
ఎక్స్పైరీ డేట్ అంటే ఒక వస్తువును ఉపయోగించడానికి తయారీదారు సూచించిన చివరి తేదీ. ఈ తేదీ దాటిన తర్వాత ఆ వస్తువును ఉపయోగించకూడదు. ముఖ్యంగా మందులు, చిన్న పిల్లలకు ఇచ్చే ఇన్ఫాంట్ ఫార్ములా, కొన్ని పాల ఉత్పత్తులపై ఈ తేదీని ముద్రిస్తారు. ఉదాహరణకు ఒక మందుపై నవంబర్ 15 ఎక్స్పైరీ డేట్‌గా ఉంటే.. ఆ తేదీ తర్వాత దానిని ఉపయోగించకూడదు. ఎందుకంటే గడువు ముగిసిన తర్వాత కొన్ని మందుల్లోని ఔషధ గుణాలు తగ్గిపోవచ్చు. దీంతో అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్స్పైరీ డేట్ దాటిన మందులు, సంబంధిత ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
బెస్ట్ బిఫోర్ అంటే ఒక ఆహార పదార్థం నిర్దిష్ట తేదీ వరకు అత్యుత్తమ నాణ్యతతో ఉంటుందని అర్థం. అంటే ఆ తేదీలోపు తీసుకుంటే దాని రుచి, వాసన, ఆకృతి, నాణ్యత బాగుంటాయి. సాధారణంగా బిస్కెట్లు, చిప్స్, పప్పులు, సాస్‌లు, ప్యాక్ చేసిన ఇతర ఆహార పదార్థాలపై ఈ వివరాలు ఉంటాయి. అయితే బెస్ట్ బిఫోర్ తేదీ దాటినంత మాత్రాన ఆ ఆహార పదార్థం వెంటనే పాడైపోయినట్లు కాదు. తయారీదారు సూచించిన విధంగా సరిగ్గా నిల్వ చేసి ఉంటే కొన్ని సందర్భాల్లో ఆ తేదీ తర్వాత కూడా వాటిని తీసుకోవచ్చు. అయితే వాటి రుచి, వాసన, కరకరలాడే లక్షణం, నాణ్యతలో మార్పులు రావచ్చు. అందుకే బెస్ట్ బిఫోర్ తేదీని ఆహార పదార్థం అత్యుత్తమ నాణ్యతతో ఉండే కాలంగా అర్థం చేసుకోవాలి.
ఈ రెండు పదాల మధ్య ప్రధానమైన తేడా వాటి ఉద్దేశంలో ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అనేది ఒక వస్తువును ఉపయోగించడానికి అనుమతించిన చివరి గడువును సూచిస్తుంది. ఆ తేదీ దాటిన తర్వాత దానిని ఉపయోగించకూడదు. మరోవైపు బెస్ట్ బిఫోర్ అనేది ఒక ఆహార పదార్థం ఎప్పటి వరకు అత్యుత్తమ నాణ్యతతో ఉంటుందో తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక బిస్కెట్ ప్యాకెట్‌పై డిసెంబర్ 10 బెస్ట్ బిఫోర్ అని ఉంటే.. ఆ తేదీ తర్వాత దాని రుచి లేదా కరకరలాడే లక్షణం తగ్గవచ్చు. కానీ అది తప్పనిసరిగా పాడైపోయిందని కాదు. అదే ఒక మందుపై డిసెంబర్ 10 ఎక్స్పైరీ డేట్ ఉంటే.. ఆ తేదీ తర్వాత దానిని ఉపయోగించకూడదు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఎక్స్పైరీ డేట్ అంటే ఆ గడువు తర్వాత ఉపయోగించకూడదు. బెస్ట్ బిఫోర్ అంటే ఆ తేదీలోపు ఉపయోగిస్తే నాణ్యత బాగుంటుంది. ఈ తేడాను తెలుసుకుంటే ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు, ఉపయోగించేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
బెస్ట్ బిఫోర్ తేదీ దాటినప్పటికీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చని చెప్పుకున్నాం. అయితే ఇందుకోసం వాటి పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలి. ప్యాకెట్ ఉబ్బిపోయినా, తెరిచినప్పుడు అసాధారణమైన వాసన వచ్చినా, ఆహార పదార్థంపై బూజు కనిపించినా వాటిని తీసుకోకూడదు. అలాగే రంగు మారడం, తేమ చేరడం, జిగురుగా మారడం వంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్యాకెట్‌పై పేర్కొన్న నిల్వ సూచనలను పాటించాలి. కొన్ని పదార్థాలను చల్లని ప్రదేశంలో ఉంచాలి. మరికొన్నింటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సి ఉంటుంది. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే బెస్ట్ బిఫోర్ తేదీ ముగియకముందే ఆహారం పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తేదీ ఒక్కటే చూసి ఆహారం సురక్షితమని నిర్ణయించకూడదు. దాని నిల్వ పరిస్థితి, ప్యాకెట్ స్థితి, ఇతర మార్పులను కూడా గమనించాలి.
సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా ప్యాకెట్‌పై ఉన్న తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ లేదా బెస్ట్ బిఫోర్ వివరాలను పరిశీలించాలి. గడువు దగ్గరలో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు వాటిని ఎప్పటిలోగా ఉపయోగించగలమో ఆలోచించాలి. ప్యాకెట్ చిరిగిపోయినా, ఉబ్బిపోయినా, సీల్ దెబ్బతిన్నా వాటిని కొనకూడదు.
ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆహార పదార్థాలను సూచించిన విధంగా నిల్వ చేయాలి. ప్యాకెట్ తెరిచిన తర్వాత గాలి, తేమ చేరకుండా జాగ్రత్త పడాలి. ఒకసారి తెరిచిన ఆహార పదార్థాలకు ప్యాకెట్‌పై ఉన్న బెస్ట్ బిఫోర్ తేదీ మాత్రమే వర్తిస్తుందని భావించకూడదు. తెరిచిన తర్వాత ఎంతకాలం నిల్వ చేయవచ్చో తయారీదారు సూచనలను కూడా పాటించాలి.
మొత్తానికి ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ రెండూ ఒకే అర్థాన్ని ఇవ్వవు. వీటి మధ్య తేడా తెలుసుకోవడం వల్ల గడువు ముగిసిన వస్తువులను ఉపయోగించడం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. కాబట్టి ఇకపై ఏదైనా ఆహార పదార్థం కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై ఉన్న తేదీలను తప్పనిసరిగా పరిశీలించండి.