లండన్ నుంచి భార‌త్‌కు బ‌స్సు న‌డిచేద‌ని తెలుసా.? 11 దేశాల మీదుగా, 110 రోజుల ప్ర‌యాణం

Published : Nov 05, 2026, 02:09 PM IST

London to India Bus: లండ‌న్ నుంచి భార‌త్‌కు రావాలంటే క‌చ్చితంగా ఫ్లైట్ ఎక్కాల్సిందే అని తెలిసిందే. అయితే ఒకప్పుడు రెండు దేశాల మ‌ధ్య బ‌స్సు న‌డిచేద‌ని తెలుసా.? ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్సు ప్రయాణంగా గుర్తింపు పొందిన ఈ స‌ర్వీస్ గురించి తెలుసుకుందాం.

PREV
15
1957లో ప్రారంభమైన లండన్ – కలకత్తా బస్సు సర్వీస్

ప్రస్తుతం యూట్యూబర్లు కార్లు, బైక్‌లపై దేశాలు దాటుతూ ప్రయాణాలు చేస్తున్నారు. కానీ దశాబ్దాల క్రితమే ఇలాంటి సాహసయాత్రకు బస్సు సర్వీస్ అందుబాటులో ఉండేది. 1957లో లండన్‌లోని విక్టోరియా కోచ్ స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక బస్సు ప్రయాణం ప్రారంభమైంది. 'ఆల్బర్ట్' (Albert) అనే పేరు కలిగిన ఈ డబుల్ డెక్కర్ బస్సు లండన్ నుంచి భారతదేశంలోని కలకత్తా వరకు ప్రయాణించేది. తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో సాగేది.

ఈ ప్రయాణానికి దాదాపు 110 రోజులు పట్టేది. అంటే దాదాపు నాలుగు నెలల పాటు బస్సులోనే ప్రయాణించాల్సి వచ్చేది. మొత్తం 20 వేల కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమిస్తూ పలు దేశాల మీదుగా ఈ బస్సు వెళ్లేది. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్సు మార్గంగా దీనికి గుర్తింపు లభించింది. 1960, 70వ దశకాల్లో ఈ ప్రయాణం పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించింది.

25
11 దేశాల మీదుగా సాగిన సుదీర్ఘ ప్రయాణం

లండన్ నుంచి కలకత్తా వరకు వెళ్లే ఈ బస్సు ప్రయాణంలో మొత్తం 11 దేశాలు ఉండేవి. లండన్ నుంచి బయలుదేరిన ఆల్బర్ట్ బస్సు బెల్జియం, పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించేది. భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, వారణాసి మీదుగా చివరకు కలకత్తాకు చేరుకునేది. ఈ ప్రయాణంలో ఎన్నో దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను దగ్గరగా చూసే అవకాశం ప్రయాణికులకు లభించేది.

ముఖ్యంగా భారతదేశంలోని ప్రయాణ మార్గం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండేది. తాజ్‌మహల్, ఢిల్లీలోని రాజ్‌పథ్, వారణాసిలోని గంగానది ఘాట్లను సందర్శించే అవకాశం ఉండేది. భారతదేశం మీదుగా సాగే ప్రయాణానికి ఐదు రోజులు పట్టేది. మొత్తం 110 రోజుల ప్రయాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ సమయం కావడం విశేషం.

35
టికెట్ ధర ఎంతంటే.. భోజనం, వసతి కూడా ఉచితమే

ఈ బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం టికెట్ ధర. లండన్ నుంచి కలకత్తాకు ఒకవైపు ప్రయాణానికి అప్పట్లో 85 పౌండ్లు వసూలు చేసేవారు. తిరుగు ప్రయాణానికి 65 పౌండ్లు చెల్లించాల్సి వచ్చేది. అంటే రానుపోను కలిపి మొత్తం 145 పౌండ్లు ఖర్చయ్యేది. ఈ టికెట్ ధరలో కేవలం బస్సు ప్రయాణమే కాకుండా భోజనం, బస సౌకర్యాలు కూడా ఉండేవి. అంటే ప్రయాణికులు ప్రత్యేకంగా హోటళ్లు వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. అప్పట్లో నాలుగు నెలల పాటు అనేక దేశాలను చుట్టివచ్చే అవకాశం ఉండటంతో ఈ ప్రయాణాన్ని విలాసవంతమైన పర్యాటక అనుభవంగా భావించేవారు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవడం కంటే ప్రపంచాన్ని నెమ్మదిగా ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

