిలుస్తుంది.”
55
ఈ కథ చెప్పే గొప్ప సందేశం
జీవితంలో కొన్ని సందర్భాల్లో తప్పు మార్గం చాలా సులభంగా కనిపించవచ్చు. కానీ ఆ మార్గం తాత్కాలిక లాభాన్ని మాత్రమే ఇస్తుంది. నిజాయితీ మార్గం కొంచెం కష్టంగా అనిపించినా, చివరికి అదే శాశ్వత విజయాన్ని అందిస్తుంది. మనిషి సంపాదించాల్సింది కేవలం డబ్బు కాదు... నమ్మకం కూడా. ఎందుకంటే డబ్బును కోల్పోతే మళ్లీ సంపాదించవచ్చు. కానీ నమ్మకాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. "నిజాయితీగా సంపాదించిన ఒక్క రూపాయి... మోసంతో సంపాదించిన లక్ష రూపాయల కంటే గొప్పది. నిజాయితీ ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తుంది.. కానీ ఆ ఫలితం జీవితాంతం నిలిచిపోతుంది.