సినిమా రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే, రొటీన్‌కి భిన్నంగా థ్రిల్లింగ్ కంటెంట్ ఉంటే భాషలకు అతీతంగా సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. `కేజీఎఫ్`, `కాంతార`, `విక్రమ్`, `ఆర్‌ఆర్‌ఆర్`, `కార్తికేయ2`, `సీతారామం` వంటి సినిమాలే అందుకు నిదర్శనం. అలానే తాజాగా హిందీలో రూపొందిన `బేడియా` చిత్రాన్ని తెలుగులో `తోడేలు`గా విడుదల చేస్తున్నారు. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రమిది. తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తుండటం విశేషం. నేడు శుక్రవారం(నవంబర్ 25న) ఈ చిత్రం విడుదలైంది. మరి పైన పేర్కొన్న చిత్రాల జాబితాలో చేరిందా? లేక రెగ్యూలర్‌గానే అనిపించుకుందా? అనేది రివ్యూలో(Thodelu Review) తెలుసుకుందాం.
కథః
భాస్కర్(వరుణ్ ధావన్) చిన్నపాటి కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్టు దక్కించుకుంటాడు. ఈ కాంట్రాక్ట్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి సొంతంగా ఇల్లు, కారు కొనుకుని లైఫ్‌లో సెటిల్ కావాలనుకుంటాడు. రోడ్డు నిర్మాణం కోసం అరుణాచల్ ప్రదేశ్‌కి తన స్నేహితుల(దీపక్ దోబ్రియా, పాలిన్ బకర్)ను అక్కడికి బయలు దేరుతాడు. అక్కడ అడవి మధ్యలోనుంచి రోడ్డు వేయాలనుకుంటాడు. లోకల్ అధికారులు అందుకు నో చెప్పగా, కమీషన్ ఎరజూపుతాడు. కానీ అనూహ్యంగా ఓ రోజు రాత్రి తోడేలు కాటుకు గురవుతాడు. దీంతో ప్రతి రోజు రాత్రి ఆయన తోడేలుగా మారుతుంటాడు. రోజుకి ఒక్కరిని చంపితింటుంటాడు. అడవిని నాశనం చేయాలనుకున్న వారిని, అందుకు సంబంధించి అవినీతికి పాల్పడిన వారిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలో అతన్ని మామూలు మనిషి చేసేందుకు అక్కడ వెటర్నరీ డాక్టర్ అనిక(కృతిసనన్) సహాయం చేస్తుంది. మరి భాస్కర్ మళ్లీ మామూలు మనిషి అయ్యాడా? ఇంతకి డాక్టర్ అనిక ఎవరు? వాళ్ల ప్రేమ కథేంటి? ఆ తోడేలు కథేంటి? ప్రకృతి చెప్పే నీతి ఏంటి? అనేది మిగిలిన కథ. Thodelu Review.
విశ్లేషణః
ప్రకృతి(అడవి)ని విధ్వంసం చేస్తే అది ప్రతీకారం తీర్చుకుంటుందని, అందుకు కారకులైన మనుషులను అంతం చేస్తుందనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. ప్రకృతిని కాపాడేందుకు తోడేలు బాధ్యత తీసుకోవడం ఇక్కడ ఆకట్టుకునే అంశం. ఆ సందేశాన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం బాగుంది. అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో తోడేలు విన్యాసాలు, హీరో తోడేలుతో పడే బాధలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మనిషి మనుగడకి ప్రధాన కారకమైన అడవులను కాపాడాలనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చినా, మనకు ఇలాంటి కాన్సెప్ట్ మాత్రం కొత్తదనే చెప్పాలి. అయితే హాలీవుడ్ లో చాలా సినిమాలే వచ్చాయి. సూపర్ నేచురల్ పవర్స్ తో, విజువల్ వండర్‌గా, మనిషి జంతువులుగా మారి భూమిని కాపాడే నేపథ్యంతో చాలా సినిమాలు వచ్చాయి. ఆకట్టుకున్నాయి. ఇది కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. ప్రకృతిని(అడవిని) కాపాడేందుకు ఇందులో మనిషి తోడేలుగా మారి అవినీతి పరులను, ప్రకృతికి హాని కలిగించే వారిని అంతం చేయడమనేది ఆసక్తికర అంశం. దీనికి హీరో ఫ్రెండ్స్ తో కామెడీగా కథని నడిపించిన తీరు బాగుంది. చివర్లో హీరోయిన్ కూడా తోడేలు అనే ట్విస్ట్, క్లైమాక్స్ లో హీరోహీరోయిన్లు తోడులుగా మారి పోరాడే సన్నివేశాలు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు. Thodelu Review.
