
National Highway-44 : భారతదేశం ఎంత పెద్ద దేశమో చెప్పడానికి ఇక్కడి రహదారి వ్యవస్థ కూడా ఒక ఉదాహరణ. దేశంలోని ఉత్తర, దక్షిణాలు... తూర్పు, పడమరలను కలుపుతూ వేల కిలోమీటర్లు ప్రయాణించే జాతీయ రహదారులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది నేషనల్ హైవే-44 (NH-44). ఇది ఉత్తరాన చిట్టచివరన గల జమ్మూ కాశ్మీర్ నుండి దక్షిణ చివర్లో గల తమిళనాడు వరకు సుదీర్ఘ దూరం కొనసాగే హైవే. భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారిగా NH-44 గుర్తింపు పొందింది.
సుమారు 4,112 కిలోమీటర్ల పొడవుతో ఉత్తరం నుంచి దక్షిణం వరకు పయనించే ఈ రహదారి ఎన్నో రాష్ట్రాలు, ప్రముఖ నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలను కలుపుతుంది. అందుకే NH-44ను కేవలం ఒక రహదారిగా కాకుండా.. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించేదిగా చూడవచ్చు.
NH-44 ఉత్తరాన కశ్మీర్ లోయలోని శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు సాగుతుంది. అంటే హిమాలయ ప్రాంతం నుంచి మొదలై దక్షిణాన బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలు కలిసేచోట ముగుస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈ హైవే జమ్మూ, పఠాన్‌కోట్, జలంధర్, లూధియానా, అంబాలా, కర్నాల్, పానిపట్, ఢిల్లీ, ఫరీదాబాద్, మథుర, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, సాగర్, నాగ్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, సేలం, మధురై, తిరునెల్వేలి వంటి అనేక ముఖ్యమైన నగరాలు, పట్టణాలను కలుపుతుంది.
ఇందులో హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తెలంగాణ మీదుగా వెళ్లే NH-44 రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాలను హైదరాబాద్‌తో... అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా దక్షిణ భారతంతో కలుపుతుంది.
NH-44 మొత్తం 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా సాగుతుంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, Madhya Pradesh, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది.
అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న NH-44 మొత్తం మొదటి నుంచి ఒకే నంబర్‌తో ఉన్న రహదారి కాదు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నంబర్లను పునర్వ్యవస్థీకరించిన తర్వాత పాత హైవేలలోని వివిధ భాగాలను కలిపి కొత్త NH-44గా గుర్తించారు. పాత హైవేలు NH-1A, NH-1, NH-2, NH-3, NH-75, NH-26, NH-7లోని మార్గాలు NH-44తో అనుసంధానమయ్యాయి. అందువల్ల గతంలో వేర్వేరు నంబర్లతో ఉన్న అనేక రహదారి భాగాలు ఇప్పుడు ఒకే NH-44 నంబర్ కింద కనిపిస్తాయి.
ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలకు కనెక్టివిటీ
NH-44 మార్గంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, నాగ్‌పూర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, సేలం, మధురై వంటి ముఖ్యమైన నగరాలను కూడా ఈ రహదారి కలుపుతుంది.
దీంతో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తువుల రవాణా, ప్రయాణికుల రాకపోకల్లో ఈ మార్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకులు, ఇతర వాణిజ్య రవాణాకు కూడా ఈ మార్గంలోని వివిధ భాగాలు కీలకంగా ఉన్నాయి.
NH-44లోని ప్రధాన భాగాలు భారతదేశ నార్త్-సౌత్ కారిడార్తో అనుసంధానమై ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి సెంట్రల్, దక్కన్ ప్రాంతం మీదుగా దక్షిణ భారతదేశానికి వెళ్లే రహదారి కనెక్టివిటీలో దీనికి ముఖ్యమైన స్థానం ఉంది.
ఒక చివర కశ్మీర్.. మరో చివర కన్యాకుమారి ఉండటంతో దేశ భౌగోళిక వైవిధ్యాన్ని కూడా ఈ హైవే ప్రతిబింబిస్తుంది. కశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ప్రయాణం.. పంజాబ్ మైదానాలు, ఉత్తర భారత నగరాలు,సెంట్రల్ ఇండియా పీఠభూమి, దక్కన్ ప్రాంతం మీదుగా సాగి చివరకు దక్షిణ భారత తీర ప్రాంతానికి చేరుతుంది.
వాతావరణంలోనూ ఎన్నో మార్పులు
NH-44లో ప్రయాణించే వారికి మరో ఆసక్తికరమైన విషయం.. ఒకే రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ మార్గంలో పూర్తిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయి. శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో చలి, మంచు, కొండ ప్రాంతాల ప్రభావం కనిపిస్తే… ఉత్తర భారత మైదాన ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సెంట్రల్ ఇండియా దాటిన తర్వాత దక్కన్ ప్రాంత వాతావరణం కనిపిస్తుంది. దక్షిణ భారతంలోకి వెళ్లే కొద్దీ వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతాయి. అంటే ఒకే హైవేపై ప్రయాణిస్తూ భారతదేశంలోని భౌగోళిక, వాతావరణ వైవిధ్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది.
తెలంగాణకు NH-44 అత్యంత కీలకమైన జాతీయ రహదారుల్లో ఒకటి. మహారాష్ట్ర వైపు నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ఈ మార్గం హైదరాబాద్ మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు సాగుతుంది. తెలంగాణలోని పలు ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ఈ ప్రధాన రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉన్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఉత్తర భారతదేశం వైపు వెళ్లే ప్రయాణాలకు, అలాగే బెంగళూరు, చెన్నై వంటి దక్షిణ భారత నగరాల వైపు వెళ్లే రవాణాకు NH-44లోని వివిధ భాగాలు ఉపయోగపడతాయి.
ఒక హైవే.. దేశం మొత్తం ప్రయాణం
శ్రీనగర్‌లోని పర్వత ప్రాంతాల నుంచి బయలుదేరి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, Madhya Pradesh, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా ప్రయాణించి కన్యాకుమారి చేరే NH-44.. భారతదేశంలోని విభిన్న ప్రాంతాలను ఒకే రహదారి నెట్‌వర్క్‌తో కలుపుతుంది. అందుకే NH-44 కేవలం దేశంలోనే పొడవైన హైవే అనే రికార్డుకు మాత్రమే పరిమితం కాదు. ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో కలిపే అత్యంత ముఖ్యమైన రహదారి మార్గాల్లో ఇది ఒకటి. వేల కిలోమీటర్ల దూరాన్ని దాటుతూ దేశంలోని అనేక నగరాలు, రాష్ట్రాలు, ఆర్థిక ప్రాంతాలను అనుసంధానించడం దీని అసలు ప్రత్యేకత. NH-44 దేశంలో అతిపెద్దదే కాదు ప్రపంచంలోనే 22వ అతి పొడవైన హైవే.