
కోడిగుడ్డు తినేవాళ్లు చాలామందే ఉంటారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం జిమ్‌కు వెళ్లేవారు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపేవారు తమ ఆహారంలో గుడ్డుకు ప్రత్యేక స్థానం ఇస్తారు. ఇక పిల్లలు కూడా గుడ్డుతో చేసే అహార పదార్థాలను చాలా ఇష్టంగా తింటారు. ఇలా కొందరు ఉడకబెట్టి, మరికొందరు ఆమ్లెట్ వేసుకుని, ఇంకొందరు కర్రీ చేసుకుని ఎగ్స్ తింటుంటారు.
అయితే గుడ్డు విషయంలో ఇప్పటికీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. గుడ్డు వెజిటేరియనా? నాన్‌వెజిటేరియనా? అని. ఈ ప్రశ్నకు సైన్స్ ఒక విధంగా, సంప్రదాయాలు మరో విధంగా సమాధానం చెబుతాయి. అసలు గుడ్డులో పిల్ల ఉంటుందా? మార్కెట్లో దొరికే ప్రతి గుడ్డు నుంచి కోడిపిల్ల బయటకు వస్తుందా? తెలుసుకుందాం.
గుడ్డు కనిపించగానే అందులో ఒక కోడిపిల్ల పెరుగుతుందని అనుకోవడం పూర్తిగా సరైనది కాదు. కోడి గుడ్డు పెట్టడానికి తప్పనిసరిగా కోడిపుంజుతో సంయోగం జరగాల్సిన అవసరం లేదు. ఆడ కోడి సహజంగానే గుడ్లు పెడుతుంది. కోడిపుంజుతో సంయోగం జరగని సందర్భంలో ఏర్పడే గుడ్డును ఫెర్టిలైజ్ కాని గుడ్డు అంటారు.
ఇలాంటి గుడ్డులో పిండం అభివృద్ధి చెందదు. అందువల్ల దాన్ని పొదిగినా కోడిపిల్ల పుట్టదు. వాణిజ్య పౌల్ట్రీ ఫారాల్లో సాధారణంగా గుడ్లను ఉత్పత్తి చేసే కోళ్లను కోడిపుంజుల నుంచి వేరుగా ఉంచుతారు. అందువల్ల మార్కెట్లో లభించే సాధారణ టేబుల్ ఎగ్స్‌లో ఎక్కువ భాగం ఫెర్టిలైజ్ కానివే. అంటే ఇవి వెజిటేరియన్ అన్నమాట.
మరి ఫెర్టిలైజ్ అయిన గుడ్డు సంగతేంటి?
కోడిపుంజుతో సంయోగం జరిగిన తర్వాత కోడి పెట్టే గుడ్డులో పిండం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అయితే ఆ గుడ్డు బయటకు వచ్చిన వెంటనే కోడిపిల్లగా మారదు. తగిన ఉష్ణోగ్రత, తేమ, నిరంతర పొదిగే పరిస్థితులు వంటి అంశాలు అవసరం. అంటే కోడిపుంజుతో సంయోగం జరిగిన గుడ్డు మాత్రమే కోడిపిల్లగా అభివృద్ధి చెందే సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణంగా మనం తినే టేబుల్ ఎగ్స్‌లో మాత్రం పిండం ఉండదు.
గుడ్డును వెజిటేరియన్‌గా పరిగణించే వారి వాదన ప్రధానంగా దాని ఉత్పత్తి విధానంపై ఆధారపడి ఉంటుంది. ఫెర్టిలైజ్ కాని గుడ్డులో అభివృద్ధి చెందుతున్న పిండం లేదా కోడిపిల్ల ఉండదు. అందుకే కొందరు దీన్ని మాంసాహారంగా పరిగణించాల్సిన అవసరం లేదని భావిస్తారు. అయితే ఇది శాస్త్రీయ వాస్తవం కంటే ఆహార వర్గీకరణకు సంబంధించిన అంశం. గుడ్డు కోడి నుంచి లభించే జంతు ఉత్పత్తి కావడంతో, శాకాహారాన్ని పాటించే చాలామంది దీన్ని తమ ఆహారంలో చేర్చుకోరు.
భారతదేశంలో గుడ్డును ఏ కేటగిరీలో పెడతారు?
భారతదేశంలో సాధారణంగా గుడ్డును నాన్‌వెజిటేరియన్ ఆహారంలో భాగంగా పరిగణిస్తారు. అందుకే సంప్రదాయ శాకాహారాన్ని పాటించే కుటుంబాల్లో గుడ్లకు దూరంగా ఉంటారు. అయితే అందరి ఆహార నియమాలు ఒకేలా ఉండవు.
గుడ్లు తింటూ మాంసం, చేపలు, చికెన్ వంటి ఆహారాలను తీసుకోని కొందరు తమను ఓవో వెజిటేరియన్ (Ovo Vegetarian) అని పిలుచుకుంటారు. అంటే మొక్కల ఆధారిత ఆహారంతో పాటు గుడ్లను తీసుకునే ఆహార విధానం అన్నమాట.
పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?
కొన్ని పాశ్చాత్య ఆహార వర్గీకరణల్లో గుడ్డును మాంసంగా కాకుండా యానిమల్ ప్రొడక్ట్ గా పరిగణిస్తారు. అందువల్ల గుడ్లు తింటూ మాంసం తినని వారిని ఓవో వెజిటేరియన్లుగా వర్గీకరిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా “వెజిటేరియన్” అనే పదానికి ఒకే నిర్వచనం లేదు. వ్యక్తిగత నమ్మకాలు, సంస్కృతి, మతం, ఆహార నియమాల ఆధారంగా గుడ్డు విషయంలో అభిప్రాయాలు మారుతుంటాయి.
గుడ్డు తినకపోతే ప్రోటీన్ తగ్గిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. సరైన ఆహార ప్రణాళికతో పూర్తిగా వెజిటేరియన్ ఆహారం తీసుకుంటూనే శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందవచ్చు. పనీర్, పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో పాటు సోయాబీన్,, పప్పులు, శనగలు, రాజ్మా, బీన్స్, కాయధాన్యాలు, విత్తనాలు వంటి ఆహార పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులుగా ఉపయోగపడతాయి. వ్యాయామం చేసే వారు తమ శరీర బరువు, వ్యాయామ తీవ్రత, మొత్తం ఆహార అవసరాలకు అనుగుణంగా ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం.
ఇటీవల కాలంలో “వెజిటేరియన్ ఎగ్” లేదా ప్లాంట్ బేస్డ్ ఎగ్ పేరుతో కొన్ని ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇవి కోడి పెట్టే గుడ్లు కావు. మొక్కల ఆధారిత పదార్థాలతో గుడ్డును పోలిన రుచి, ఆకృతి లేదా వంట లక్షణాలను అందించేందుకు తయారు చేసే ఎగ్ ప్రత్యామ్నాయాలు. పెసలు, సోయా, ఇతర పప్పుధాన్యాలు, విత్తనాలు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు వంటి పదార్థాలను ఉపయోగించి ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. కాబట్టి వీటిని సాధారణ కోడి గుడ్డుతో కలిపి చూడకూడదు.
చివరికి గుడ్డు వెజ్ లేదా నాన్‌వెజ్?
దీనికి అందరూ అంగీకరించే ఒకే సమాధానం లేదు. సైన్స్ పరంగా ఫెర్టిలైజ్ కాని కోడి గుడ్డులో అభివృద్ధి చెందుతున్న పిండం ఉండదు. కానీ అది కోడి నుంచి లభించే జంతు ఉత్పత్తి కావడంతో ఆహార వర్గీకరణలో చాలామంది దాన్ని నాన్‌వెజిటేరియన్‌గా పరిగణిస్తారు.
అందుకే గుడ్డు విషయంలో “వెజ్” లేదా “నాన్‌వెజ్” అనే నిర్ణయం కేవలం గుడ్డులో పిల్ల ఉందా లేదా అనే విషయంపైనే ఆధారపడదు. శాస్త్రీయంగా గుడ్డు ఎలా ఏర్పడుతుంది, ఆహార వర్గీకరణలో దాన్ని ఎలా చూస్తారు, వ్యక్తిగతంగా ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తున్నారు అనే మూడు అంశాలను వేర్వేరుగా అర్థం చేసుకోవాలి.