
BRICS... ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో గట్టిగా వినిపిస్తోంది. ఈ అంతర్జాతీయ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తుండటమే దీనికి కారణం. దేశ రాజధాని న్యూడిల్లీ 18వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది… సెప్టెంబర్ 12-13 తేదీల్లో అంటే శని, ఆదివారం ప్రపంచ దేశాల అధినేతలతో బిక్స్ సమావేశం జరగనుంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో ఇండియా చేరుకున్నారు… మరికొంతమంది విదేశీ ప్రతినిధులు కూడా దేశ రాజధానికి చేరుకున్నారు
ఇక చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ బ్రిక్స్ సదస్సు కోసం ఇండియాకు రానున్నారు. ఇలా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఇండియా, రష్యా, చైనా ఒక్కచోటికి చేరుతున్నాయి... అంతర్జాతీయ సమీకరణలకు వేగంగా మార్చే ఈ కలయిక భారత్ లో జరుగుతుండటం ఆసక్తికరం. బ్రిక్స్ సదస్సు కోసం ఇప్పటికే న్యూడిల్లీలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు... పోలీసులు, భద్రతా బలగాలు ఈ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రెండ్రోజుల పాటు యావత్ ప్రపంచం చూపు డిల్లీపైనే ఉండనుంది.
న్యూఢిల్లీ కేంద్రంగా BRICS కూటమికి చెందిన కీలక సమావేశాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు బ్రిక్స్ అంటే ఏమిటి? ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఈ కూటమి ఎలా ఏర్పడింది? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. వీటిని ఇక్కడ క్లియర్ చేసుకుందాం.
BRICS (బ్రిక్స్) అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందుతున్న, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య రాజకీయ, దౌత్య, ఆర్థిక సహకారం కోసం ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. BRICS అనే పేరు ఐదు దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో వచ్చింది. మొదట Brazil (బ్రెజిల్), Russia (రష్యా), India (భారత్), China (చైనా) దేశాల పేర్ల నుంచి BRIC అనే పదం ఏర్పడింది. తరువాత దక్షిణాఫ్రికా కూడా ఈ కూటమిలో చేరడంతో చివర్లో S అక్షరం చేరింది... దీంతో BRICS గా మారింది. అయితే ప్రస్తుతం ఈ ఐదు దేశాలే కాకుండా మరికొన్ని దేశాలు కూడా ఈ బ్రిక్స్ కూటమిలో పూర్తి సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి... BRICS ను ఐక్యరాజ్యసమితి లేదా యూరోపియన్ యూనియన్ తరహాలో ప్రత్యేక ఒప్పందంతో ఏర్పడిన సంస్థగా భావించకూడదు. దీనికి ప్రత్యేక రాజ్యాంగ ఒప్పందం, స్వంత శాశ్వత సెక్రటేరియట్ లేదా ప్రత్యేక బడ్జెట్ లేవు. సభ్యదేశాలు పరస్పర చర్చలు, సహకారం, సమ్మతి ఆధారంగా వివిధ అంశాలపై కలిసి పనిచేస్తాయి.
బ్రిక్స్ లో ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి?
ప్రస్తుతం బ్రిక్స్ (BRICS) లో మొత్తం 11 పూర్తి సభ్యదేశాలు ఉన్నాయి. అవి బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా.
అయితే BRICS లో సభ్యదేశాలతో పాటు 'పార్ట్నర్ కంట్రీస్' అనే మరో వర్గం కూడా ఉంది. 2024లో రష్యాలోని కజాన్ సదస్సులో ఈ భాగస్వామ్య దేశాల విధానాన్ని ఏర్పాటు చేశారు. 2025లో బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్థాన్, మలేషియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలు భాగస్వామ్య దేశాలుగా చేరాయి. తరువాత వియత్నాం కూడా ఈ భాగస్వామ్య వర్గంలోకి వచ్చింది. అయితే సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల హోదాలు ఒకటే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈ బ్రిక్స్ కథ నిజానికి 2001లో ప్రారంభమైంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఆర్థికవేత్త జిమ్ ఓ'నీల్ ఒక పరిశోధనా రిపోర్ట్ లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా దేశాలను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా ప్రస్తావించారు. ఈ నాలుగు దేశాలను కలిపి BRIC అనే పదాన్ని ఉపయోగించారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నది ఆ విశ్లేషణలోని ప్రధాన భావన.
అయితే అప్పట్లో BRIC అనేది ఎలాంటి అంతర్జాతీయ కూటమి కాదు. అది ప్రధానంగా ఆర్థిక విశ్లేషణలో ఉపయోగించిన పదం. కానీ కాలక్రమంలో ఈ నాలుగు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సహకారం పెరిగింది. 2006లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో మొదటి సమావేశం జరిగింది. ఆ తర్వాత BRIC ఒక చర్చా ప్లాట్ ఫామ్ గా వేగంగా రూపుదిద్దుకుంది.
బ్రిక్ దేశాల అధినేతల మొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని యెకతెరిన్‌బర్గ్‌లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నాయకుల స్థాయిలో సదస్సులు నిర్వహిస్తూ అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, అభివృద్ధి, ఇంధనం వంటి అంశాలపై చర్చించడం ప్రారంభమైంది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సమయంలో BRIC దేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం ఉండాలనే అంశాన్ని బలంగా ముందుకు తెచ్చాయి.
అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాల్లో అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండకుండా, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలకూ తగిన స్థానం కల్పించాలన్న ఆలోచన BRIC సహకారంలో కీలకంగా మారింది.
BRIC కూటమిలోకి దక్షిణాఫ్రికా ప్రవేశించడంతో ఈ కూటమిలో కీలకమైన మార్పు జరిగింది. 2011లో దక్షిణాఫ్రికా అధికారికంగా చేరడంతో BRIC పేరు BRICS గా మారింది. ఇది కూటమి విస్తరణకు మొదటి పెద్ద అడుగు. దక్షిణాఫ్రికా చేరికతో ఆఫ్రికా ఖండానికి కూడా ఈ కూటమిలో ప్రాతినిధ్యం లభించింది. దీంతో BRICS కేవలం నాలుగు పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమిగానే కాకుండా ఆసియా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాలకు విస్తరించిన సహకార సంస్థగా ఎదగడం ప్రారంభించింది.
బ్రిక్స్ కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణాల్లో ఒకటి ప్రపంచ పాలనా వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించడం. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF), ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వంటి అంతర్జాతీయ వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు మరింత బలంగా వినిపించాలనేదే ఈ బ్రిక్స్ ఉద్దేశం. అదే సమయంలో సభ్యదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం, ఇంధనం, మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచడం కూడా BRICS లక్ష్యాల్లో భాగం.
2023 లో BRICS విస్తరణ
ఈ బ్రిక్స్ కూటమి చరిత్రలో మరో కీలక మలుపు 2023లో వచ్చింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో కూటమిని మరింత విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితంగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలను చేర్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విస్తరణ 2024 నుంచి అమల్లోకి వచ్చింది. 2025 జనవరిలో ఇండోనేషియా పూర్తి సభ్యదేశంగా అధికారికంగా చేరింది. దీంతో బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్య 11కు చేరింది.
బ్రిక్స్ అనేది పాశ్చాత్య దేశాలకు వ్యతిరేక కూటమా?
బ్రిక్స్ గురించి తరచుగా వినిపించే మరో ప్రశ్న ఇదే. బ్రిక్స్ ను కేవలం పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిగా చూడటం సరైనది కాదు. అధికారికంగా BRICS తనను గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారం, సమన్వయం కోసం పనిచేసే సంస్థగా పేర్కొంటోంది. ప్రపంచ పాలనా వ్యవస్థ మరింత సమతుల్యంగా, సమగ్రంగా ఉండాలని ఈ సంస్థ ప్రధానంగా కోరుతోంది. అయితే సభ్యదేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తమ ప్రభావాన్ని పెంచుకోవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్తుండటంతో ప్రపంచ రాజకీయాల్లో బ్రిక్స్ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది.
బ్రిక్స్ కు సొంత బ్యాంక్ ఉందా?
బ్రిక్స్ సహకారం కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితం కాలేదు. సభ్యదేశాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో New Development Bank (NDB) ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు, స్థిరమైన అభివృద్ధి వంటి రంగాల్లో నిధుల సమీకరణకు ఈ బ్యాంకు కీలకమైన వ్యవస్థగా ఎదిగింది. ఇదే బ్రిక్స్ ప్రాధాన్యాన్ని మరింత పెంచిన అంశాల్లో ఒకటి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యామ్నాయ ఆర్థిక సహకార మార్గాలను బలోపేతం చేయాలన్న ఆలోచనకు ఇది ఉదాహరణగా నిలిచింది.
బ్రిక్స్ లో భారత్‌కు మొదటి నుంచే కీలక స్థానం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కూడా బ్రిక్స్ లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలను అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావించడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం వంటి విషయాల్లో బ్రిక్స్ భారత్‌కు ఒక ముఖ్యమైన ప్లాట్ ఫామ్ గా ఉంది.
2026లో భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో భారత పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2026 జనవరిలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతకు సంబంధించిన లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో బ్రిక్స్ షెర్పాస్ తొలి సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు దేశాధినేతలతో పూర్తిస్థాయి బ్రిక్స్ సమావేశం జరగనుంది.
ఒకప్పుడు నాలుగు దేశాల ఆర్థిక సామర్థ్యాన్ని సూచించేందుకు ఉపయోగించిన బ్రిక్ అనే పదం.. ఇప్పుడు 11 సభ్యదేశాలు, పలు భాగస్వామ్య దేశాలతో కూడిన విస్తృత అంతర్జాతీయ సహకార సంస్థగా మారింది. ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో BRICS పరిధి కూడా విస్తరిస్తోంది. అందుకే బ్రిక్స్ ను కేవలం ఒక దేశాల సమూహంగా కాకుండా, ప్రపంచ వ్యవస్థలో గ్లోబల్ సౌత్ పాత్రను పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఖ్యమైన దౌత్య, ఆర్థిక సంస్థగా చూడవచ్చు. 2001లో ఒక ఆర్థిక విశ్లేషణలో పుట్టిన 'BRIC' అనే పదం.. రెండు దశాబ్దాల వ్యవధిలో ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం ఈ BRICS ప్రయాణంలోనే అత్యంత ఆసక్తికరమైన విషయం.