45
బస్సులోనే రెస్టారెంట్.. ప్రత్యేకంగా సందర్శనా కార్యక్రమాలు

ఆల్బర్ట్ బస్సు సాధారణ బస్సులా ఉండేది కాదు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బస్సు కింది అంతస్తులో చదువుకోవడానికి, భోజనం చేయడానికి వీలుగా ప్రత్యేక లాంజ్ ఉండేది. పై అంతస్తులో ముందు భాగంలో ప్రత్యేక అబ్జర్వేషన్ గది ఉండేది. అక్కడ కూర్చొని బయట ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

అంతేకాదు.. బస్సులోనే వంటగది కూడా ఉండేది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తాజా ఆహారం తయారుచేసి అందించేవారు. రేడియోలో సంగీతం వినిపించేవారు. అప్పుడప్పుడు బస్సులోనే పార్టీలను కూడా నిర్వహించేవారు. నేటిలా ఇంటర్నెట్, వైఫై, స్మార్ట్‌ఫోన్లు లేని కాలంలో ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కొత్త ప్రదేశాలను ఆస్వాదిస్తూ సమయాన్ని గడిపేవారు. ఈ ప్రయాణంలో కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడమే లక్ష్యంగా ఉండేది కాదు. ఆయా దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించేవారు.

తాజ్‌మహల్, పీకాక్ థ్రోన్, రాజ్‌పథ్, వారణాసి ఘాట్లను సందర్శించేవారు. టర్కీలోని గోల్డెన్ హార్న్ ప్రాంతాన్ని చూసేవారు. బల్గేరియాలో అప్పటి కమ్యూనిస్ట్ పాలనలో ప్రజల జీవన విధానాన్ని గమనించేవారు. ఆఫ్ఘనిస్థాన్‌లో సంప్రదాయ దుస్తులు ధరించిన గిరిజన తెగల ప్రజలను చూసే అవకాశం ఉండేది. కాస్పియన్ సముద్రం, బ్లూ డాన్యూబ్ నది, రైన్ లోయ వంటి ప్రకృతి అందాలు కూడా ఈ ప్రయాణంలో భాగమయ్యేవి.

55
21 ఏళ్ల పాటు కొనసాగిన ప్రయాణం.. ఎందుకు నిలిచిపోయిందంటే?

లండన్ – కలకత్తా బస్సు సర్వీస్ దాదాపు 21 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే మధ్యలో ఎదురైన కొన్ని సమస్యలు ఈ ప్రయాణానికి ఆటంకం కలిగించాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో రాజకీయ అస్థిరత, భద్రతాపరమైన సమస్యలు పెరగడంతో ఈ మార్గంలో ప్రయాణించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో బస్సు వెనుక భాగం దెబ్బతినడంతో దాన్ని సర్వీస్ నుంచి తొలగించినట్లు స‌మాచారం. 1968 మేలో బ్రిటిష్ ప్రయాణికుడు ఆండీ స్టీవర్ట్ (Andy Stewart) ఈ బస్సును కొనుగోలు చేశాడు. లండన్‌కు తిరిగి చేరుకోవాలనే ఉద్దేశంతో దాన్ని తన ప్రయాణానికి ఉపయోగించాలనుకున్నాడు.

కాలక్రమంలో అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, వీసా నిబంధనలు, సరిహద్దు ఆంక్షలు, భద్రతాపరమైన సమస్యలు పెరగడంతో ఇలాంటి సుదీర్ఘ బస్సు ప్రయాణం సాధ్యం కాకుండా పోయింది. ఈ ప్రయాణానికి సంబంధించిన పాత ఫొటోలు, టికెట్లు ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories