కట్టెల పొయ్యికి సమాధి కట్టిన ఓ ఆధునిక సమాజమా... ఇక అనుభవించు..!

Published : Mar 13, 2026, 09:17 PM IST

అభివృద్ధి పేరుతొ కట్టెల పొయ్యికి సమాధి కట్టిన నాగరిక సమాజం .. కట్టె కాలేవరకైనా నేటి మనుషుల్ని కాపాడుతుందా..? గల్ఫ్ నుంచి పెట్రోల్, వంట గ్యాస్ సరఫరా ఆగిపొతే..?వంటలేక .. కొన్ని కోట్ల కుటుంబాలు..ఉద్యోగాలు పోయి .. లక్షలాది మంది బతుకులు ఆగం అవుతాయి. 

PREV
16
కట్టెల పొయ్యి..!

నేను పిజి పూర్తి చేసి హైదరాబాద్ కు వచ్చేదాకా మా ఊళ్ళో.. అన్ని ఇళ్లలో కట్టెల పొయ్యిలే!

హైదరాబాద్, ఇక్రిశాట్ లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో తొలిసారి గ్యాస్ బండ చూసాను. (పిజి హాస్టల్లో ఉండేది. కానీ ఎప్పుడో కానీ కిచెన్ కు పోము కదా?)

ఆ రోజుల్లో ప్రభుత్వాల తరపున రేడియో , దూరదర్శన్, ఇంకా పత్రికలు... కట్టెల పొయ్యి వల్ల కలిగే నష్టాలను బాగా ప్రచారం చేసేవి.

1. వంట చెరకు కోసం అడవులను నరకడం వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది. అడవుల విస్తీర్ణం తగ్గి ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. అడవులు తగ్గడం వల్ల వన్యమృగాలు అంతరించి పోతున్నాయి. అతివృష్టి, అనావృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి ఆస్తి, ప్రాణనష్టం సాధారణం అయిపోతుంది.

2. పశువులు గొర్రెలు, మేకలు మేపడం వల్ల అడవులు నాశనం అయిపోతాయి. గిరిజన తెగలు పోడు వ్యవసాయం చేయడం వల్ల అడవులు అంతరించి పోతున్నాయి.

3 . కట్టెల పొయ్యి వినియోగం వల్ల మహిళల ఊపిరితిత్తులు,కళ్ళు పాడైపోతున్నాయి...

ఇదీ ఆ రోజుల్లో ఊదరగొట్టిన విషయాలు...

నిజమే.. పైన చెప్పినవన్నీ నిజాలే.

కాదనడం లేదు.

ప్రభుత్వాలే అనుకొంటే మార్పు రాక చస్తుందా..?

వచ్చింది..

ఇప్పుడు మా ఊరే కాదు.. ప్రతి ఊళ్ళో... ప్రతి ఇంట్లో గ్యాస్ బండలు.

సాధారణ ప్రజలు, తమ వంటగది అవసరాల కోసం కట్టెలు కొట్టడం చాలా మటుకు మానేశారు కదా..!

మరి అడవులు.. ఆకుపచ్చగా, దట్టంగా విస్తరించి ఉండాలి కదా..?

జరిగిందేమిటి?

26
అడవుల్ని నాశనంచేస్తున్న ఆధునిక పందికొక్కులు..

పంది కొక్కులు చూసారు కదా..?

ఏనుగు సైజు ఉన్న పంది కొక్కుల్ని ఊహించుకోండి.

ఎక్కడ ఉన్నాయి అంటారా..?

జస్ట్... ఒక సారి ఊహించుకోండి.

ఏనుగు సైజు ఉన్న పంది కొక్కులు అడవుల్ని తొలిచేస్తే ఎలా ఉంటుంది ?

మా ఊరు.. ఆ మాటకొస్తే ఆ ప్రాంతం మొత్తం... అడవుల పరిస్థితి నేడు ఇదే..!

గ్రానైట్ ఫ్యాక్టరీవారు ప్రతి అడవిని .. ప్రతి బండను తొలిచేశారు. ఇప్పుడు అక్కడ చెట్లు లేవు.

బండలు కూడా లేవు .

కుప్పకుప్పలుగా చిన్న రాళ్లు..

అక్కడ మరో వెయ్యేళ్ళు కూడా చెట్లు మొలవవు.

అడవుల పై ప్రేమ ఎక్కడికి పోయింది ?

కట్టెల పొయ్యి కన్నా కోటి రెట్లు విధ్వంసం సృష్టించే గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఎందుకు అనుమతి ఇచ్చినట్టు..?

అడవిని గ్రానైటుడి మెషిన్ పందికొక్కు తొలిచేయడంతో.. పాపం.. ఎన్నో వేల ఏళ్లుగా అక్కడ బతికిన అడవి పందులు, జింకలు, కోతులు (మా ప్రాంతంలో కాదు కానీ మరి కొన్ని చోట్ల ఏనుగులు, పులులు) ఊళ్ళపై, పంట పొలాలపై పడి అంతంత మాత్రంగా ఉన్నవ్యవసాయాన్ని దెబ్బ తీస్తున్నాయి.

ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు.

36
ఎకరం పొలముంటే ఎంజాయ్ చేసిన రోజులవి..

స్వయం సమృద్ధి గ్రామాలు..!

మా ఊళ్ళో ప్రతి మూడిళ్లకు ఒక విధవరాలు ఉండేది (ఈ మాట వాడడం నాకు ఇష్టం లేదు. ఆ రోజుల్లో ఆలా అనేవారు. అందుకే చెప్పాను). భార్య-భర్తల మధ్య ఎక్కువ ఏజ్ గాప్ వుండడం బహుశా దీనికి ఒక కారణం.

మా అమ్మమ్మనే ఒక ఉదాహరణగా చెబుతాను .

మా అమ్మ చిన్నప్పుడే మా అమ్మమ్మ భర్త.. అదే మా తాత చనిపోయాడట .

ఇద్దరు కూతుళ్లు .. ఒక కొడుకు..

జస్ట్ అర్ధ ఎకరా పొలం ..

మగ దిక్కు లేదు .

మంది - మార్బలం లేదు .

సంపద లేదు .

మా అమ్మమ్మ .. మాణిక్యమ్మ ...

పెద్ద కూతుర్ని టీచర్ చేసింది.

కొడుకు బిహెచ్ఈఎల్ లో ఉద్యోగి.

చిన్నకూతురు ముందుగా ఇక్రిశాట్ లో అటుపై బెంగళూరులో .. అందరూ హ్యాపీగా సెటిల్.

సమాజం నేడు ఇంత డెవలప్ అయినా బతకలేక.. ఆత్మహత్య చేసుకొంటున్న వారెందరో ..

అలాంటిది ఆ రోజుల్లో మొగుడు అర్ధాంతరంగా చనిపోతే మాణిక్యమ్మ ఇంత అద్భుతాన్ని ఎలా సాధ్యం చేసింది?

ఒక్క మాణిక్యమ్మ కాదు ..

మా వూళ్ళో ఎందరో మాణిక్యాలు .. మట్టిలో మాణిక్యాలు.

ఇంట్లో ఎప్పుడూ ఒకటో రెండో ఆవులు. పాలు ..

పాలతో మా ఊళ్ళో కుటుంబాలకు కుటుంబాలు నడిచిపోయాయి . ఇంట్లో ఎప్పుడూ 6-7 కోళ్లు . కోడిగుడ్లు. దీపావళికి కనుమకు కోడి కూర. ఇంకా ఊళ్ళో ఏట కూర

చెరువు నిండేది. దానితో వడ్లు .. రాగులు .. జొన్నలు..

ఇంకా మిరప తోట.. మిరప తోట అంటే కేవలం మిరపకాయలు కాదు. ఉల్లి గడ్డలు .. ఇంట్లో అటకపైన ఎప్పడూ ఉల్లి గడ్దలు వేలాడుతూ ఉండేవి. తక్కాళి (అరవం ఇన్ఫ్లుయెన్స్.. టమాటోను తక్కాళి అని పిలిచేవారు).. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు.. పెరట్లో గుమ్మడి కాయలు.

46
ఆనాటి పల్లె జీవితం ఎంత హాయి..

ఎకరా పొలం ఉంటే కోటి ఎప్పుడు పలుకుతుంది..? రింగ్ రోడ్డు ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసే రోజులు ఇప్పుడు..

అర్ధ ఎకరా పొలం ఒక కుటుంబానికి సంవత్సరానికి కావాల్సిన ధాన్యం కాయగూరలు.. ఆకుకూరలు ఇచ్చేది అంటే.. నాకే నమ్మబుద్ధి కాదు (బహుశా మెట్టపొలంతో కలుపుకొంటే అర్ధ ఎకరం కంటే కాస్త ఎక్కువగా ఉండేదేమో)

వెనుతిరిగి చూస్తే ఆ రోజులు చిత్రంగా అనిపిస్తాయి.

నమ్మబుద్ధి కాదు.

గాదెలో ధాన్యం.. కంచంలో అంబలి.. సంగటి..

విలాసాలు లేవు.

కానీ పూట గడిచేది.

నాకు తెలిసి పస్తులు లేవు (అంతకు ముందు ఉండేవట.. ప్రభుత్వాలు అంబలి కేంద్రాలు తెరిచి కరవు కాలంలో అంబలి ఉచితంగా పోసేవారట).

మార్పు అనివార్యం .. కానీ ఎవరి కోసం..?

ఇది వెనుకబాటుతనం .. ప్రజలు డెవలప్ కావాలి అని ప్రభుత్వాలు స్వచ్చంద సంస్థలు.. నడుం బిగించాయి .

మంచిదే కదా అని అనుకొన్నాను.

ఇప్పడు అడవులు పోయాయి.

ఆ రోజుల్లో వంటచెరకు కోసం చెట్లు మొదలంటా నరికేవారు కారు. ఎండిన కొమ్మలు తీసుకొనేవారు.

మేకలు, గొర్రెలు ఒక పక్క మేసినా మరో పక్క అడవి చిగురించేది.

అడవిని నమ్ముకొని.. లక్షల ఏళ్ళు మనిషి బతికాడు. అడవీ బతికింది.

