
సిగరెట్‌లో ఉండే నికోటిన్ అనే రసాయనం చాలా వేగంగా మెదడుకు చేరుతుంది. సిగరెట్ తాగిన కొద్ది సెకన్లలోనే నికోటిన్ మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇది మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. డోపమైన్ వల్ల సంతోషం, సంతృప్తి, తాత్కాలిక ప్రశాంతత కలిగిన భావన ఏర్పడుతుంది. దీంతో మళ్లీ మళ్లీ సిగరెట్ తాగాలనే కోరిక పెరుగుతుంది. కొంతకాలానికి మెదడు నికోటిన్‌కు అలవాటు పడిపోతుంది. సిగరెట్ తాగకపోతే చిరాకు, ఆందోళన, ఏకాగ్రత తగ్గడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు మళ్లీ సిగరెట్ తాగుతారు. ఇలా శారీరకంగా, మానసికంగా నికోటిన్‌కు బానిసలవుతారు.
మద్యం కూడా మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇందులోని ఆల్కహాల్ మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరును మార్చుతుంది. దీనివల్ల కొంతసేపు ప్రశాంతంగా ఉన్నట్లు, ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గినట్లు భావిస్తారు. మొదట్లో స్నేహితులతో కలిసినప్పుడు, వేడుకలు జరిగినప్పుడు మాత్రమే మద్యం సేవించవచ్చు. కానీ క్రమంగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు కూడా తాగాలనే కోరిక పెరుగుతుంది. ఒక దశకు చేరుకున్నాక మద్యం లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. మద్యం మానేయడానికి ప్రయత్నించినప్పుడు వణుకు, చెమటలు పట్టడం, నిద్రలేమి, ఆందోళన వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన వ్యసనం ఉన్నవారిలో అకస్మాత్తుగా మద్యం మానేయడం వల్ల ఫిట్స్, భ్రమలు వంటి ప్రాణాపాయ సమస్యలు కూడా తలెత్తవచ్చు.
సిగరెట్ లేదా మద్యం అలవాటు ఎన్ని రోజుల్లో వ్యసనంగా మారుతుందనే దానికి కచ్చితమైన సమాధానం లేదు. ఇది ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదు. వ్యక్తి తీసుకునే మోతాదు, ఎంత తరచుగా తీసుకుంటున్నారు, శారీరక పరిస్థితులు, మానసిక స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి తక్కువ సమయంలోనే నికోటిన్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చు. మరికొందరిలో ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాగే మద్యం విషయంలోనూ రోజూ తాగడం, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వ్యసనం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల సిగరెట్‌కు ఆరు నెలల్లో, మద్యానికి ఒకటి లేదా రెండేళ్లలో వ్యసనం వస్తుందని కచ్చితంగా చెప్పలేం. అప్పుడప్పుడు తీసుకున్నా వ్యసనం వచ్చే అవకాశం లేదని కూడా భావించకూడదు.
ఈ రెండింటిలో ఏ వ్యసనాన్ని మానుకోవడం ఎక్కువ కష్టమో చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే రెండూ మెదడులోని రివార్డ్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అయితే నికోటిన్ చాలా వేగంగా మెదడుకు చేరడం, తరచూ సిగరెట్ తాగాలనే కోరిక కలగడం వల్ల దాని వ్యసనం నుంచి బయటపడటం చాలామందికి కష్టంగా ఉంటుంది. మరోవైపు మద్యానికి బానిసైనవారిలో శారీరక ఆధారపడటం తీవ్రంగా ఉండవచ్చు. మద్యం మానేసినప్పుడు వచ్చే విత్‌డ్రాయల్ లక్షణాలు కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారతాయి. అందుకే మద్యం వ్యసనం ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలోనే మానేయాలి. మొత్తంగా చూస్తే.. సిగరెట్ వ్యసనం నుంచి బయటపడటం దీర్ఘకాలికంగా సవాలుగా ఉండొచ్చు. మద్యం వ్యసనాన్ని అకస్మాత్తుగా మానేయడం మాత్రం కొన్ని సందర్భాల్లో మరింత ప్రమాదకరం. కాబట్టి ఏది ఎక్కువ కష్టం అనే దానికంటే రెండింటినీ వీలైనంత త్వరగా వదిలించుకోవడం ముఖ్యం.
సిగరెట్, మద్యం అలవాట్లను వదిలించుకోవడానికి ముందుగా మనకు ఆ అలవాటు ఉందనే విషయాన్ని అంగీకరించాలి. సిగరెట్ తాగాలనే కోరిక వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగడం, నడక, వ్యాయామం, ఇతర పనులతో దృష్టి మళ్లించడం ఉపయోగపడుతుంది. నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, వైద్యుల సూచనతో తీసుకునే మందులు కూడా సిగరెట్ మానేయడానికి సహాయపడతాయి. మద్యం అలవాటు ఉన్నవారు కూడా వైద్యుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా రోజూ ఎక్కువగా మద్యం సేవించే వారు ఒక్కసారిగా మానేయకూడదు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం కూడా వ్యసనం నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది.
గమనిక: సిగరెట్, మద్యం రెండూ ఆరోగ్యానికి హానికరమే. వీటిని ఎంత తక్కువగా తీసుకున్నా ప్రమాదం పూర్తిగా తొలగిపోదు. వ్యసనం నుంచి బయటపడేందుకు సరైన సమయంలో వైద్యుల సహాయం తీసుకోవడం ఉత్తమం.