
తెలుపు రంగు క్యాప్ (White Helmet) సాధారణంగా ఇంజనీర్లు, సైట్ మేనేజర్లు, ఉన్నత స్థాయి పర్యవేక్షణ అధికారులు ధరిస్తారు. నిర్మాణ పనులు సరిగ్గా జరుగుతున్నాయా? ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగుతున్నాయా? నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. తెలుపు రంగు పరిశుభ్రత, క్రమశిక్షణ, బాధ్యతకు ప్రతీకగా భావిస్తారు. నిర్మాణ ప్రాంతంలో ఇంజనీర్లు, పర్యవేక్షకులను ఇతర సిబ్బంది సులభంగా గుర్తించేందుకు ఈ రంగును ఉపయోగిస్తారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా, పనులకు సంబంధించి సందేహాలు వచ్చినా సంబంధిత అధికారిని త్వరగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.
పసుపు రంగు క్యాప్ (Yellow Helmet) సాధారణంగా నిర్మాణ పనులు చేసే కార్మికులు, సాధారణ వర్కర్లు ధరిస్తారు. ఇటుకలు మోయడం, సిమెంట్ కలపడం, యంత్రాల వద్ద పనిచేయడం, ఇతర నిర్మాణ పనుల్లో పాల్గొనడం వంటి బాధ్యతలు వీరిపై ఉంటాయి. పసుపు రంగు ప్రకాశవంతంగా ఉండటంతో దూరం నుంచి కూడా సులభంగా కనిపిస్తుంది. నిర్మాణ ప్రాంతాల్లో భారీ వాహనాలు, యంత్రాలు నిరంతరం కదులుతుంటాయి. అలాంటి ప్రదేశాల్లో కార్మికులను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. పసుపు రంగు క్యాప్‌లు ఈ విషయంలో సహాయపడతాయి. ముఖ్యంగా తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి గుర్తింపు పొందేందుకు ఉపయోగపడతాయి.
నీలం రంగు క్యాప్ (Blue Helmet) సాధారణంగా టెక్నీషియన్లు, ఎలక్ట్రికల్ సిబ్బంది, మెషిన్ ఆపరేటర్లు, నిర్వహణ విభాగంలో పనిచేసే వారికి కేటాయిస్తారు. పరిశ్రమల్లో యంత్రాలు నిరంతరం పనిచేస్తుంటాయి. వాటిలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే మరమ్మతులు చేయడం, విద్యుత్ పరికరాలను పరిశీలించడం, యంత్రాల పనితీరును పర్యవేక్షించడం వంటి పనులను టెక్నీషియన్లు నిర్వహిస్తారు. వీరిని ఇతర ఉద్యోగుల నుంచి వేరు చేసి గుర్తించేందుకు నీలం రంగు క్యాప్ ఉపయోగపడుతుంది. యంత్రాల నిర్వహణకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలో సిబ్బందికి సులభంగా అర్థమవుతుంది.
ఆకుపచ్చ రంగు క్యాప్ (Green Helmet) సాధారణంగా హెచ్ఎస్ఈ (HSE - Health, Safety and Environment) అధికారులు, సేఫ్టీ ఆఫీసర్లు ధరిస్తారు. పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన బాధ్యతలు వీరివి. కార్మికులు భద్రతా నియమాలు పాటిస్తున్నారా? అవసరమైన రక్షణ పరికరాలు ఉపయోగిస్తున్నారా? ప్రమాదకర ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వంటి అంశాలను వీరు పరిశీలిస్తారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వీరి ప్రధాన బాధ్యత.
ఆకుపచ్చ రంగు సాధారణంగా ఆరోగ్యం, భద్రత, ప్రకృతి, పర్యావరణానికి సంకేతంగా భావిస్తారు. అందుకే సేఫ్టీ విభాగంలో పనిచేసే వారికి ఈ రంగును కేటాయించే విధానం కొన్ని సంస్థల్లో కనిపిస్తుంది.
ఎరుపు రంగు క్యాప్ (Red Helmet) సాధారణంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సభ్యులు ధరిస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం, మంటలను అదుపు చేయడం, కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. ఎరుపు రంగు ప్రమాదం, అప్రమత్తత, అత్యవసర పరిస్థితులకు సంకేతంగా ఉంటుంది. అందువల్ల ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఇతర ఉద్యోగులు వెంటనే గుర్తించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమయానికి స్పందించడం ఎంతో ముఖ్యం.
బ్రౌన్ రంగు క్యాప్ (Brown Helmet) సాధారణంగా వెల్డర్లు, అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సిబ్బందికి కేటాయిస్తారు. ఇనుప వస్తువులను వెల్డింగ్ చేయడం, లోహాలను కత్తిరించడం, వేడి పరికరాలతో పనిచేయడం వంటి పనులను వీరు చేస్తుంటారు. వెల్డింగ్ సమయంలో నిప్పు రవ్వలు, అధిక వేడి, కాంతి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విభాగంలో పనిచేసే వారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు బ్రౌన్ రంగు క్యాప్‌లను ఉపయోగించే విధానం కొన్ని పరిశ్రమల్లో ఉంది. వీరికి సాధారణ క్యాప్‌తో పాటు వెల్డింగ్ హెల్మెట్, ముఖ రక్షణ కవచం, చేతి తొడుగులు వంటి అదనపు భద్రతా పరికరాలు కూడా అవసరం.
పరిశ్రమలు, నిర్మాణ ప్రాంతాల్లో వందల మంది కార్మికులు ఒకేసారి పనిచేస్తుంటారు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరి పేరు, హోదా తెలుసుకోవడం కష్టం. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరిని సంప్రదించాలి? ఎవరు ఏ బాధ్యత నిర్వహిస్తున్నారు? అనే విషయాలు వెంటనే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యకు రంగుల విధానం ఒక పరిష్కారంగా మారింది. క్యాప్‌ల రంగులను బట్టి ఉద్యోగుల విభాగాలను సులభంగా గుర్తించవచ్చు. దీనివల్ల పనుల పర్యవేక్షణ వేగంగా జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత సిబ్బందిని త్వరగా సంప్రదించవచ్చు. కొత్తగా పనిలో చేరినవారికి కూడా వివిధ విభాగాల ఉద్యోగులను గుర్తించడం సులభమవుతుంది.
అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో ఒకే రకమైన క్యాప్‌ల రంగుల నిబంధన లేదు. కొన్ని దేశాల్లో, సంస్థల్లో, నిర్మాణ ప్రాజెక్టుల్లో రంగుల కేటాయింపులు భిన్నంగా ఉంటాయి. ఆయా సంస్థల భద్రతా నిబంధనలను బట్టి ఈ రంగులను నిర్ణయిస్తారు. ఉదాహరణకు, బ్రిటన్‌లోని హైవేస్ ఇంగ్లండ్ సంస్థ కూడా తన నిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక హెల్మెట్ రంగుల విధానాన్ని రూపొందించింది. అలాగే క్యాప్ రంగు వల్ల భద్రత లభించదు. అది కేవలం ఉద్యోగి బాధ్యతను గుర్తించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రమాదాల నుంచి తలకు రక్షణ కల్పించాలంటే నాణ్యమైన సేఫ్టీ హెల్మెట్ ధరించడం, దాని నాణ్యతా ప్రమాణాలు, సరైన వినియోగం ముఖ్యం.