ఈ రోజుల్లో బయట భోజనం చేయడం చాలామందికి ఒక సామాజిక కార్యకలాపంగా మారింది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఉద్యోగంలో ప్రమోషన్, స్నేహితులతో సమావేశాలు.. ఇలా ఎన్నో సందర్భాల్లో రెస్టారెంట్‌కు వెళ్లడం ఒక సంప్రదాయంగా మారింది. కొంతమంది తమ లైఫ్‌స్టైల్‌ను చూపించడానికి కూడా ఖరీదైన రెస్టారెంట్లను ఎంచుకుంటారు. దీనిని సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రంలో స్టేట్ సిగ్నలింగ్ అంటారు. అంటే మన అభిరుచి లేదా ఆర్థిక స్థితిని ఇతరులకు పరోక్షంగా తెలియజేయడం.
బయట తినడం తప్పు కాదు, కానీ సమతుల్యత అవసరం
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం, అప్పుడప్పుడు బయట భోజనం చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కానీ తరచూ బయట తినడం వల్ల అధిక ఉప్పు, నూనె, చక్కెర, కేలరీలు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందుకే ఎక్కువ రోజులు ఇంటి వంటనే తీసుకుని, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయట భోజనం చేస్తే ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి రెండింటికీ మేలు జరుగుతుంది.