IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే

Published : Aug 06, 2026, 07:02 AM IST

IRCTC Sapta Jyotirlinga Mahayatra: ఐఆర్‌సీటీసీ భక్తుల కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో 7 జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది.

PREV
15
ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర

దేవాలయాల దర్శనం, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. "సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర" పేరిట ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు ఏకంగా ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. భారత్ గౌరవ్ డిలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా ప్రయాణికులకు ఈ సేవలు అందిస్తారు. రైలు టూరిజాన్ని ప్రోత్సహించడానికి భారత రైల్వే ఈ ప్యాకేజీలో సుమారు 33 శాతం రాయితీని ఇప్పటికే కలిపినట్లు తెలిపింది.

25
కవర్ అయ్యే దర్శనీయ ప్రాంతాలు, రైలు బోర్డింగ్ వివరాలు

ఈ యాత్రలో భాగంగా భక్తులు భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, మహాకాల్ లోక్ కారిడార్, రామ్ ఘాట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయం, రుక్మిణీ దేవి ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, భేట్ ద్వారకలకు వెళ్తారు. అలాగే సోమనాథ్ ఆలయం, సోమనాథ్ బీచ్, భాల్కా తీర్థం, పుణేలోని భీమాశంకర్ జ్యోతిర్లింగం కవర్ అవుతాయి.

ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) లోని ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎల్లోరా కైలాస మందిరం, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు పంచవటిని కూడా దర్శించుకోవచ్చు. ప్రయాణికులు ఎక్కడానికి ఢిల్లీ సఫ్దర్‌జంగ్, మధుర జంక్షన్, ఆగ్రా కాంట్, విరాంగన లక్ష్మీబాయి (ఝాన్సీ), భోపాల్ జంక్షన్ స్టేషన్లలో సౌకర్యం ఉంది. యాత్ర ముగిసాక దిగడానికి భోపాల్, ఝాన్సీ, ఆగ్రా కాంట్, మధుర, ఢిల్లీ సఫ్దర్‌జంగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.

35
సీట్ల సంఖ్య, టికెట్ ధరల వివరాలు ఇవే

ఈ రైలులో మొత్తం 150 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో సుపీరియర్ ఏసీ 1 30 సీట్లు, సుపీరియర్ ఏసీ 1 (కేబిన్) 45 సీట్లు, డిలక్స్ ఏసీ 2 టైర్ 45 సీట్లు, కంఫర్ట్ ఏసీ 3 టైర్ 30 సీట్లు ఉన్నాయి. ప్రయాణ క్లాస్, రూమ్ షేరింగ్ ఆధారంగా ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి.

• సుపీరియర్ (ఏసీ I): సింగిల్ షేరింగ్‌కు ₹1,34,255, డబుల్ షేరింగ్‌కు ₹1,19,425, ట్రిపుల్ షేరింగ్‌కు ₹1,17,305 గా నిర్ణయించారు. 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు ₹1,09,910 ఛార్జ్ చేస్తారు.

• డిలక్స్ (ఏసీ II): సింగిల్ షేరింగ్‌కు ₹1,24,755, డబుల్ షేరింగ్‌కు ₹1,09,925, ట్రిపుల్ షేరింగ్‌కు ₹1,07,805 గా ఉంది. పిల్లలకు ₹1,00,410 ఛార్జ్ ఉంటుంది.

• కంఫర్ట్ (ఏసీ III): సింగిల్ షేరింగ్‌కు ₹1,05,760, డబుల్ షేరింగ్‌కు ₹90,930, ట్రిపుల్ షేరింగ్‌కు ₹88,810 కాగా, పిల్లలకు ₹81,415 గా ఛార్జ్ నిర్ణయించారు.

టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఇద్దరు వ్యక్తులకు ఒక లోయర్ బెర్త్ కేటాయిస్తారు. ప్రయాణానికి 3 రోజుల ముందు బెర్త్ కేటాయింపులు పూర్తవుతాయి.

45
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు, మినహాయింపులు ఇవే

ప్యాకేజీ ప్రయాణికులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది. భారత్ గౌరవ్ డిలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో ప్రయాణంతో పాటు ఉజ్జయిని (1 రాత్రి), ద్వారక (1 రాత్రి), పుణే (1 రాత్రి) లలో 3-స్టార్ హోటళ్లలో బస సౌకర్యం కల్పిస్తారు. నాసిక్‌లో వాష్ అండ్ ఛేంజ్ సౌకర్యం ఉంటుంది. మిగిలిన 7 రాత్రులు రైలు కోచ్‌లలోనే బస ఉంటుంది. ప్రయాణంలో ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (కేవలం శాకాహారం) అందిస్తారు.

ఏసీ I, ఏసీ II ప్రయాణికులకు రైలులోని రెస్టారెంట్‌లో, ఏసీ III ప్రయాణికులకు వారి బెర్త్‌ల వద్ద భోజనం వడ్డిస్తారు. స్థానిక సందర్శనల కోసం ఏసీ బస్సు రవాణా, మ్యూజియం/స్మారక చిహ్నాల ప్రవేశ రుసుములు, గైడ్ సేవలు, ప్రయాణ ప్రమాద ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, టూర్ మేనేజర్ సహాయం ఉంటాయి. అయితే, వ్యక్తిగత ఖర్చులు (లాండ్రీ, మినరల్ వాటర్), ప్రత్యేక దర్శన రుసుములు, ప్యాకేజీలో పేర్కొనని అదనపు సైట్‌సీయింగ్ ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

55
టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్.. సంప్రదించాల్సిన వివరాలు ఇవే

ప్రయాణం రద్దు చేసుకోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీ కొన్ని క్యాన్సిలేషన్ రూల్స్ ఉంచింది. ట్రిప్ ప్రారంభానికి 15 రోజుల కంటే ముందు రద్దు చేసుకుంటే ప్రయాణికుడికి ₹250 మినహాయించి మిగిలిన మొత్తం రీఫండ్ చేస్తారు. 8 నుండి 14 రోజుల ముందు రద్దు చేస్తే ప్యాకేజీ ధరలో 25 శాతం, 4 నుండి 7 రోజుల ముందు రద్దు చేస్తే 50 శాతం మినహాయిస్తారు. ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ వ్యవధిలో రద్దు చేస్తే రూపాయి కూడా రీఫండ్ లభించదు. ప్రయాణికులు ప్రయాణ సమయంలో అధికారిక గుర్తింపు కార్డును తప్పనిసరిగా ఉంచుకోవాలి. 

యాత్రకు సంబంధించిన మరింత సమాచారం, బుకింగ్ కోసం న్యూఢిల్లీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని ఫోన్ నంబర్లు (011-35464059, 8287930484, 8287930739, 8595931047, 8287930032, 8287930299, 8882826357) ద్వారా ఉదయం 9:30 నుండి సాయంత్రం 7:00 గంటల మధ్య సంప్రదించవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్ర సెప్టెంబర్ 25న ప్రారంభం అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories