Moringa Leaf Powder: మునగాకు పొడితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక డిమాండ్ కారణంగా మార్కెట్ లో కల్తీ పెరుగుతోంది. అయితే, ఇంట్లోనే స్వచ్ఛమైన మునగాకు పొడిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకుందాం.
మునగ చెట్టును మనం ఒక అద్భుతమైన 'సూపర్ ఫుడ్' అని పిలుస్తాం. దీని ఆకుల్లో ఉండే పోషకాలు మరెక్కడా దొరకవు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం మునగాకు పొడిని క్రమంతప్పకుండా తింటున్నారు. రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మంది ఈ పొడిని మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తుంటారు. కానీ బయట దొరికే పొడిలో నాణ్యత విషయంలో సందేహాలు ఉంటాయి. అందుకే ఎలాంటి కల్తీ లేని, వంద శాతం ప్యూర్ మునగాకు పొడిని మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తి వివరాలతో చూద్దాం.
26
మునగాకు పొడికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు
ఇంట్లో మునగాకు పొడి సిద్ధం చేయడానికి కొన్ని సాధారణ వస్తువులు ఉంటే సరిపోతుంది..
• తాజా, పచ్చని మునగాకులు
• శుభ్రమైన నీరు
• ఒక కాటన్ క్లాాాత్
• ఒక పెద్ద ట్రే లేదా జాలి ప్లేట్
• మిక్సీ గ్రైండర్
• ఒక సన్నని జల్లెడ
• ఎయిర్‌టైట్ జార్
36
మునగ ఆకుల ఎంపిక, శుభ్రం చేయడం ఎలాగంటే?
ముందుగా మునగ చెట్టు నుండి మంచి తాజా, పచ్చగా ఉండే ఆకులను ఏరుకోవాలి. పురుగులు పట్టిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను అసలు తీసుకోకూడదు. నాణ్యమైన ఆకులు మంచి రుచితో పాటు సరైన పోషకాలను ఇస్తాయి. ఆ తర్వాత ఈ మునగాకులను 2 నుండి 3 సార్లు శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. దీనివల్ల ఆకులపై ఉన్న దుమ్ము, ధూళి, మట్టి సహా ఇతర వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి.
కడిగిన మునగ ఆకులను ఒక పొడి కాటన్ క్లాాత్ లేదా కిచెన్ టవల్ మీద పరచాలి. ఆకులపై ఉన్న అదనపు నీటిని మెల్లగా తుడిచి వేయాలి. ఆకులలో కాస్త తేమ ఉన్నా కూడా పొడి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆకులను ఒక పెద్ద ట్రేలో పలుచగా పరిచి, గాలి తగిలే శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టాలి. మధ్యమధ్యలో ఆకులను కలుపుతూ ఉండాలి. అయితే ఆకులను వేడి ఎండలో ఆరబెట్టకూడదు. తీవ్రమైన ఎండ తగిలితే ఆకులలో ఉండే సహజ పోషకాలు తగ్గిపోతాయి.
56
మిక్సీలో గ్రైండింగ్.. జల్లించడం
మునగ ఆకులు బాగా ఎండిన తర్వాత అంటే నీరు లేకుండా ఆరిన తర్వాత, చేతితో నలిపితే సులభంగా విరిగిపోతాయి లేదా పొడిలా మారతాయి. ఆకులు ఈ స్థితికి వచ్చాయంటే అవి పౌడర్ తయారీకి సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఈ ఎండిన ఆకులను మిక్సీ జార్‌లో వేసి సన్నగా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిని సన్నని జల్లెడలో వేసి బాగా జల్లించాలి. జల్లించగా పైన మిగిలిపోయిన పెద్ద ముక్కలను మళ్లీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, తిరిగి జల్లించుకోవాలి.
66
మనగాకు పొడిని నిల్వ చేయడం
ఇలా తయారైన ప్యూర్ మునగాకు పొడిని పూర్తిగా పొడిగా ఉన్న, ఎయిర్‌టైట్ గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ సీసాను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. తేమ తగలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు కావలసినప్పుడు ఈ స్వచ్ఛమైన, ఇంట్లోనే తయారైన మునగాకు పొడిని మీ ఆహారంలో లేదా పానీయాలలో ఉపయోగించుకోవచ్చు.
మునగాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బయట మార్కెట్లో దొరికే కెమికల్స్ కలిపిన పొడుల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఈ మునగాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎంతో సురక్షితమైనది.