
సముద్రంలో చూస్తే అంతులేని నీళ్లు... కానీ తీరానికి వెళ్తే మనం వంటల్లో వేసుకునే స్వచ్ఛమైన తెల్లటి ఉప్పు ఉంటుందని మీకు తెలుసా.. అసలు అలలతో ఎగిసిపడే ఆ ఉప్పు నీరు, మన డైనింగ్ టేబుల్ మీదికి పొడిపొడిగా ఉండే ఐయోడైజ్డ్ ఉప్పులా ఎలా వస్తుంది? దీని వెనుక ఉన్న ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సూర్యుడి వేడి, గాలి, సైంటిఫిక్ రిఫైనింగ్ అన్నీ కలిస్తేనే మన చేతికి ఉప్పు దొరుకుతుంది. సముద్రపు నీరు మన ప్యాకెట్ ఉప్పుగా మారేంత వరకు జరిగే ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాం.
మన భూమిపై ఉన్న రాళ్ల మీద వర్షం పడినప్పుడు, ఆ నీరు రాళ్లలోని సోడియం, క్లోరైడ్ వంటి వివిధ ఖనిజాలను తనలో కరిగించుకుంటుంది. ఈ నీరంతా ప్రవాహాల ద్వారా నదుల్లో చేరి, ఆ నదుల ద్వారా చివరికి సముద్రాల్లోకి వెళ్లిపోతుంది. సముద్రంలో చేరిన నీరు ఎండ వేడికి ఆవిరై మేఘాలుగా మారిపోతుంది కానీ, అందులోని లవణాలు మాత్రం ఆవిరి కావు.
కోట్లాది సంవత్సరాలుగా ఇదే ప్రాసెస్ రిపీట్ అవ్వడం వల్ల సముద్రపు నీటిలో లవణాల సాంద్రత పెరిగిపోయింది. సాధారణంగా సముద్ర నీటిలో 3.5% వరకు లవణీయత ఉంటుంది. అంటే ప్రతి లీటర్ సముద్రపు నీటిలో దాదాపు 35 గ్రాముల ఉప్పు దాగి ఉందన్నమాట. ఇందులో మెజారిటీ భాగం మనం వాడే సోడియం క్లోరైడ్ ఉంటుంది.
సముద్రపు నీటి నుండి ఉప్పును తీయడానికి ప్రధానంగా వాడే పద్ధతి 'సోలార్ ఎవాపరేషన్'. అంటే ఎండబెట్టి ఆవిరి చేయడం. సముద్ర తీర ప్రాంతాల్లో లోతు తక్కువగా ఉండే పెద్ద పెద్ద చతురస్రాకారపు మడులను తయారు చేస్తారు.
సముద్రంలో అలలు ఎక్కువగా వచ్చే సమయంలో గానీ లేదా పెద్ద పంపుల సహాయంతో గానీ ఈ నీటిని సాల్ట్ మడులలోకి మళ్లిస్తారు. భారతదేశంలో గుజరాత్‌లోని కచ్, తమిళనాడులోని తుత్తుకుడి, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, విశాఖపట్నం తీర ప్రాంతాల్లో ఇలాంటి ఉప్పు మడులు వేల ఎకరాల్లో కనిపిస్తాయి.
మడుల్లోకి చేరిన నీటిపై సూర్యరశ్మి, గాలి పడగానే భాష్పీభవనం స్టార్ట్ అవుతుంది. నీరు ఎంత ఎక్కువ ఎండకు గురైతే అంత త్వరగా ఆవిరైపోతుంది. రోజులు, వారాలు గడిచే కొద్దీ నీటి శాతం తగ్గిపోతూ, నీటిలో ఉప్పు సాంద్రత క్రమంగా పెరుగుతుంది.
నీరంతా పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత, మడుల అడుగు భాగంలో మందపాటి పచ్చి ఉప్పు స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. ఈ ముడి ఉప్పును ట్రాక్టర్లు, యంత్రాలు లేదా కార్మికుల ద్వారా సేకరించి కుప్పలు వేస్తారు. అయితే ఈ దశలో ఉన్న పచ్చి ఉప్పు కాస్త బూడిద లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇందులో మట్టి, ఇసుకతో పాటు మెగ్నీషియం, కాల్షియం కాంపౌండ్స్ వంటి ఇతర రసాయనాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని డైరెక్ట్‌గా తినలేం.
సేకరించిన పచ్చి ఉప్పును నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలిస్తారు. మన వంటలకు పనికివచ్చేలా దాన్ని క్లీన్ అండ్ రిఫైన్ చేసే క్రమం ఇది:
• వాషింగ్: పచ్చి ఉప్పులోని ఇసుక, మట్టిని తొలగించేందుకు శుభ్రమైన ఉప్పు నీటితో బాగా కడుగుతారు. మంచి నీటితో కడిగితే ఉప్పు కరిగిపోతుంది కాబట్టి, ప్రత్యేకంగా తయారు చేసిన ఉప్పు నీటితోనే డస్ట్ మొత్తం క్లీన్ చేస్తారు.
• స్పటికీకరణ : ఉప్పును కరిగించి, మళ్లీ క్రిస్టలైజేషన్ పద్ధతిలో శుద్ధమైన తెల్లటి ఉప్పు స్పటికాలుగా మారుస్తారు. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా ఉప్పుకు పూర్తి తెల్లదనం అండ్ ప్యూరిటీ వస్తాయి.
రిఫైన్ అయిన ఉప్పును మన ఇళ్లలో వాడే పొడిపొడి సన్న ఉప్పు గా మార్చేందుకు రెండు ముఖ్యమైన పదార్థాలను కలుపుతారు.
1. ఐయోడిన్: మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉప్పుకు నిర్ణీత మోతాదులో ఐయోడిన్ సమ్మేళనాలను కలుపుతారు.
2. ఆంటీ-కేకింగ్ ఏజెంట్లు : సాధారణంగా ఉప్పు గాలిలోని తేమను పీల్చుకుని గడ్డకట్టే గుణం కలిగి ఉంటుంది. అలా కాకుండా ప్యాకెట్‌లో ఎప్పుడూ పొడిపొడిగా, ఫ్రీ-ఫ్లోయింగ్‌గా ఉండటానికి సురక్షితమైన ఆంటీ-కేకింగ్ కెమికల్స్ కలుపుతారు.
ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక, చివరగా క్వాలిటీ చెక్ చేసి ఐయోడైజ్డ్ తెల్లటి ఉప్పును వివిధ పరిమాణాల ప్యాకెట్లలో ప్యాక్ చేసి మార్కెట్లకు, మన ఇళ్లకు సరఫరా చేస్తారు. సూర్యుడి వేడిని, ప్రకృతి శక్తిని వాడుకుని చేసే ఈ ఉప్పు తయారీ పర్యావరణానికి హాని చేయని అత్యంత చౌకైన అద్భుతమైన సహజ సిద్ధమైన పద్ధతి.