తల్లీ-బిడ్డలు..!

అడవి తల్లి బిడ్డకు పాలిచ్చేది.

పాలు తాగే బిడ్డ తల్లి స్థనాన్ని కొరికి తినేస్తాడా ?

ఎవడ్రా చెప్పింది ?

వేల ఏళ్ళు ... పోడు సాగు చేసినా అడవి తల్లి ఎలా బతికింది..?

నేడు నాగరిక మానవుడు అడవిని అమ్ముకొన్నాడు.

బజార్లో వేలంవేసి అడవి తల్లి స్థనాన్ని..మొత్తం శరీరాన్ని... కాల్చి నంజుకొని తింటున్నాడు.

గ్రానైట్ పరిశ్రమలు లేకుంటే.. సాయంకాలానికీ ముక్క- చుక్క ఎట్లా వస్తుంది..?

లైఫ్ లో కిక్కు ఏముంటుంది..?

గ్రామా శివారుల్లో.. గ్రానైట్ పరిశ్రమల మెషిన్ పందికొక్కులు తొలిచేసిన అడవి తల్లి అస్థికల్లో..బీరు.. ప్లాస్టిక్ బాటిళ్ల ను అడుగు. మనిషి ఎంత డెవలప్ అయిపోయాడో చెబుతాయి..!

కళ్ళుండీ జరిగిన అభివృద్ధి విధ్వంసాన్ని చూడలేని కబోది అయితే ఎలా బ్రో!

56
అభివృద్ధి వల్ల ఎవరికి లాభం...

నేటి బతుకు - గాలిలో దీపం .

ట్రంపయ్య .. ఉఫ్ మని వూదితే మన బతుకు దీపాలు ఆరిపోతాయి..!

కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతకే నగరజీవి అల్లాడిపోతున్నాడు .

రెస్టారెంట్స్ మూతబడిదే అందులో పనిచేసేవారి బతుకులు రోడ్డుపై.

జరగకూడదు.. జరగదు.

కానీ...

ఒక్కసారి ఊహించుకొందాము. గల్ఫ్ నుంచి... పెట్రోల్, వంట గాస్ సరఫరా ఆగిపొతే..?

వంటలేక .. కొన్ని కోట్ల కుటుంబాలు..

ఉద్యోగాలు పోయి .. లక్షలాది మంది.

ఎన్నోఏళ్లుగా ప్రకృతిని నమ్ముకొని మనిషి బతుకుతూ వచ్చాడు.

అభివృద్ధి పేరుతొ స్వయం సమృద్ధి బతుకులకు తూట్లు పొడిచారు.

కట్టెల పొయ్యి గురించి ఆ రోజుల్లో చేసిన ప్రచారం.. అడవులపై... మహిళలపై... ప్రేమ తో చేసిందా..?

లేక GULF దేశాల వ్యాపారుల ప్రయోజనాల కోసం చేసిందా..?

రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు... ట్రాక్టర్ లు.. ఇన్ని వచ్చినా రైతు బాగుపడక పొతే పోయ..!

ఉరితాళ్లు బిగిస్తున్నాయి ఎందుకు?

పల్లెలు నిర్మానుష్యంగా మారుతున్నాయి ఎందుకు..?

అదే సమయంలో

పెట్రోల్, గ్యాస్ బండ, రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు .. ఈ వ్యాపారాలు మాత్రం కోట్లకు పడగలెట్టారు...

టెక్నాలిజీ గొప్పదే

మార్పు అనివార్యం.

కానీ ఈ మార్పు ఎవరి కోసం..?

ప్రయోజనాలు ఎవరు పొందున్నారు..?

66
ఏఐ ఏం చేస్తుందో..?

ఇప్పుడు కృతిమ మేథ .

దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు .

కానీ...

దీని కారణంగా మరో ఇరవై ఏళ్ళలో కొన్ని కోట్ల కుటుంబాలు.. మధ్య తరగతి కుటుంబాలు.. పేదరిక స్థాయికి .. ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల పై ఆధారపడి బతికే స్థాయికి దిగజారిపోతాయి .

మనిషి కోసం సాంకేతిక పరిజ్ఞానం.

కానీ సాంకేతిక పరిఙ్ఞానం కోసం మనిషైతే..?

ప్రపంచ కుబేరులు ఆడే నాటకాలు మామూలుగా ఉండవు .

వాళ్ళు ఎక్కడినుంచో నరుక్కొని వస్తారు.

నీ కోసం గొయ్యి తవ్వుతూనే నీ చేతనే శభాష్ అనిపించగల నేర్పరి తనం వారిది.

సెర్వికల్ కాన్సర్ నివారణ పేరుతొ.. ఇప్పుడు జరుగుతున్న డ్రామాలు .. ఒక లేటెస్ట్ ఉదాహరణ .

అభివృద్ధి పేరుతొ కట్టెల పొయ్యికి సమాధి కట్టిన నాగరిక సమాజం .. కట్టె కాలేవరకైనా నేటి మనుషుల్ని కాపాడుతుందా..?

Read more Photos on
click me!

Recommended Stories