ఇదిలా ఉంటే కథ పరంగా, క్లైమాక్స్, ట్విస్ట్ లు ఆకట్టుకున్నా, సినిమా నడిచిన తీరు కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. స్లోగా రన్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో సోల్, ఎమోషన్స్ మిస్ అయ్యాయి. ఏ సినిమాకైనా ఎమోషన్స్ చాలా కీలకం. ఆ ఎమోషనే సినిమాని నడిపిస్తుంది. కానీ ఇందులో ఆ ఎమోషన్ సినిమా ఆసాంతం క్యారీ కాలేదు. దీంతో సీన్లుగానే సినిమా కనిపిస్తుంటుంది. కట్ పేస్ట్ తరహాలో సన్నివేశాలు కనిపిస్తుంటాయి. ఈ విషయంలో ఇంకా కేర్ తీసుకుని, బలమైన ఎమోషన్స్ తో సినిమాని తెరకెక్కించి ఉంటే ఫలితం నెక్ట్స్ లెవల్‌గా ఉండేది. దీంతో యావరేజ్ మూవీగా, మంచి ప్రయత్నంగానే మిగిలిపోయింది. చిన్న పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసే చిత్రమవుతుందని చెప్పడంలో సందేహం లేదు. గ్రాఫిక్స్, త్రీడీ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్స్. గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. అంత సహజంగా ఉన్నాయి. త్రీడీలో యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తుంటే గూస్‌బంమ్స్ వస్తుంటాయి. అవి సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.
నటీటులుః
భాస్కర్ పాత్రలో వరుణ్ ధావన్ అద్బుతంగా చేశాడు. పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. మనకు తెలియని నటుడు అనే ఫీలింగే రాకుండా చేశాడు. మనిషి నుంచి తోడేలుగా మారే సన్నివేశాలు, కామెడీ సన్నివేశాల్లో ఇరగదీశాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. వెటర్నరీ డాక్టర్ గా కృతి సనన్ ఆకట్టుకుంది. ఆమె పాత్రలో టిస్ట్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. వరుణ్ ధావన్ స్నేహితులుగా దీపక్, పాలిన్ బాగా చేశారు. నవ్వులు పూయించారు. బోర్ ఫీలింగ్ నుంచి రిలీఫ్ ఇచ్చారు. ఇతర నటులకు పెద్దగా స్కోప్ లేదు. Thodelu Review.
టెక్నీషియన్ల పనితీరుః
దర్శకుడు అమర్ కౌశిక్ మంచి పాయింట్‌తో సినిమాని తెరకెక్కించారు. తెరపై దాన్ని అంతే బాగా ఆవిష్కరించారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే కథనాన్ని నడిపించే విధానంలో, ఎమోషన్స్ ని క్యారీ చేయడంలో దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. అంతటి సీరియస్ కథలోనూ కామెడీని పండించడం అభినందించాల్సిందే. అద్భుతం చేశారని చెప్పలేం గానీ, అభినందించదగ్గ ప్రయత్నం చేశారు. జిష్ణు భట్టాచార్జి విజువల్ బాగున్నాయి. సినిమాకి ప్లస్ అయ్యాయి. సచిన్, జిగర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే చివర్లో వచ్చే పాట మేకింగ్ కి, ట్యూన్ సెట్ కాలేదు. సంయుక్త కాజా ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ చేయాల్సింది. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. నిర్మాత నిరేన్ భట్ బాగా తెరకెక్కించారు. Thodelu Review.
ఫైనల్‌గా ః `తోడేలు` మన ఇండియన్ సినిమాలో ఓ ప్రయోగం. అభినందించదగ్గ ప్రయత్నం.
రేటింగ్‌ః 2.75