Interesting Facts: ఇండియాకు తూర్పు వైపు ఉన్నా ఆ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్ అని పేరు ఎలా పెట్టారు?

Published : Jun 21, 2026, 10:26 AM IST

Interesting Facts: మనదేశంలో వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్ ప్రధాన రాష్ట్రం. అయితే పేరు పశ్చిమ దిశ పేరు ఉన్నా.. అది మన దేశానికి తూర్పు వైపు ఉంటుంది. మరి దానికి పశ్చిమ బెంగాల్ అనే పేరు ఎలా వచ్చింది? 

PREV
13
పశ్చిమ బెంగాల్ పేరు ఎలా వచ్చింది?

భారతదేశ మ్యాప్ లో ఓసారి చూడండి... తూర్పు వైపు ఉన్న రాష్ట్రానికి ‘పశ్చిమ బెంగాల్’ అనే పేరు ఉంటుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా ఏదైనా ప్రాంతానికి పేరు పెట్టేటప్పుడు అది ఉన్న దిశను బట్టి కూడా పేరు పెడతారు. కానీ పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం అసలు కథ వేరుగా ఉంటుంది. ఈ పేరు భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో ఉందని కాదు.. ఒకప్పుడు ఉన్న భారీ బెంగాల్ ప్రాంతం విభజనతో ఈ పేరు ఏర్పడింది. చరిత్రలో జరిగిన కీలక ఘట్టమే ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన పేరును ఇచ్చింది. బ్రిటిష్ పాలన సమయంలో బెంగాల్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది. పరిపాలనా, ఆర్థిక, సాంస్కృతిక రంగాలన్నీ బెంగాల్‌ నుంచే జరిగేవి. అయితే 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనకు ప్రయత్నించింది. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ విభజనను రద్దు చేశారు. కానీ 1947లో భారతదేశ విభజన సమయంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మత ప్రాతిపదికన భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు బెంగాల్ కూడా రెండు భాగాలుగా విడిపోయింది.

23
తూర్పు బెంగాల్ ఏమైంది?

బెంగాల్‌లోని పశ్చిమ ప్రాంతం భారతదేశంలో భాగమైంది. ఈ ప్రాంతాన్ని ‘West Bengal’ అని పిలవడం ప్రారంభించారు. అదే సమయంలో తూర్పు బెంగాల్ పాకిస్థాన్‌లో చేరింది. అప్పట్లో దానిని ‘East Bengal’ అని పిలిచారు. తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం ప్రత్యేక దేశంగా మారింది. అంటే ‘West’ అనే పదం భారతదేశానికి సంబంధించి పశ్చిమ దిశను సూచించదు. మొత్తం బెంగాల్ ప్రాంతంలో పశ్చిమ వైపున ఉన్న భాగం భారత్‌లో ఉండటంతో ఆ పేరు వచ్చింది.

33
విభజన తరువాత వలస

ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర బెంగాల్ ప్రాంతం ఎదుర్కొన్న రాజకీయ మార్పులను కూడా తెలియజేస్తుంది. విభజన తర్వాత లక్షలాది మంది ప్రజలు తమ ప్రాంతాలను వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది. సంస్కృతి, భాష, సంప్రదాయాలు ఒకేలా ఉన్న ప్రజలు రెండు వైపులుగా విడిపోయారు. అయినప్పటికీ బెంగాల్ వారసత్వం రెండు ప్రాంతాల్లోనూ కొనసాగింది. అందుకే ‘పశ్చిమ బెంగాల్’ అనే పేరు కేవలం ఒక దిశను సూచించే పదం కాదు.. అది చరిత్రలో జరిగిన ఒక పెద్ద మార్పుకు గుర్తుగా నిలిచిపోయింది. అందుకే తూర్పు భారతదేశంలో ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ అనే పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పేరు వెనుక ఉన్న కథ మనకు ఒక ప్రాంతం పేరు కూడా ఎన్నో చారిత్రక సంఘటనలతో ముడిపడి ఉంటుందని గుర్తు చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories